[1] “ఒక మనిషి తన భార్యకు విడాకులిస్తాడనుకోండి. ఆమె వెళ్ళి ఇంకొకణ్ణి పెండ్లిచేసుకొంటే మొదటి మనిషి ఆమెను మళ్ళీ చేరుతాడా? ఆ విధంగా చేసే దేశం పూర్తిగా అపవిత్రం అవుతుంది గదా. మీరు అనేకమంది విటులతో వ్యభిచారిణిలాగా ప్రవర్తించారు. అయినా నాదగ్గరికి తిరిగి రండి. ఇది యెహోవా వాక్కు.
[2] మీ తలెత్తి ఏ చెట్లులేని కొండలవైపు చూడండి. మీరు వేశ్యలాగా ప్రవర్తించని స్థలమేదైనా ఉందా? అరబ్‌దేశంవాడు ఎడారిలో కాచుకొన్నట్టు మీరు దారిప్రక్కన కూర్చుని, ప్రేమికులకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పడుపు పనిలాంటి మీ దుష్ ప్రవర్తనతో, మీ చెడుతనంతో ఈ దేశాన్ని అపవిత్రం చేశారు.
[3] అందుకే వానలు రావడం లేదు, కడపటి వర్షపాతం ఆగింది. మీకు వేశ్యలాంటి నొసలు ఉంది. సిగ్గుపడను పో అంటారు.
[4] ఇప్పుడు మీరు నాకు ఇలా మొరపెట్టారు గదా – ‘తండ్రీ, చిన్నప్పటినుంచి నాకు స్నేహితుడివి నీవే.
[5] నీవు ఎప్పటికీ కోపంగా ఉంటావా? శాశ్వతంగా ఆగ్రహం మానవా?’ నీవిలా చెపుతున్నావు గాని, నీ చేతనైనంత మట్టుకు చెడుగు చేస్తూనే ఉన్నావు.”
[6] యోషీయారాజు పరిపాలిస్తున్న కాలంలో యెహోవా నాతో ఇంకా చెప్పాడు, “నన్ను విడిచిపెట్టి ఇస్రాయేల్ జనం ఏమి చేసినదో చూశావా? ఎత్తయిన ప్రతి కొండమీదికీ, పచ్చని ప్రతి చెట్టుక్రిందకూ వెళ్ళి వేశ్యలాగా ప్రవర్తించింది.
[7] ఇదంతా చేసినా, అది నా దగ్గరికి తిరిగి రావాలని నేను చెప్పాను గాని, అది తిరిగి రాలేదు. ద్రోహం చేసినదాని సోదరి యూదా ఇది చూచింది.
[8] నన్ను వదలివేసిన ఇస్రాయేల్‌కు, దాని వ్యభిచార కార్యాలన్నిటి కారణంగా, విడాకులిచ్చి దానిని పంపివేశాను. ద్రోహం చేసినదాని సోదరి యూదా ఇది చూచినా ఏమీ భయపడలేదు. అది కూడా వెళ్ళి వేశ్యలాగా ప్రవర్తించింది.
[9] వ్యభిచారమంటే ఇస్రాయేల్‌కు చాలా చులకనగా ఉంది. అది రాళ్ళతో, మ్రానుతో వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రం చేసింది.
[10] ఇలా జరిగినా కూడా ద్రోహం చేసినదాని సోదరి యూదా మనసారా నావైపు తిరగలేదు గాని, కపటానికి తిరిగింది. ఇది యెహోవా వాక్కు.”
[11] యెహోవా నాతో ఇంకా ఇలా అన్నాడు: “ద్రోహం చేసిన యూదాను చూస్తే, నన్ను విడిచిపెట్టిన ఇస్రాయేల్ నిర్దోషిగా కనిపిస్తుంది.
[12] నీవు వెళ్ళి ఉత్తరం వైపుకు ఈ మాటలు ప్రకటన చెయ్యి – ‘యెహోవా చెప్పేదేమిటంటే, నన్ను విడిచిపెట్టిన ఇస్రాయేలూ! తిరిగి రా! నేను నీమీద కోపం చూపను. నేను కరుణామయుణ్ణి. ఇది యెహోవా వాక్కు. నా కోపం శాశ్వతంగా నిలిచి ఉండదు.
[13] అయితే నీవు నీ అపరాధం ఒప్పుకోవాలి – నీ దేవుడు యెహోవా మీద తిరుగుబాటు చేశావు, ప్రతి పచ్చని చెట్టుక్రింద విదేశీయ దేవుళ్ళను మోహించావు, నా మాట వినకుండా ఉన్నావు. ఇది యెహోవా వాక్కు.’
[14] “నన్ను విడిచిపెట్టిన జనమా! తిరిగి రండి! ఇది యెహోవా వాక్కు. నేను మీ యజమానుణ్ణి. ప్రతి ఊరిలో ఒకణ్ణి, ప్రతి కుటుంబంలో ఇద్దరిని ఎన్నుకొని మిమ్మల్ని సీయోనుకు తీసుకువస్తాను.
[15] అప్పుడు నా ఆలోచనకు సరిపడే కాపరులను మీమీద నియమిస్తాను. వారు జ్ఞాన వివేకాలతో మిమ్మల్ని పోషిస్తారు.
[16] ఆ రోజుల్లో మీరు ఈ దేశంలో వృద్ధి చెంది చాలామంది అవుతారు. అప్పుడు మనుషులు యెహోవా ఒడంబడికపెట్టెను గురించి మాట్లాడరు. అది మనసులో ఉండదు, జ్ఞప్తికి రాదు. లేదని వారికి తోచదు. అలాంటి మరోదానిని చేయరు. ఇది యెహోవా వాక్కు.
[17] “ఆ కాలంలో జెరుసలంను ‘యెహోవా సింహాసనం’ అంటారు. అన్ని దేశాలవారు యెహోవా పేరు ప్రతిష్ఠలను బట్టి జెరుసలం చేరుకొంటారు. అప్పటి నుంచి వారి చెడు హృదయంలో ఉన్న మూర్ఖత్వం ప్రకారం ప్రవర్తించరు.
[18] ఆ కాలంలో యూదా వంశంవారు ఇస్రాయేల్ వంశంవారిని కలిసి, ఒక ఉత్తర దేశంనుంచి వస్తారు, నేను మీ పూర్వీకులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి చేరుకొంటారు.
[19] “నేను మిమ్మల్ని కుమారులుగా ఎంచి, మీకు రమ్యమైన దేశాన్ని ఇవ్వడానికి ఎంతగానో కోరుతున్నాను అన్నాను. ఆ వారసత్వం ఏ దేశంకంటే కూడా అందమైనది. మీరు నన్ను ‘తండ్రి’ అంటూ, నన్ను అనుసరించడం మానకూడదని చెప్పాను.
[20] అయితే ఇస్రాయేల్ జనమా! భార్య తన భర్తపట్ల కపటంగా ప్రవర్తించినట్టే మీరు నాపట్ల కపటంగా ప్రవర్తించారు. ఇది యెహోవా వాక్కు.
[21] “చెట్లులేని ఎత్తయిన స్థలాల్లో కంఠధ్వని వినబడుతూ ఉంది – ఇస్రాయేల్‌ప్రజలు ఏడుస్తూ ప్రాధేయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు తమ మార్గాన్ని వక్రం చేసుకొన్నారు, తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు.
[22] నన్ను విడిచిపెట్టిన ప్రజలారా! తిరిగి రండి! నన్ను మళ్ళీ విడిచిపెట్టకుండేలా మిమ్మల్ని బాగు చేస్తాను.” “ఇదిగో! మేము నీదగ్గరికి వస్తున్నాం. మా దేవుడైన యెహోవావు నీవే.
[23] నిజంగా, కొండలమీద చేసే పూజ మోసకరమే, పర్వతాలమీద జరిగే తాండవాలు వట్టివే. నిజంగా, ఇస్రాయేల్‌కు రక్షణ మన దేవుడైన యెహోవా మూలంగానే కలుగుతుంది.
[24] మన చిన్నతనంనుంచి నీచ విగ్రహాలు మన తండ్రుల కష్టార్జితాన్ని మ్రింగివేశాయి. వారి గొర్రెలు, మేకలు, పశువుల మందలు, వారి కొడుకులనూ కూతుళ్ళనూ కూడా మ్రింగివేశాయి.
[25] మనమూ మన తండ్రులూ మన చిన్నతనంనుంచి ఈ రోజువరకూ మన దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా అపరాధాలు చేస్తూ వచ్చాం, గనుక సిగ్గుతో సాష్టాంగపడుదాం రండి. మన అవమానం మనలను కప్పుకోనివ్వండి.”