[1] ఇస్రాయేల్ వంశీయులారా, మీకు యెహోవా చెప్పే మాట వినండి.
[2] యెహోవా చెప్పేదేమిటంటే, “ఇతర జనాల బ్రతుకు తీరును నేర్చుకొని అవలంబించవద్దు. వాళ్ళు ఆకాశంలో కనిపించే సూచనలకు భయపడే విధంగా మీరు భయపడవద్దు.
[3] ఆ జనాల ఆచారాలు నిష్‌ప్రయోజనం. అడవిలో చెట్టును నరికివేస్తారు. పనివాడు దానిని గొడ్డలితో చెక్కుతాడు.
[4] అప్పుడు వాళ్ళు వెండి బంగారాలతో దానిని అలంకరిస్తారు. అది కదలకుండా సుత్తెతో మేకులు దిగగొట్టివేస్తారు.
[5] వాళ్ళ విగ్రహాలు దోసతోటలో దిష్టిబొమ్మల్లాగా ఉన్నాయి. అవి మాట్లాడలేవు, నడవలేవు కూడా. వాటిని మోసుకుపోవాలి. వాటికి భయపడవద్దు. అవి ఏమీ హాని చేయలేవు, ఏమీ మంచి చేయలేవు.”
[6] యెహోవా! నీలాంటివాడెవ్వడూ లేడు. నీవు గొప్పవాడివి. బలప్రభావాలలో నీ పేరు గొప్పది.
[7] నీవు జనాలకు రాజువు. నీవంటే అందరికీ భయభక్తులు కలగాలి. అది తగినదే. జనాలన్నిటిలో, వాళ్ళ రాజ్యాలన్నిటిలో ఉన్న జ్ఞానులందరిలో నీలాంటివాడెవ్వడూ లేడు.
[8] వాళ్ళంతా బుద్ధిలేనివాళ్ళు, మూర్ఖులు. వాళ్ళు పొందే ఉపదేశం వ్యర్థం – దానిని ఇచ్చినది చెక్క విగ్రహం!
[9] తర్షీషునుంచి సాగగొట్టిన వెండి రేకులను, ఉపాజునుంచి బంగారాన్ని తెస్తారు. అది పనివాళ్ళు, కంసాలులు చేసిన పని. ఆ విగ్రహాలకు నీలి, ఊదా రంగులున్న బట్టలు తొడిగిస్తారు. అదంతా నేర్పరులైన పనివాళ్ళు చేసిన పని.
[10] గాని, యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవంగలదేవుడు, శాశ్వతంగా ఉండేరాజు. ఆయన కోపగిస్తే భూమి కంపిస్తుంది. ఆయన ఆగ్రహాన్ని జనాలు భరించలేరు.
[11] “మీరు వాళ్ళతో ఇలా చెప్పాలి: భూమిని, ఆకాశాన్ని కలిగించని దేవుళ్ళు, దేవతలు భూమిమీద, ఆకాశంక్రింద ఉండకుండా నాశనం అవుతారు.”
[12] ఆయన తన బలంచేత భూమిని కలుగజేశాడు. జ్ఞానపూర్వకంగా ప్రపంచాన్ని సృజించాడు. తన తెలివితో ఆకాశాలను పరిచాడు.
[13] ఆయన ఆజ్ఞ జారీ చేస్తే ఆకాశంలో నీళ్ళ ధ్వని వినబడుతుంది. భూమి కొనలనుంచి మబ్బులు పైకి వచ్చేలా ఆయన చేస్తాడు. వానతోపాటు మెరుపు పుట్టిస్తాడు. తన గిడ్డంగులలో నుంచి గాలి రప్పిస్తాడు.
[14] ప్రతి మనిషీ మూఢుడు, తెలివితక్కువవాడు. విగ్రహాలు చేసే ప్రతివాడూ వాటివల్ల అవమానం పాలవుతాడు. వాడు పోత పోసిన విగ్రహాలు అబద్ధం. వాటిలో ఊపిరి కూడా లేదు.
[15] అవి పనికిమాలినవి. హేళనకు తగినవి. అవి తీర్పుకు గురి అయ్యేటప్పుడు, అవి నిర్మూలమవుతాయి.
[16] యాకోబు వంశానికి వారసత్వంగా ఉన్నవాడు వాటిలాంటివాడు కాడు. ఆయన సమస్తాన్ని కలగజేసినవాడు. ఇస్రాయేల్‌ప్రజ ఆయన సొత్తు. ఆయన పేరు సేనలప్రభువు యెహోవా.
[17] ముట్టడి వేసిన స్థలంలో కాపురమున్నవారలారా! దేశం విడిచి వెళ్ళడానికి సామాను కూర్చుకోండి.
[18] యెహోవా చెప్పేదేమిటంటే, “ఇప్పుడు ఈ దేశనివాసులను బయటికి విసరివేస్తాను. వారు పట్టబడాలని వారిమీదికి చేటు రప్పిస్తాను.”
[19] అయ్యో! నాకు దెబ్బ తగిలింది. నా గాయం మానేది కాదు. అయితే నేను “ఇది నా బాధ. నేను సహించాలి” అనుకొన్నాను.
[20] నా డేరా పాడైపోయింది. తాళ్ళన్నీ తెగిపొయ్యాయి. నా సంతానం నాదగ్గరనుంచి పోయారు. వారు ఇక లేరు. నా డేరా మళ్ళీ వేయడానికి, నా అడ్డతెరలు పెట్టడానికి ఎవ్వరూ లేరు.
[21] కాపరులు మందమతులు. ఉపదేశంకోసం యెహోవాను అడగరు. గనుకనే వాళ్ళు వర్ధిల్లడం లేదు. వాళ్ళ మంద చెదరిపోయి ఉంది.
[22] వినండి! ఉత్తర దేశంలో మహా చలనం ఉన్నట్టు వార్త వినబడుతూ ఉంది. దానివల్ల యూదా పట్టణాలు పాడైపోతాయి, నక్కలకు ఉనికిపట్టుగా మారిపోతాయి.
[23] యెహోవా! మనిషి త్రోవ తన వశంలో లేదని నాకు తెలుసు. తన అడుగులు సరిగా వేయడం మనిషి తరం కాదు.
[24] యెహోవా! నన్ను న్యాయంగా శిక్షించి సరిదిద్దు గాని, కోపంగా వద్దు. అలా చేస్తే నేను బొత్తిగా లేకుండా పోతాను.
[25] నీ విషయం నిర్లక్ష్యంగా ఉన్న జనాలమీద, నీ పేర ప్రార్థన చేయని జాతులమీద నీ కోపాగ్ని కుమ్మరించు. వాళ్ళు యాకోబు వంశాన్ని దిగమ్రింగివేశారు. నిర్మూలం చేయాలని దిగమ్రింగివేశారు. దాని నివాస స్థలాలను పాడు చేశారు.