[1] యెహోవా చెప్పేదేమిటంటే, “ఆ కాలంలో ఇస్రాయేల్ గోత్రాలన్నిటికీ నేను దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు.
[2] యెహోవా ఇలా చెపుతున్నాడు, పట్టాకత్తి బారినుంచి తప్పించుకొన్న ప్రజ ఎడారిలోకి పారిపోయినప్పుడు, అక్కడ నా దయ అనుభవించారు.”
[3] గతకాలంలో యెహోవా మనకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: “శాశ్వతమైన ప్రేమ మీపట్ల నాకు ఉంది. గనుకనే మిమ్ములను కృపతో నాదగ్గర చేర్చాను.
[4] ఇస్రాయేల్‌కన్యా! నిన్ను క్షేమస్థితికి మళ్ళీ తెస్తాను. నీవు మళ్ళీ క్షేమస్థితి పొంది, కంజరి చేతపట్టుకొని వెళ్ళి సంబరంగా నాట్యం చేసేవారితో కలుస్తావు.
[5] నీవు సమరయ కొండలమీద మళ్ళీ ద్రాక్షతోటలు నాటుతావు. నాటేవారు వాటి ఫలాలను అనుభవిస్తారు.
[6] ‘లేచి సీయోనుకు, మన దేవుడు యెహోవా దగ్గరికి వెళ్దాం పదండి’ అని ఎఫ్రాయిం కొండ ప్రాంతంలో కాపలావారు కేకలు వేసే రోజులు వస్తాయి.”
[7] యెహోవా చెప్పేదేమిటంటే, “యాకోబు ప్రజల కారణంగా సంతోషధ్వనులు చేయండి. జనాలలో ఈ ప్రముఖ జనం కారణంగా ఆనందంతో కేకలు వేయండి. మీ స్తుతులు పెద్దగా వినిపిస్తూ, ‘యెహోవా! నీ ప్రజలైన ఇస్రాయేల్‌వారిలో మిగతావారిని కాపాడు’ అని చెప్పండి.
[8] ఇదిగో వినండి! నేను వారిని ఉత్తర దేశంనుంచి తీసుకువస్తాను. భూమి కొనలనుంచి వారిని సమకూరుస్తాను. వారిలో కొంతమంది గుడ్డివారు, కుంటివారు, గర్భిణులు, ప్రసవించనై ఉన్న స్త్రీలు ఉంటారు. వారు మహా గొప్ప సమూహంగా ఇక్కడికి తిరిగి వస్తారు.
[9] వారు ఏడుస్తూ వస్తారు. నేను వారిని తీసుకువస్తూ ఉంటే వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇస్రాయేల్‌కు నేను తండ్రిని. ఎఫ్రాయిం నా జ్యేష్ఠుడు. గనుక నేను వారిని నీటి కాలువల ఒడ్డున, చక్కని త్రోవలో నడిపిస్తాను. ఆ త్రోవలో వారు తొట్రుపడరు.
[10] “ఇతర జనాల్లారా! యెహోవా వాక్కు వినండి! దూరంగా ఉన్న సముద్ర తీరాల ప్రాంతాలలో ఇలా చాటించండి – ‘ఇస్రాయేల్ ప్రజను చెదరగొట్టినవాడు వారిని సమకూరుస్తాడు. కాపరి తన మందను కాపాడే విధంగా వారిని కాపాడుతాడు.
[11] ఎందుకంటే యెహోవా యాకోబును విమోచిస్తాడు. వారికంటే బలాఢ్యుల చేతిలోనుంచి వారిని విడిపిస్తాడు.
[12] వారు వచ్చి సీయోను కొండమీద సంతోషధ్వనులు చేస్తారు. యెహోవా ప్రసాదించిన ధాన్యం, ద్రాక్షరసం, నూనె, గొర్రెపిల్లలు, పశువులపిల్లల కారణంగా వారి ముఖాలు సంతోషంగా ప్రకాశిస్తాయి. వారి బ్రతుకు నీళ్ళు పారిన తోటలాగా ఉంటుంది. అప్పటినుంచి వారు నీరసించిపోరు.
[13] వారి దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తాను. వారి విచారానికి బదులుగా ఓదార్పు, ఆనందం కలిగిస్తాను. వారిలో కన్యలు, యువకులు, ముసలివారు సంతోషంతో నాట్యం చేస్తారు.
[14] యాజులను సమృద్ధితో తృప్తిపరుస్తాను. నేను చేసే మేలు అనుభవిస్తూ సంతుష్టి చెందుతూ ఉంటారు. ఇది యెహోవా వాక్కు.”
[15] యెహోవా ఇలా చెప్పాడు: “రమాలో విలాపం, మహా రోదనం వినబడుతున్నాయి. రాహేలు తన పిల్లలకోసం ఏడుస్తూ ఉంది. వారిని కోల్పోయినందుచేత ఓదార్పును నిరాకరిస్తూ ఉంది.”
[16] యెహోవా ఇలా చెప్పాడు: “నీవింకా ఏడ్వవద్దు. ఇంకా కంటతడి పెట్టవద్దు. ఎందుకంటే నీవు చేసినదానికి బహుమానం ఉంటుంది. ఇది యెహోవా వాక్కు. వారు శత్రువుల దేశంనుంచి తిరిగి వస్తారు.
[17] భవిష్యత్తులో క్షేమం కలుగుతుందని నీవు ఆశాభావంతో ఎదురు చూడవచ్చు. ఇది యెహోవా వాక్కు. నీ పిల్లలు స్వదేశానికి తిరిగి వస్తారు.
[18] “ఎఫ్రాయిం మూలుగుతూ ఇలా అంటూ ఉన్నప్పుడు నేను విన్నాను: ‘శిక్షణ లేని దూడను శిక్షించే విధంగా నీవు నన్ను శిక్షించావు. నేను శిక్షకు లోబడుతున్నాను. నీవే నా దేవుడివి, యెహోవావు. నీవైపు నన్ను త్రిప్పుకో, తిరుగుతాను.
[19] నేను నీవైపు తిరిగిన తరువాత నాకు పశ్చాత్తాపం కలిగింది. ఉపదేశం పొందినతరువాత నా తొడ చరచుకొన్నాను. నా కుర్రతనం విషయమైన అవమానం భరిస్తూ ఉండడంచేత నాకు సిగ్గు, తలవంపులు కలిగాయి.
[20] యెహోవా చెప్పేదేమిటంటే, ఎఫ్రాయిం నాకు ప్రియమైన కొడుకులాగా కాడా? ఎఫ్రాయిం అంటే నాకు చాలా ఇష్టం గదా? నేను ఆ ప్రజకు వ్యతిరేకంగా అనేక సార్లు మాట్లాడినా వారిని నేను ఎంతమాత్రం మరవలేను. నాకు అంతరంగంలో పరితాపం కలిగింది. నేను వారిని తప్పక దయ చూస్తాను. ఇది యెహోవా వాక్కు.
[21] ఇస్రాయేల్‌కన్యా! నీకోసం దారి గుర్తులు పెట్టుకో! త్రోవ చూపే స్తంభాలు పాతుకో! నీవు వెళ్ళిపోయిన మార్గాన్ని బాగా గుర్తుంచుకో. ఈ నీ పట్టణాలకు తిరిగి రా!
[22] దారి తప్పిన కుమారీ! నీవు ఎన్నాళ్ళు తిరుగాడుతూ ఉంటావు? యెహోవా భూమిమీద క్రొత్తదానిని కలగజేస్తాడు – స్త్రీ వీరోచితంగా వ్యవహరిస్తుంది.”
[23] ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా ఇలా చెప్పాడు: “నేను వారిని చెరనుంచి తీసుకువచ్చిన తరువాత యూదాదేశంలో, దాని పట్టణాలలో వారు మళ్ళీ ఈ మాటలు వినియోగిస్తారు: ‘న్యాయానికి నివాసమా! పవిత్ర పర్వతమా! యెహోవా నిన్ను దీవిస్తాడు గాక!’
[24] అలసిపోయినవారిని బలంతో నింపుతాను.
[25] గనుక యూదాలో, దాని పట్టణాలన్నిటిలో ప్రజలు నివాసం చేస్తారు. వారిమధ్య రైతులు, కాపరులు ఉంటారు.”
[26] అప్పుడు నేను నిద్ర లేచి కలయ చూశాను. ఆ నిద్ర నాకు సంతోషకరం అనిపించింది.
[27] యెహోవా ఇంకా అన్నాడు “రాబోయే రోజుల్లో ఇస్రాయేల్ ప్రాంతంలో, యూదా ప్రాంతంలో మనుషుల సంతానం, పశువుల సంతానం అంతటా ఉండేలా చేస్తాను.
[28] మునుపు నేను వారిని పెరికివేయడానికీ విరగగొట్టడానికీ పడగొట్టడానికీ నాశనం చేయడానికీ విపత్తుకు గురి చేయడానికీ జాగ్రత్త తీసుకొన్నాను. అలాగే వారిని నాటడానికీ వారికి అభివృద్ధి చేకూర్చడానికీ నేను జాగ్రత్త తీసుకొంటాను. ఇది యెహోవా వాక్కు.
[29] ఆ రోజుల్లో ప్రజలు ‘తండ్రులు పుల్లని ద్రాక్షకాయలు తిన్నారు. వాళ్ళ పిల్లలకు పళ్ళు పులిసిపోయాయి’ అని ఇంకా చెప్పరు.
[30] కాని ఎవరు పాపం చేస్తే, వారే వారి పాపానికి చస్తారు. ఎవరు పుల్లని ద్రాక్షకాయలు తింటారో వారికే పళ్ళు పులిసిపోతాయి.”
[31] యెహోవా చెప్పేదేమిటంటే, “ఇదిగో, ఒక కాలం రాబోతుంది. అప్పుడు నేను ఇస్రాయేల్‌వారితోనూ యూదావారితోనూ క్రొత్త ఒడంబడిక చేస్తాను.
[32] నేను ఈజిప్ట్‌లోనుంచి వారి పూర్వీకులను చేయి పట్టుకొని నడిపించాను. ఈ క్రొత్తది నేను ఆ కాలంలో వారితో చేసిన ఒడంబడికలాగా ఉండదు. ఎందుకని? నేను వారికి భర్తలాగా ఉన్నా వారు నా ఒడంబడికను భంగం చేశారు. ఇది యెహోవా వాక్కు.
[33] ఆ రోజులయిన తరువాత నేను ఇస్రాయేల్‌వారితో చేయబోయే ఒడంబడిక ఇదే: ఇది యెహోవా వాక్కు – నేను నా ధర్మశాస్త్రం వారి మనసులలో ఉంచుతాను, వాటిని వారి హృదయాలపై వ్రాస్తాను, నేను వారికి దేవుడనై ఉంటాను. వారు నాకు ప్రజలై ఉంటారు.
[34] వారంతా అల్పులైనా ఘనులైనా నన్ను తెలుసుకొంటారు, గనుక ‘యెహోవాతో పరిచయం చేసుకో’ అంటూ వారు తమ తమ సాటి పౌరులకూ, సోదరులకూ బోధించరు. నేను వారి అపరాధాలను క్షమించి, అప్పటినుంచి వారి పాపాలను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఇది యెహోవా వాక్కు.”
[35] యెహోవా చెప్పేదేమిటంటే, “పగటివేళ వెలుగు కోసం పొద్దును నియమించి రాత్రివేళ వెలుగుకోసం చంద్రనక్షత్రాల క్రమం ఏర్పరచేవాడి పేరు, సముద్రాన్ని అలలతో ఘోషించేలా రేపేవాడి పేరు సేనల ప్రభువు యెహోవా.
[36] నేను నిర్ణయించిన ఈ క్రమం నా ఎదుటనుంచి తప్పిపోతేనే ఇస్రాయేల్‌వంశంవారు నా ఎదుట ప్రజగా ఉండకుండా పోతారు. ఇది యెహోవా వాక్కు.”
[37] యెహోవా చెప్పేదేమిటంటే, “పైగా ఉన్న ఆకాశాలకు ఎవరైనా కొలత తీసుకోగలిగితే, భూమి పునాదులను వెదకి కనిపెట్టగలిగితే ఇస్రాయేల్ వంశంవారిని, వారు చేసినదానినంతటి కారణంగా నేను తిరస్కరిస్తాను. ఇది యెహోవా వాక్కు.”
[38] యెహోవా చెప్పేదేమిటంటే, “రాబోయే రోజుల్లో ఈ నగరాన్ని హనన్యేల్ గోపురంనుంచి ‘మూల ద్వారం’ వరకు యెహోవా కోసం మళ్ళీ కట్టడం జరుగుతుంది.
[39] అక్కడనుంచి కొలత తాడు గారేబు కొండవరకు పోతుంది, అక్కడ గోయా వైపు మళ్ళుతుంది.
[40] శవాలను, బూడిదను వేసే లోయ అంతా, తూర్పు దిక్కుగా కిద్రోనువాగు వరకు, ‘గుర్రాల ద్వారం’ వరకు ఉన్న పొలాలన్నీ యెహోవాకు పవిత్రంగా ఉంటాయి. నగరాన్ని ఇంకెన్నడూ పెరికివేయడం, పడగొట్టడం జరగదు.”