[1] యెహోవా చెప్పేదేమిటంటే, “నా మంద గొర్రెలను నాశనం చేస్తూ, చెదరగొట్టివేస్తూ ఉన్న కాపరులకు బాధ తప్పదు.
[2] నా ప్రజను పోషించవలసిన కాపరులకు ఇస్రాయేల్‌వారి దేవుడు యెహోవా ఇలా చెపుతున్నాడు: మీరు నా మందను చెదరగొట్టారు, వెళ్ళగొట్టారు. వాళ్ళ సంగతి పట్టించుకోకుండా ఉన్నారు. మీరు చేసిన చెడ్డ పనుల కారణంగా నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు.
[3] నేను నా మందలో ఉన్న మిగతావారిని పారదోలిన అన్ని దేశాలనుంచి సమకూరుస్తాను. వారి పచ్చిక మైదానాలకు వారిని తిరిగి తీసుకువస్తాను. వారు వృద్ధి చెందుతారు. వారి సంఖ్య పెరుగుతుంది.
[4] వారిని సంరక్షించే కాపరులను వారిమీద నియమిస్తాను. అప్పటినుంచి వారు భయపడరు, హడలిపోరు. వారిలో ఒక్కరు కూడా లేకుండా పోరు. ఇది యెహోవా వాక్కు.
[5] యెహోవా చెప్పేదేమిటంటే, “రాబోయే కాలంలో నేను దావీదు వంశంలో న్యాయవంతుడైన ‘కొమ్మ’ను పుట్టిస్తాను. ఆయన రాజై తెలివిగా పరిపాలన చేస్తాడు. లోకంలో నీతిన్యాయాలను జరిగిస్తాడు.
[6] ఆయన రోజులలో యూదావారికి రక్షణ కలుగుతుంది, ఇస్రాయేల్‌వారు నిర్భయంగా నివాసం చేస్తారు. ఆయనను ఈ పేరుతో పిలుస్తారు, ‘యెహోవాయే మనకు నీతిన్యాయాలు’.”
[7] యెహోవా చెప్పేదేమిటంటే, “గనుక ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో ‘ఇస్రాయేల్‌ప్రజను ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చిన యెహోవా జీవంతోడు’ అంటూ శపథం చేయరు
[8] గాని, ‘ఉత్తర దేశంనుంచి, తాను ఇస్రాయేల్ వంశంవారిని చెదరగొట్టిన అన్ని దేశాలనుంచి తీసుకువచ్చిన యెహోవాతోడు’ అంటూ శపథం చేస్తారు. ఆ కాలంలో ఇస్రాయేల్‌వారు సొంత దేశంలో నివాసం చేస్తారు.”
[9] ఇది ప్రవక్తల విషయం – యెహోవా కారణంగా ఆయన పవిత్ర వాక్కుల కారణంగా నా గుండె పగిలిపోయింది, నాలో ఉన్న ఎముకలన్నీ కదులుతున్నాయి. నేను మత్తుగా త్రాగిన మనిషిలాగా, ద్రాక్షమద్యం వశమైనవాడులాగా ఉన్నాను.
[10] దేశం నిండా వ్యభిచారులు ఉన్నారు. శాపంక్రింద ఉండి దేశం దుఃఖిస్తూ ఉంది. ఎడారిలో పచ్చిక మైదానాలు ఎండిపోయాయి. ప్రవక్తలు చెడ్డగా ప్రవర్తిస్తున్నారు. తమ బలం అక్రమానికి దుర్వినియోగిస్తూ ఉన్నారు.
[11] “ప్రవక్తలూ యాజులూ భక్తిలేనివాళ్ళు. నా ఆలయంలో కూడా వాళ్ళు చెడుగు చేస్తూ ఉంటే నేను చూశాను. ఇది యెహోవా వాక్కు.
[12] అందుచేత వాళ్ళది జారుడు త్రోవ అవుతుంది. వాళ్ళు చీకటిలోకి గెంటివేయబడి దానిలో పడిపోతారు. వాళ్ళకు వచ్చే దండన సంవత్సరంలో నేను వాళ్ళమీదికి విపత్తు రప్పిస్తాను. ఇది యెహోవా వాక్కు.
[13] షోమ్రోనులో ఉన్న ప్రవక్తల మధ్య తెలివితక్కువ పని జరగడం నేను చూశాను – వాళ్ళు బయల్‌దేవుడి మూలంగా పలికి, నా ప్రజలైన ఇస్రాయేల్‌వారిని తప్పుదారిలోకి నడిపించారు.
[14] జెరుసలంలో ఉన్న ప్రవక్తలమధ్య ఘోరమైనది జరగడం నేను చూశాను. వాళ్ళు యథార్థంగా ప్రవర్తించక, వ్యభిచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కడూ తన చెడుగును విడిచిపెట్టకుండా దుర్మార్గులను బలపరుస్తున్నారు. జెరుసలం కాపురస్థులు గొమొర్రావాళ్ళలాగే ఉన్నారు.”
[15] గనుక సేనలప్రభువు యెహోవా ఆ ప్రవక్తలను గురించి ఇలా చెపుతున్నాడు: “వాళ్ళకు తినడానికి చేదుకూరలు ఇస్తాను, త్రాగడానికి విష జలం ఇస్తాను. ఎందుకంటే, జెరుసలంలో ఉన్న ప్రవక్తల భక్తిహీనత దేశమంతటా వ్యాపించింది.”
[16] సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “మీతో పలికే ప్రవక్తల మాటలు వినవద్దు. వాళ్ళు మిమ్మల్ని వట్టి ఆశాభావంతో నింపుతారు. వాళ్ళు పలుకుతున్నది నా నోటినుంచి వచ్చినది కాదు గాని, తమ మానసిక దర్శనాలే.
[17] నన్ను తృణీకరించేవాళ్ళతో వారు ‘మీకు క్షేమంగానే ఉంటుందని యెహోవా చెపుతున్నాడు’ అంటారు. తమ హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్ని అనుసరించి ప్రవర్తించేవాళ్ళతో ‘మీమీదికి ఏమీ కీడు రాదు’ అంటారు.
[18] అయితే యెహోవా సందేశం విని గ్రహించడానికి వాళ్ళలో ఎవరు యెహోవా ఆలోచనసభలో నిలబడ్డారు? ఎవరు ఆయన వాక్కులు విని పట్టించుకొన్నారు?
[19] ఇదిగో, వినండి! యెహోవా ఆగ్రహం తుఫానులాగా బయలుదేరింది. అది తీవ్రమైన సుడిగాలిలాగా దుర్మార్గుల నెత్తిన విరుచుకు పడుతుంది.
[20] యెహోవా తన మనసులో ఉన్న ఆలోచనలను నెరవేర్చి సాధించేవరకూ, ఆయన కోపం వెనక్కు మళ్ళదు. చివరి రోజుల్లో మీరు ఈ విషయం బాగా తెలుసుకొంటారు.
[21] నేను ఈ ప్రవక్తలను పంపలేదు. అయినా వాళ్ళు పరుగెత్తారు. నేను వాళ్ళతో మాట్లాడలేదు. అయినా వాళ్ళు ప్రవక్తలలాగా పలికారు.
[22] ఒకవేళ వాళ్ళు నా ఆలోచనసభలో నిలబడి ఉంటే, నా వాక్కులు నా ప్రజకు ప్రకటించి ఉంటే నా ప్రజ పట్టిన చెడ్డ త్రోవనుంచీ వాళ్ళు చేస్తున్న చెడుగునుంచీ వారిని మళ్ళించి ఉండేవారే.
[23] “నేను దగ్గరలో మాత్రమే ఉన్న దేవుణ్ణా? దూరంగా ఉన్న దేవుణ్ణి కానా?
[24] నాకు కనబడకుండా ఎవరైనా చాటున దాగుకోగలరా? అని యెహోవా అడుగుతున్నాడు. నేను భూమిమీద, ఆకాశంలో అంతటా ఉన్నవాణ్ణి కానా? అని యెహోవా అడుగుతున్నాడు.
[25] నా పేర పలికే ఆ ప్రవక్తలు ఏమేమి చెపుతున్నారో అది విన్నాను. ‘నాకు కల వచ్చింది! నాకు కల వచ్చింది!’ అంటున్నారు.
[26] ఈ ప్రవక్తలు అబద్ధాలు పలుకుతున్నారు, తమ మనసుల్లో ఉన్న భ్రమను అనుసరించి పలుకుతున్నారు. వాళ్ళ మనసుల్లో ఎన్నాళ్ళు ఇలా ఉంటుంది?
[27] వారి పూర్వీకులు బయల్ దేవుడి పూజలో నిమగ్నులై నా పేరును మరచిపోయారు. అలాగే నా ప్రజ నా పేరును మరచిపోవాలని దురాలోచన చేస్తున్నారు. వాళ్ళు ఒకరికొకరు చెప్పే కలలమూలంగా అలా జరుగుతుందనుకొంటూ ఉన్నారు.
[28] కలగన్న ప్రవక్త తన కలను చెప్పవచ్చు. అయితే నా వాక్కు ఎవరికి ఉందో అతడు దానిని నమ్మకంగా చెప్పవచ్చు. ధాన్యంతో పొట్టుకు ఏమి పోలిక? ఇది యెహోవా వాక్కు.”
[29] యెహోవా చెప్పేదేమిటంటే, “నా వాక్కు మంటలాంటిది కాదా? బండను ముక్కలు చేసే సుత్తెలాంటిది కాదా?”
[30] గనుక యెహోవా చెపుతున్నాడు, “ఒకడి దగ్గరనుంచి ఇంకొకడు నా వాక్కులు దొంగలించుకొన్న ప్రవక్తలకు నేను విరోధిని.”
[31] యెహోవా అంటున్నాడు, “సొంత మాటలు పలికి, ‘ఇది యెహోవా వాక్కు’ అని చెప్పే ప్రవక్తలకు నేను విరోధిని.”
[32] యెహోవా అంటున్నాడు, “ప్రవక్తగా వట్టి కలలు పలికేవాళ్ళకు నేను విరోధిని. అవి చెపుతూ, వాళ్ళ అబద్ధాలమూలంగా, గొప్పలు చెప్పడం మూలంగా నా ప్రజను తప్పుదారి పట్టిస్తున్నారు.” యెహోవా అంటున్నాడు, “నేను వాళ్ళను పంపలేదు, ఆదేశించనూ లేదు. వాళ్ళవల్ల ఈ ప్రజకు ఏమీ ప్రయోజనం కలగదు.”
[33] “ఈ ప్రజ గానీ, ప్రవక్త గానీ, యాజి గానీ ‘యెహోవా సందేశమేమిటి?’ అని నిన్ను అడిగితే, నీవు “ఏం సందేశం? మిమ్ములను చెదరగొట్టివేస్తానని యెహోవా చెపుతున్నాడు” అని వాళ్ళతో చెప్పు.
[34] ప్రవక్త గానీ, యాజి గానీ, ప్రజలలో ఎవడైనా గానీ, ‘యెహోవా సందేశమ’ని చెపితే, నేను వాణ్ణి, వాడి కుటుంబాన్ని దండిస్తాను.
[35] ‘యెహోవా ఇచ్చిన జవాబేమిటి?’ ‘యెహోవా ఏం చెప్పాడు?’ అని మీలో ఒక్కొక్కరు పొరుగువాళ్ళతో గానీ బంధువులతో గానీ చెపుతారు.
[36] అయితే మీరు ‘యెహోవా సందేశం’ అనే మాటలు ఇకమీదట పలకవద్దు. ఎందుకంటే, ఎవడి మాట వాడికి సందేశం అవుతుంది. మీరు మీ దేవుని వాక్కులు – సజీవుడైన సేనలప్రభువు యెహోవాదేవుని వాక్కులు తారుమారు చేశారు.
[37] ‘యెహోవా నీకిచ్చిన జవాబేమిటి?’, ‘యెహోవా ఏం చెప్పాడు?’ అని మీరు ప్రవక్తను అడుగుతారు.
[38] అయితే మీరు ‘ఇది యెహోవా సందేశం’ అని చెపితే, యెహోవా ఇలా చెప్పాడని తెలుసుకోండి: ‘యెహోవా సందేశం’ అని మీరు చెప్పకూడదని నేను మీకు చెప్పినా మీరు ‘యెహోవా సందేశం’ అంటున్నారు,
[39] గనుక నేను మిమ్ములను విసర్జించి, మీకూ మీ పూర్వీకులకూ నేను ఇచ్చిన నగరాన్నీ మిమ్ములనూ నా ఎదుటనుంచి పారవేసితీరుతాను.
[40] ఎప్పటికీ నిలిచి ఉండే నిందను, ఎన్నడూ మరపురాని శాశ్వతమైన అవమానాన్ని మీమీదికి రప్పిస్తాను.”