Skip to content
Opens in a new window

[1] యెకొన్యారాజు, రాజమాత, అతడి పరివారం, యూదాలో, జెరుసలంలో ఉన్న అధికారులు, శిల్పకారులు, స్వర్ణకారులు జెరుసలంనుంచి బందీలుగా వెళ్ళిపోయిన తరువాత ఇలా జరిగింది:

[2] యిర్మీయాప్రవక్త లేఖ వ్రాసి, నెబుకద్‌నెజరు జెరుసలంనుంచి బబులోనుకు బందీలుగా తీసుకుపోయిన వారిలో మిగిలిన పెద్దలకూ, యాజులకూ, ప్రవక్తలకూ ప్రజలందరికీ దానిని పంపించాడు.

[3] యూదా రాజైన సిద్కియా బబులోను రాజైన నెబుకద్‌నెజరుదగ్గరికి బబులోనుకు షాఫాను కొడుకు ఎల్యాషానూ హిల్కీయా కొడుకు గెమర్యానూ పంపినప్పుడు, యిర్మీయా ఈ లేఖ వాళ్ళచేత పంపించాడు. అందులో వ్రాసిన మాటలు ఇవి:

[4] ఇస్రాయేల్‌ప్రజల దేవుడూ, సేనలప్రభువూ అయిన యెహోవా, తాను జెరుసలంనుంచి బబులోనుకు బందీలుగా పంపినవారందరికీ ఇలా చెపుతున్నాడు:

[5] “ఇండ్లు కట్టుకోండి, వాటిలో కాపురముండండి. తోటలు నాటి, వాటి కాపు అనుభవించండి.

[6] పెండ్లి చేసుకొని కొడుకులనూ కూతుళ్ళనూ కనండి. అక్కడ మీ సంఖ్య తగ్గిపోకుండా ఎక్కువ కావాలి. గనుక మీ కొడుకులకూ కూతుళ్ళకూ సంతానం కలిగేలా మీ కొడుకులకు పెళ్ళిళ్ళు చేయండి, మీ కూతుళ్ళకు భర్తలను సంపాదించండి.

[7] నేను మిమ్ములను బందీలుగా పంపిన నగరానికి క్షేమం చేకూరేలా ప్రయత్నం చేయండి. దానికి క్షేమం చేకూరితే మీకూ క్షేమం చేకూరుతుంది, గనుక ఆ నగరంకోసం యెహోవాకు ప్రార్థన చేయండి.

[8] ఇస్రాయేల్‌ప్రజల దేవుడూ, సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, మీ మధ్య ఉన్న ప్రవక్తలచేత, సోదె చెప్పేవాళ్ళవల్ల మోసపోకండి. వాళ్ళు కలల భావం చెపితే వినవద్దు.

[9] వాళ్ళు నా పేర అబద్ధాలు మీకు ప్రకటిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు. ఇది యెహోవా వాక్కు.”

[10] యెహోవా చెప్పేదేమిటంటే, “బబులోనురాజ్యానికి డెబ్భై సంవత్సరాలు గడిచినతరువాత, నేను మిమ్ములను సందర్శించి ఈ స్థలానికి తిరిగి తీసుకువస్తాను. నేను మీకు ఇచ్చిన ఆ మాట నెరవేరుస్తాను.

[11] మీ విషయం నేను చేసిన ఆలోచనలు నాకు తెలుసు. మీకు క్షేమమే చేకూరాలని నా ఉద్దేశం గాని, హాని కాదు. మీకు ఆశాభావంతో నిండిన భవిష్యత్తును కలిగిద్దామని నా ఆశయం. ఇది యెహోవా వాక్కు.

[12] “అప్పుడు మీరు నాకు మనవి చేసుకొంటారు. వచ్చి నాకు ప్రార్థన చేస్తారు. నేను మీ ప్రార్థన వింటాను.

[13] మీరు నన్ను వెదకుతారు. హృదయపూర్వకంగా నన్ను వెదకేటప్పుడు నన్ను కనుగొంటారు కూడా.

[14] నేను మీకు దొరుకుతాను. ఇది యెహోవా వాక్కు. నేను మిమ్ములను చెరలోనుంచి ఇక్కడికి తీసుకువస్తాను. నేను ఈ స్థలంలోనుంచి మిమ్ములను బందీలుగా పంపించాను. నేను మిమ్ములను పారదోలిన అన్ని జనాల మధ్యనుంచి, అన్ని స్థలాలనుంచి ఈ స్థలానికీ మిమ్ములను తిరిగి సమకూరుస్తాను. ఇది యెహోవా వాక్కు.

[15] మీరు అన్నారు, ‘బబులోనులో మాకోసం యెహోవా ప్రవక్తలను నియమించాడు.’

[16] అయితే యెహోవా ఇలా చెపుతున్నాడు: “దావీదు సింహాసనమెక్కి పరిపాలించే రాజు విషయం, మీతోకూడా బందీలుగా వెళ్ళకుండా ఈ నగరంలో ఉంటున్న మీ ప్రజలందరి విషయం సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,

[17] వాళ్ళమీదికి నేను ఖడ్గాన్ని, కరవును, ఘోరమైన అంటురోగాన్ని రప్పించబోతున్నాను. కుళ్ళిపోయి, తినడానికి వీలు కాకుండా ఉన్న అంజూరుపండ్లలాగా వాళ్ళను చేస్తాను.

[18] వాళ్ళను ఖడ్గంచేత, కరవుచేత, ఘోరమైన అంటురోగంచేత బాధించి చెదరగొట్టివేస్తాను. లోక రాజ్యాలన్నిటికీ వాళ్ళను అసహ్య కారణంగా చేస్తాను, నేను వాళ్ళను పారదోలే జనాలన్నిటిమధ్య వాళ్ళను శాపానికీ తృణీకారానికీ ఎగతాళికీ నిందకూ గురి చేస్తాను.

[19] ఎందుకంటే, వాళ్ళు నా మాటలు వినలేదు. ఇది యెహోవా వాక్కు. నేను పొద్దున్నే లేచి నా సేవకులైన ప్రవక్తలచేత వాళ్ళదగ్గరికి నా మాటలు పంపించాను గాని, వాళ్ళు వాటిని చెవిని పెట్టలేదు. మీరు కూడా చెవినిపెట్టలేదు. ఇది యెహోవా వాక్కు.

[20] “ఇప్పుడు యెహోవా చెప్పేమాట వినండి. నేను జెరుసలంనుంచి బబులోనుకు బందీలుగా పంపినవారంతా వినాలి.

[21] ఇస్రాయేల్‌యొక్క దేవుడూ సేనలప్రభువూ అయిన యెహోవా, కోలాయా కొడుకైన అహాబు విషయం, మయశేయా కొడుకైన సిద్కియా విషయం ఇలా చెపుతున్నాడు: వాళ్ళు ప్రవక్తలుగా నా పేర అబద్ధాలు మీతో పలుకుతున్నారు. నేను వాళ్ళను బబులోనురాజు నెబుకద్‌నెజరు చేతికి అప్పగిస్తాను. మీరు చూస్తుండగానే అతడు వాళ్ళను హతం చేయిస్తాడు.

[22] తరువాత, ‘బబులోను రాజు మంటల్లో మాడ్చిన సిద్కియా, అహాబులలాగే మిమ్మల్ని యెహోవా చేస్తాడు గాక’ అంటూ బబులోనులో ఉన్న యూదా బందీలందరూ వాళ్ళ పేర్లను శాపంగా వినియోగిస్తారు.

[23] ఎందుకని? వాళ్ళు ఇస్రాయేల్‌ప్రజల మధ్య సిగ్గుమాలిన రీతిగా ప్రవర్తించారు. పొరుగువారి భార్యలతో వ్యభిచారం చేశారు. నా పేర అబద్ధాలు పలికారు. అలా చెప్పమని నేను వాళ్ళను ఆదేశించలేదు. ఇదంతా నాకు తెలిసే ఉంది. నేను దానికి సాక్షిని. ఇది యెహోవా వాక్కు.

[24] నెహలాంవాడైన షెమయాతో మాట్లాడి ఇలా చెప్పు:

[25] ఇస్రాయేల్‌ప్రజల దేవుడూ, సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, “నీవు జెరుసలంలో ఉన్న ప్రజలందరికీ, మయశేయా కొడుకైన జెఫన్యాయాజికి, యాజులందరికీ నీ పేరటే లేఖలు వ్రాసి పంపించావు. వాటిలో నీవు అన్నావు గదా,

[26] ‘యెహోవా నిన్ను యెహోయాదాయాజికి బదులు యాజిగా, యెహోవా ఆలయంమీద అధికారిగా నియమించాడు. ప్రవక్తలాగా నటించే ప్రతి వెర్రివాణ్ణి నీవు మెడకు సంకెళ్ళు ఉంచి బొండ వేయించవలసినవాడివి గదా.

[27] మరి నీవెందుకు అనతోతు గ్రామంవాడైన యిర్మీయాను గద్దించలేదు? వాడు ప్రవక్తలాగా నటిస్తున్నాడు.

[28] వాడు బబులోనులో ఉన్న మాకు ఈ కబురు పంపించాడు: మీకింకా దీర్ఘకాలం చెర ఉంటుంది. ఇండ్లు కట్టుకొని, వాటిలో కాపురముండండి. తోటలు నాటి వాటి కాపు అనుభవించండి.’”

[29] అయితే జెఫన్యాయాజి ఆ లేఖ యిర్మీయాప్రవక్తకు చదివి వినిపించాడు.

[30] అప్పుడు యెహోవానుంచి వాక్కు యిర్మీయాకు వచ్చింది:

[31] “బందీలుగా వెళ్ళిపోయిన వారందరికీ ఈ మాట పంపించు – నెహలాంవాడైన శమయాను గురించి యెహోవా చెప్పేదేమిటంటే, నేను వాణ్ణి పంపకపోయినా వాడు ప్రవక్తగా పలికి మీరు అబద్ధాన్ని నమ్మేలా చేశాడు.

[32] అందుచేత యెహోవా ఇలా చెపుతున్నాడు: నేను నెహలాంవాడైన శమయానూ, వాడి సంతానాన్నీ దండిస్తాను. వాడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు మాటలు పలికాడు, గనుక ఈ ప్రజలలో వాడికి ఎవ్వరూ మిగిలి ఉండరు. నా ప్రజకు నేను చేయబోయే మేలును వాడు చూడడు. ఇది యెహోవా వాక్కు.

యిర్మీయా — Chapters