[1] యెహోవా చెప్పేదేమిటంటే, “ఇస్రాయేల్ ప్రజలారా, మీరు తిరిగి రావాలనుకొంటే, నాదగ్గరికే తిరిగి రావాలి. మీరు మీ అసహ్యమైన విగ్రహాలను నా దృష్టినుంచి తొలగించివేసి, మళ్ళీ దారి తప్పిపోకుండా ఉంటే,
[2] ‘యెహోవా జీవం తోడు’ అని యథార్థంగా, నీతి నిజాయితీతో ప్రమాణం చేస్తే, అప్పుడు జనాలకు యెహోవా మూలంగా దీవెన కలుగుతుంది. అవి ఆయన కారణంగా అతిశయిస్తాయి.
[3] యూదావారికి జెరుసలం నివాసులకూ యెహోవా చెప్పేదేమిటంటే, “ముళ్ళలో విత్తనాలు చల్లవద్దు. మీ బీడు భూమి దున్నండి.
[4] యూదావారలారా! జెరుసలం నివాసులారా! మిమ్మల్ని మీరే యెహోవాకు ప్రత్యేకించుకోండి. మీ హృదయాలకు సున్నతి చేయండి. మీరు అలా చేయకపోతే మీరు జరిగించిన చెడుతనమంతటినిబట్టి నా కోపం మంటల్లాగా, ఎవరూ ఆర్పలేనంతగా రవులుకొంటుంది.
[5] “యూదాలోను, జెరుసలంలోనూ ఇలా చాటించండి, దేశంలో పొట్టేలు కొమ్ము ఊదండి! పెద్దగా అరుస్తూ ఇలా ప్రకటన చేయండి: సమకూడండి! ప్రాకారాలున్న నగరాలకు వెళ్దాం పదండి!
[6] సీయోనువైపు పతాకం ఎత్తండి. ఆలస్యం చేయకుండా ప్రజలను ఆశ్రయంకోసం పరుగెత్తించండి. ఎందుకంటే నేను ఉత్తర దిక్కునుంచి ఆపదనూ గొప్ప విపత్తునూ రప్పిస్తున్నాను.”
[7] పొదల్లోనుంచి సింహం వచ్చింది. జనాలను నాశనం చేసేవాడు బయలుదేరాడు. మీ దేశాన్ని పాడు చేయడానికి అతడు తన స్థలం విడిచివస్తున్నాడు. మీ పట్టణాలు శిథిలమైపోతాయి. వాటిలో ఎవరూ కాపురముండరు.
[8] యెహోవా తీవ్ర కోపం మనమీద ఉండిపోయింది గనుక గోనెపట్ట కట్టుకొని విలపించండి, రోదనం చేయండి.
[9] యెహోవా చెప్పేదేమిటంటే, “ఆ రోజున రాజుకూ అధికారులకూ ధైర్యం చెడిపోతుంది. యాజులు నిర్ఘాంత పోతారు, ప్రవక్తలు ఆశ్చర్యచకితులవుతారు.”
[10] అందుకు నేను ఇలా చెప్పాను: “అయ్యో, యెహోవాప్రభూ! నీవు ఈ ప్రజను, జెరుసలం నివాసులను పూర్తిగా మోసగించావు! ‘మీకు శాంతి ఉంటుంది’ అన్నావు గదా. ఇప్పుడైతే ఖడ్గం దగ్గరగా వచ్చి వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెచ్చింది.”
[11] ఆరోజున ఈ ప్రజకు, జెరుసలంలో ఉంటున్న వారికి ఇలా చెప్పడం జరుగుతుంది: “ఎడారిలో చెట్లులేని ఎత్తు చోట్లనుంచి నా ప్రజలవైపు వడగాలి వీస్తూ ఉంది. విమర్శించడానికీ శుద్ధి చేయడానికీ కాదు.
[12] దానికంటే ఎక్కువ గాలి నా దగ్గరనుంచి వీస్తూ ఉంది. ఇప్పుడు వారిని గురించిన నా తీర్పులు చెపుతాను.”
[13] “ఇడుగో, వస్తున్నవాడు మేఘాల్లాగా కనిపిస్తున్నాడు, అతడి రథాలు తుఫాన్‌లాగా వస్తున్నాయి. అతడి గుర్రాలు గరుడపక్షుల కంటే వేగంగా పరుగెత్తుకువస్తున్నాయి. అయ్యో! మనం నాశనమయ్యాం!”
[14] జెరుసలం! నీకు విముక్తి కలిగేలా నీ హృదయంలో చెడుగు ఉంచకుండా దానిని శుద్ధి చేసుకో. ఎన్నాళ్ళు చెడ్డ ఆలోచనలు నీలో గూడు కట్టుకొని ఉంటాయి?
[15] దాను ప్రదేశం నుంచి కంఠధ్వని ప్రకటన చేయడం వినబడుతూ ఉంది, ఎఫ్రాయిం కొండమీదనుంచి విపత్తును గురించి ఒకడు చాటిస్తూ ఉన్నాడు:
[16] “ఇతర జనాలకూ, జెరుసలంకూ ఇలా ప్రకటన చేసి తెలియజేయి: ముట్టడి వేసేవాళ్ళు దూర దేశం నుంచి వస్తున్నారు. వాళ్ళు యూదా పట్టణాల విషయం యుద్ధధ్వని చేస్తున్నారు.
[17] యూదా నామీద తిరుగుబాటు చేసింది, గనుకనే వాళ్ళు పొలం కాపలావాళ్ళుగా యూదాచుట్టూ ముట్టడిస్తారు. ఇది యెహోవా వాక్కు.
[18] మీ ప్రవర్తన, మీరు చేసిన పనులే ఈ ఆపద మీమీదికి తెచ్చాయి. మీ చెడ్డతనమే దీనికి కారణం. ఇది ఎంత దుఃఖకరం! మీ గుండెల్లో ఎంత గుచ్చుకొంటుంది!”
[19] నా గుండె! నా గుండె! వేదనతో అల్లాడిపోతున్నాను. నా గుండె అంచులు బాధగా కొట్టుకొంటూ ఉన్నాయి. పొట్టేలు కొమ్ము ఊదే శబ్దం, యుద్ధధ్వని నాకు వినబడుతూ ఉన్నాయి. నేను ఊరుకోలేను.
[20] విపత్తు వెంట విపత్తు వస్తూ ఉంది. దేశమంతా నాశనమైంది. హఠాత్తుగా నా డేరాలు, క్షణంలో వాటి తెరలు పాడైపొయ్యాయి.
[21] ఎన్నాళ్ళు నేను యుద్ధ ధ్వజం చూస్తూ, పొట్టేలు కొమ్ము ఊదే శబ్దం వింటూ ఉండాలి?
[22] “నా ప్రజ మూర్ఖులు. వారు నన్ను ఎరగరు. వారు తెలివితక్కువ సంతానం. వారికి గ్రహించే శక్తి లేదు. చెడుగు చేయడంలో వారు ఆరితేరినవారు గాని, మంచి చేయడం ఎలాగో వారికి ఏమీ తెలియదు.”
[23] నేను భూతలాన్ని చూశాను. అది శూన్యంగా, రూపం లేని స్థితిలో ఉంది, ఆకాశాన్ని చూశాను, అక్కడ కాంతి లేదు.
[24] పర్వతాలవైపు చూశాను. అవి కంపిస్తూ ఉన్నాయి. కొండలన్నీ అటూ ఇటూ కదులుతూ ఉన్నాయి.
[25] నేను చూస్తూ ఉంటే మనుషులెవ్వరూ కనిపించలేదు. గాలిలో ఎగిరే పక్షులన్నీ పొయ్యాయి.
[26] నేను చూశాను. యెహోవా తీవ్ర కోపంచేత తోటలాంటి ఈ దేశం ఎడారిగా మారింది. దాని పట్టణాలన్నీ పాడుపడి ఉన్నాయి.
[27] యెహోవా చెప్పేదేమిటంటే, “ఈ దేశమంతా పాడైపోతుంది గాని, దానిని పూర్తిగా అంతం చేయను.
[28] దీనిని గురించి భూమి దుఃఖిస్తుంది. ఆకాశాలను చీకటి కమ్ముకొంటుంది. నేను నిర్ణయం చేసి మాట ఇచ్చాను. మనసు మార్చుకోను, వెనక్కు తీయను.”
[29] రౌతులూ, విల్లు పట్టినవాళ్ళు చేసే చప్పుడు విని, ప్రతి ఊరివారూ పారిపోతారు. వారు దట్టమైన పొదల్లో దూరుతారు, బండల్లో ఎక్కుతారు. ప్రజలు పట్టణాలన్నిటినీ విడుస్తారు. వాటిలో ఎవరూ కాపురముండరు.
[30] నీవు నాశనమయ్యావు! నీవేం చేయగలవు? ఎర్రటి వస్త్రాలు కట్టుకొని, బంగారు ఆభరణాలతో అలంకరించు కొంటున్నావేం! నిన్ను అందంగా చేసుకోవడం వ్యర్థమే. నీ ప్రేమికులు నిన్ను తృణీకరిస్తారు. నీ ప్రాణం తీయడానికి చూస్తారు.
[31] ప్రసవిస్తున్న స్త్రీ కేకలాంటి ధ్వని నాకు వినిపిస్తూ ఉంది. ఆ స్వరం తొలి కానుపు స్త్రీ మూలుగుల్లాంటిది – సీయోను కష్టంతో ఊపిరి పీల్చుకొంటూ, చేతులు చాచి కేకలు వేస్తూ ఉంది. “అయ్యో! హంతకుల ముందు మూర్ఛపోతున్నాను, నాకు బాధ” అంటుంది.