Skip to content
Opens in a new window

[1] యెహోవా చెప్పేదేమిటంటే, “యూదా రాజు నగరుకు వెళ్ళి అక్కడ ఈ సందేశం ప్రకటించు:

[2] దావీదు సింహాసనంమీద కూర్చుని ఉన్న యూదా రాజా! యెహోవా సందేశం విను. నీవు, నీ సిబ్బంది, ఈ ద్వారాలగుండా ప్రవేశించే నీ ప్రజలు వినాలి.

[3] యెహోవా ఇలా అంటున్నాడు: నీతిన్యాయాలను అనుసరించి ప్రవర్తించండి. దోచుకోబడ్డ వారిని దౌర్జన్యపరుల చేతిలోనుంచి విడిపించండి. విదేశీయులను, తండ్రిలేని వారిని, వితంతువులను బాధపెట్టకండి. వారిమీద దౌర్జన్యం చేయకండి. ఈ స్థలంలో నిరపరాధుల రక్తం ఒలికించకండి.

[4] మీరు ఈ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తే, అప్పుడు ఇలా జరుగుతుంది – దావీదు సింహాసనమెక్కే రాజులు ఈ నగరు ద్వారాలగుండా ప్రవేశిస్తారు. రథాలమీద, గుర్రాలమీద వస్తూ పోతూ ఉంటారు. వారివెంట వారి సిబ్బంది, వారి జనం వస్తారు.

[5] కాని, మీరు ఈ ఆజ్ఞలను శిరసావహించకపోతే ఈ నగరు పాడైపోతుంది. నామీదే ఆనబెట్టి చెపుతున్నాను. ఇది యెహోవా వాక్కు.”

[6] యూదా రాజు నగరును గురించి యెహోవా ఇలా చెపుతున్నాడు: “నాకు నీవు గిలాదు ప్రదేశం లాగా, లెబానోను పర్వత శిఖరంలాగా ఉన్నావు. అయినా నిన్ను ఎడారిలాగా, ఎవ్వరూ కాపురం లేని పట్టణంలాగా చేసితీరుతాను.

[7] నేను నీమీదికి రావడానికి వినాశకారులను ప్రత్యేకిస్తాను. ఒక్కొక్కరు ఆయుధాలు పట్టుకొని వస్తారు. నీ మంచి దేవదారు మ్రానులను నరికివేసి అగ్నిలో వేస్తారు.

[8] అనేక దేశాలవాళ్ళు ఈ నగరం ప్రక్కగా ప్రయాణం చేస్తూ, ఒకరితో ఒకరు ‘యెహోవా ఈ గొప్ప నగరాన్ని ఇలా చేయడం ఎందుకని?’ అని అడుగుతారు.

[9] ‘ఎందుకంటే, వాళ్ళు తమ దేవుడు యెహోవా చేసిన ఒడంబడికను విసర్జించి ఇతర దేవుళ్ళను పూజించి సేవించారు’ అని జవాబిస్తారు.”

[10] చనిపోయినవాణ్ణి గురించి ఏడ్వవద్దు, విలపించవద్దు. వెళ్ళిపోయేవాణ్ణి గురించే బాగా ఏడ్వండి. ఎందుకంటే అతడు మరెప్పుడూ తిరిగి రాడు, తాను పుట్టిన దేశాన్ని చూడడు.

[11] యూదా రాజైన యోషీయా కొడుకు షల్లూం తన తండ్రి స్థానంలో పరిపాలన చేసి, ఈ స్థలంనుంచి వెళ్ళిపోయిన తరువాత అతణ్ణి గురించి యెహోవా ఇలా చెప్పాడు: “అతడు ఇక్కడికి ఎన్నడూ తిరిగి రాడు.

[12] అతణ్ణి బందీగా తీసుకుపోయిన స్థలంలోనే చనిపోతాడు. అతడు ఇంకెప్పుడూ ఈ దేశం చూడడు.

[13] “అక్రమంగా తన నగరును, అన్యాయంగా తన మేడ గదులను కట్టించుకొనేవాడికి బాధ తప్పదు. ఇరుగు పొరుగువాళ్ళచేత ఊరికే పని చేయించుకొని వాళ్ళ కూలీ వాళ్ళకు ఇవ్వకుండా ఉండేవాడికి బాధ తప్పదు.

[14] అతడు ‘నేను పెద్ద నగరును కట్టించుకొంటాను. దానికి విశాలమైన మేడ గదులుంటాయి’ అనుకొంటాడు. దానికి పెద్ద కిటికీలు చేయించుకొని, దేవదారు పలకలతో పొదుగుతాడు, ఎర్ర రంగుతో అలంకరిస్తాడు.

[15] దేవదారు విషయం ఇతరులతో నీవు పోటీ చేసినంతమాత్రాన నీవు రాజువు కావచ్చావా? నీ తండ్రికి తినడానికీ త్రాగడానికీ ఉంది గదా. అప్పుడు అతడికి క్షేమంగానే ఉంది కూడా.

[16] అతడు బీదవారిపట్ల, అక్కరలో ఉన్న వారిపట్ల న్యాయం జరిగించాడు. అప్పుడు అంతా క్షేమంగానే ఉంది. అలా చేయడమే నన్ను తెలుసుకోవడం గదా. ఇది యెహోవా వాక్కు.

[17] కాని, నీ నేత్రాశ, నీ హృదయాభిలాష అక్రమ సంపాదనమీద, నిర్దోషుల రక్తం ఒలికించడంమీద, ప్రజలమీద దౌర్జన్యం, బలత్కారం చూపడంమీద మాత్రమే ఉంది.”

[18] కనుక యూదా రాజూ, యోషీయా కొడుకూ అయిన యెహోయాకీం విషయం యెహోవా చెప్పేదేమిటంటే, “ప్రజలు ‘అయ్యో, సోదరా! అయ్యో, సోదరీ!’ అంటూ విలపించరు. ‘అయ్యో, నా యజమానీ! అయ్యో, ఆయన ఘనత!’ అంటూ రోదనం చేయరు.

[19] “అతణ్ణి జెరుసలం ద్వారాల బయటికి ఈడ్చుకుపోయి, అక్కడ పారవేసి, గాడిదను పాతిపెట్టినట్లు పాతిపెట్టడం జరుగుతుంది.

[20] “లెబానోను పర్వతమెక్కి అక్కడ కేకలు వేయి. బాషానులో గొంతెత్తి అరవు! అబారీంనుంచి నీ కేకలు వినిపించు! ఎందుకంటే నీ ప్రేమికులు అందరూ నాశనమయ్యారు.

[21] నీవు నిర్భయంగా ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడాను గాని, నీవు ‘నేను వినను’ అన్నావు. చిన్నప్పటి నుంచి నీవు అలాగే ప్రవర్తించావు – నా మాట వినకుండా ఉన్నావు.

[22] నీ నాయకులంతా గాలికి కొట్టుకుపోతారు. నీ ప్రేమికులు బందీలుగా తప్పక వెళ్ళిపోతారు. అప్పుడు నీ చెడుగు అంతటినిబట్టి నీవు సిగ్గుకు, అవమానానికి గురి అవుతావు.

[23] ‘నీవు లెబానోనుమీద ఉన్న దేవదారు వృక్షాలలో గూడు కట్టుకొన్నా, ప్రసవిస్తూవున్న స్త్రీకి కలిగే నొప్పిలాంటి వేదనలు నీకు కలుగుతాయి. నీవు ఎంత మూలుగుతావు!”

[24] యెహోవా చెప్పేదేమిటంటే, “యూదా రాజైన యెహోయాకీం కొడుకు కొన్యా! నా కుడి చేతికి రాజముద్రికలాగా ఉన్నా నేను నిన్ను అక్కడనుంచి పెరికివేస్తాను. నా జీవంతోడని శపథం చేస్తున్నాను.

[25] నీవు బబులోను రాజైన నెబుకద్‌నెజరుకూ కల్దీయవాళ్ళకూ భయపడుతూ ఉన్నావు గదా. వాళ్ళు నీ ప్రాణం తీయడానికి చూస్తున్నారు గదా. నేను నిన్ను వాళ్ళ వశం చేస్తాను.

[26] నిన్ను కన్న తల్లినీ, నిన్నూ వేరే దేశంలోకి విసరివేస్తాను. మీరు అక్కడ పుట్టలేదు గాని, అక్కడే చస్తారు.

[27] వాళ్ళు తిరిగి రావాలని మనసారా ఆశపడే ఈ దేశానికి మరెన్నడూ రారు.

[28] ఈ మనిషి కొన్యా, అందరి తృణీకారానికి గురి అయిన ఓటికుండలాంటివాడా? ఎవరికీ ఇష్టం లేని పాత్రవంటివాడా? అతణ్ణి, అతడి సంతానాన్ని వాళ్ళకు తెలియని దేశంలోకి విసరివేయడం ఎందుకని?

[29] దేశమా! దేశమా! దేశమా! యెహోవా వాక్కు విను!

[30] యెహోవా చెప్పేదేమిటంటే, ఈ మనిషి సంతానం లేనివాడనీ బ్రతికినన్నాళ్ళలో అభివృద్ధి పొందనివాడనీ వ్రాయండి. ఎందుకంటే, అతడి సంతానంలో ఎవడూ అభివృద్ధి పొందడు, ఎవడూ దావీదు సింహాసన మెక్కడు, ఎవడూ ఎన్నడూ యూదాలో పరిపాలించడు.”

యిర్మీయా — Chapters