Skip to content
Opens in a new window

[1] ఇది యెహోవానుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు:

[2] “లేచి కుమ్మరివాడి ఇంటికి వెళ్ళు. అక్కడ నీకు నా మాటలు వినిపిస్తాను.”

[3] నేను కుమ్మరివాడి ఇంటికి చేరినప్పుడు అతడు తన సారెమీద పని చేస్తూ ఉన్నాడు.

[4] అతడు బంకమట్టితో చేస్తూ ఉన్న కుండ అతడి చేతుల్లో పాడైపోయింది. కుమ్మరి తనకిష్టం వచ్చినట్టు ఆ మట్టితోనే ఇంకో కుండ చేశాడు.

[5] అప్పుడు యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:

[6] “ఇస్రాయేల్‌ప్రజలారా! యెహోవా చెప్పేదేమిటంటే, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మిమ్ములను చేయ లేననుకొంటున్నారా? ఇది యెహోవా వాక్కు. ఇస్రాయేల్ ప్రజలారా! కుమ్మరి చేతిలో బంకమట్టిలాగా మీరు నా చేతిలో ఉన్నారు.

[7] నేను ఏదైనా జనాన్ని గురించి, రాజ్యాన్ని గురించి ‘దానిని పెరికివేస్తాను, పడద్రోసి నాశనం చేస్తాను’ అంటాను అనుకోండి.

[8] ఒకవేళ, నేను హెచ్చరించిన ఆ జనం చెడుగు చేయడం మానుకొంటే, దానిమీదికి రప్పిస్తానని నేను అనుకొన్న విపత్తు విషయం నేను జాలిపడి దానిని రప్పించను.

[9] నేను ఇంకో జనాన్ని గురించి, రాజ్యాన్ని గురించి ‘దానిని వృద్ధి పొందిస్తాను, సుస్థిరం చేస్తాను’ అంటాననుకోండి.

[10] ఆ జనం నా మాట వినకుండా, నా దృష్టిలో చెడుగు చేస్తే, నేను దానికి చేస్తాననుకొన్న మేలు విషయం సంతాపపడుతాను.

[11] “యిర్మీయా! యూదావారితో, జెరుసలం నివాసులతో ఇలా చెప్పు: యెహోవా చెప్పేదేమిటంటే, నేను మీకు వ్యతిరేకంగా కీడును కల్పిస్తున్నాను, ఉపాయం పన్నుతున్నాను. మీరు – ఒక్కొక్కరు – మీ చెడ్డ త్రోవలను విడిచి, మీ విధానాలను, ప్రవర్తనను సరిదిద్దుకోండి.

[12] అందుకు వాళ్ళు ‘అది లాభం లేదు. మేము మా ఆలోచనలప్రకారం ప్రవర్తిస్తాం. ఒక్కొక్కరం మా చెడ్డ హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్ని అనుసరిస్తాం’ అంటారు.

[13] “అందుచేత యెహోవా చెప్పేదేమిటంటే, ఇలాంటిది ఎప్పుడైనా ఎవరికైనా వినబడిందా? జనాలమధ్య అడిగి తెలుసుకోండి. ఇస్రాయేల్ కన్య చేసినది చాలా ఘోరం.

[14] లెబానోను పర్వతంమీద బండలపై మంచు లేకుండా పోతుందా? దూరంనుంచి పారే దాని చల్లని వాగులు ఇంకిపోతాయా?

[15] నా ప్రజలైతే నన్ను మరచిపోయారు. వాళ్ళు పనికిమాలిన విగ్రహాలకు ధూపం వేస్తారు. వారి త్రోవలలో, పురాతన మార్గాలలో తొట్రుపడ్డారు. రహదారిన కాదు, డొంక బాటలో నడుస్తూ ఉన్నారు.

[16] దానికి ఫలితంగా వాళ్ళ దేశం పాడైపోతుంది. అది ఎప్పటికీ ఎగతాళికి గురి అవుతుంది. ఆ దారిన వెళ్ళేవారంతా నిర్ఘాంతపోయి తలలు ఊపుతారు.

[17] తూర్పుగాలిలాగా నేను వారిని శత్రువుల ఎదుట చెదరగొట్టివేస్తాను. వారి ఆపద రోజున వారికి నా ముఖం చూపించే బదులు నా వీపు చూపిస్తాను.”

[18] అప్పుడు వాళ్ళు ఇలా చెప్పుకొన్నారు: “యిర్మీయామీద కుట్ర పన్నుదాం పట్టండి. అయినా యాజులు ధర్మశాస్త్రం వినిపించకుండా ఉండరు, జ్ఞానులు ఆలోచన చెప్పడం మానరు. ప్రవక్తలు సందేశాలు వినిపించకుండా ఉండరు. అతడి మాటలు ఏమీ వినకుండా, మన మాటలతో అతణ్ణి నిందిద్దాం రండి.”

[19] యెహోవా! నా మొర ఆలకించు. నా విరోధులు చెప్పేది విను.

[20] చేసిన మేలుకు కీడు చేయడం యుక్తమా? వాళ్ళపైనుంచి నీ కోపం తొలగించడానికి నీ ఎదుట నేను నిలబడి మంచిగా వాళ్ళను గురించి మాట్లాడిన సంగతి నీవు తలచుకో. అయినా వాళ్ళు నా ప్రాణం తీయాలని గొయ్యి త్రవ్వారు.

[21] గనుక వాళ్ళ పిల్లలను కరవుపాలు చెయ్యి. వాళ్ళను ఖడ్గానికి గురి చెయ్యి. వాళ్ళ భార్యలు సంతానాన్ని కోల్పోయి విధవరాండ్రు అయ్యేలా చెయ్యి. వాళ్ళలో పురుషులు హతమై చనిపోతారు గాక!

[22] అకస్మాత్తుగా నీవు వాళ్ళమీదికి దండెత్తేవాళ్ళను రప్పించడంచేత వాళ్ళ ఇండ్లలోనుంచి కేకలు వినబడుతాయి గాక! నన్ను పట్టుకోవడానికి వాళ్ళు గుంట తవ్వారు. నా కాళ్ళను చిక్కించుకోవాలని వలలు దాచారు.

[23] యెహోవా! నన్ను చంపడానికి వాళ్ళు చేసిన కుట్ర అంతా నీకు తెలుసు. వాళ్ళ అపరాధాలను కప్పివేయకు. వాళ్ళ పాపాలు నీ ఎదుటనుంచి తుడిచివేయవద్దు. వాళ్ళు నీ సన్నిధానంలో కూలుతారు గాక! నీవు కోపగించే కాలంలో వాళ్ళపట్ల యుక్తంగా వ్యవహరించు.

యిర్మీయా — Chapters