[1] ఎలీషామా మనుమడూ నెతన్యా కొడుకూ అయిన ఇష్మాయేల్ రాజవంశంవాడు, రాజు అధికారులలో ఒకడు. ఏడో నెలలో అతడు పదిమంది మనుషులతో కూడా మిస్పాలో ఉన్న అహీకాం కొడుకైన గెదల్యాదగ్గరికి వచ్చాడు. వారందరూ మిస్పాలో కలిసి భోజనం చేశారు.
[2] ఉన్నట్లుండి నెతన్యా కొడుకు ఇష్మాయేల్ అతడితోపాటు ఉన్న ఆ పదిమంది మనుషులు లేచి ఖడ్గంతో షాఫాను మనుమడూ అహీకాం కొడుకు అయిన గెదల్యాను కొట్టారు బబులోను రాజు దేశంమీద అధిపతిగా నియమించిన ఆ గెదల్యాను చంపారు.
[3] అంతేగాక, మిస్పాలో గెదల్యాదగ్గర ఉన్న యూదులందరినీ, అక్కడ కనిపించిన కల్దీయ సైనికులను కూడా ఇష్మాయేల్ హతమార్చాడు.
[4] అతడు గెదల్యాను చంపిన సంగతి ఎవరికీ తెలియదు. మరుసటి రోజే ఇలా జరిగింది:
[5] ఎనభైమంది మనుషులు గడ్డం గీక్కొని బట్టలు చింపుకొని శరీరాన్ని కోసుకొని షెకెం, షిలోహు, షోమ్రోను పట్టణాల నుంచి వచ్చారు. యెహోవా ఆలయానికి నైవేద్యాలను, ధూపద్రవ్యాన్ని తీసుకువస్తూ ఉన్నారు.
[6] వారిని కలుసుకోవడానికి నెతన్యా కొడుకు ఇష్మాయేల్ మిస్పానుంచి బయలుదేరి నడుస్తూ ఏడుస్తూ వెళ్ళాడు. వారిని కలుసుకొని “అహీకాం కొడుకు గెదల్యాదగ్గరికి రండి” అని వారితో చెప్పాడు.
[7] వారు పట్టణంలోకి వచ్చాక, నెతన్యా కొడుకు ఇష్మాయేల్ అతడితో కూడా ఉన్న మనుషులు వారిని చంపి, ఒక గోతిలో పడవేశారు.
[8] అయితే వారిలో పదిమంది ఇష్మాయేల్‌తో “మమ్మల్ని చంపవద్దు. మాకు పొలంలో దాచిపెట్టిన గోధుమలు, యవలు, నూనె, తేనె ఉన్నాయి” అన్నారు. గనుక అతడు వారిని వారి తోడివాళ్ళతోపాటు చంపక మానుకొన్నాడు.
[9] ఇష్మాయేల్ గెదల్యాను చంపినప్పుడు అతనితోకూడా హతం చేసిన మనుషుల మృతదేహాలను పడవేసిన గోతిని త్రవ్వించినది ఆసారాజు. ఒకప్పుడు ఇస్రాయేల్ రాజు బయెషాను ఎదుర్కొంటూ ఉంటే ఆసారాజు దానిని త్రవ్వించాడు. నెతన్యా కొడుకు ఇష్మాయేల్ దానిని మృతదేహాలతో నింపాడు.
[10] ఆ తరువాత ఇష్మాయేల్ మిస్పాలో ఉన్న మిగతావారందరినీ చెరపట్టాడు కావలివాళ్ళ అధిపతి నెబుజరదాన్ అహీకాం కొడుకు గెదల్యాకు అప్పగించిన ప్రజలందరితోపాటు రాజు కుమార్తెలను చెరపట్టాడు. నెతన్యా కొడుకు ఇష్మాయేల్ వారిని చెరపట్టి అమ్మోను దేశస్థులదగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు.
[11] నెతన్యా కొడుకు ఇష్మాయేల్ చేసిన దుర్మార్గమంతటి విషయం కారేహ కొడుకు యోహానాను, అతడితోకూడా ఉన్న సైన్యాధిపతులు విన్నారు.
[12] వెంటనే వారు తమ మనుషులందరినీ తీసుకొని, నెతన్యా కొడుకు ఇష్మాయేల్‌తో యుద్ధం చేయడానికి తరలివెళ్ళారు. గిబియోనులో ఉన్న పెద్ద చెరువుదగ్గర అతడు వారికి దొరికాడు.
[13] కారేహ కొడుకు యోహానానునూ అతడితోకూడా ఉన్న సైన్యాధిపతులనూ చూచి ఇష్మాయేల్‌తో ఉన్నవారంతా సంతోషించారు.
[14] మిస్పాలో ఇష్మాయేల్ చెరపట్టినవారంతా అతణ్ణి విడిచి, కారేహ కొడుకు యోహానానుదగ్గరికి చేరారు.
[15] అయితే నెతన్యా కొడుకు ఇష్మాయేల్ తన మనుషులలో ఎనిమిదిమంది యోహానాను దగ్గరనుంచి తప్పించుకొని అమ్మోనువాళ్ళ దగ్గరికి పారిపోయారు.
[16] నెతన్యా కొడుకు ఇష్మాయేల్ అహీకాం కొడుకు గెదల్యాను హతం చేసిన తరువాత, ఇష్మాయేల్ దగ్గర ఉన్న మిగతా మిస్పావారందరినీ సైనికులను, స్త్రీలను, పిల్లలను, రాజపరివారాన్ని గిబియోనునుంచి కారేహ కొడుకు యోహానాను అతడితోకూడా ఉన్న సైన్యాధిపతులందరూ మళ్ళీ తీసుకువచ్చారు.
[17] అక్కడనుంచి వారందరూ ప్రయాణమై బేత్‌లెహేందగ్గర ఉన్న గెరూత్‌కింహాంలో దిగారు.
[18] బబులోను రాజు దేశంమీద అధికారిగా నియమించిన అహీకాం కొడుకైన గెదల్యాను నెతన్యా కొడుకు ఇష్మాయేల్ చంపినందుచేత వారు కల్దీయవాళ్ళకు భయపడ్డారు, గనుక ఈజిప్ట్‌కు వెళ్ళిపోదామను కొన్నారు.