[1] వారి దేవుడు యెహోవా తనద్వారా ప్రజలకు పంపించిన సందేశం యిర్మీయా వారందరికీ తెలియజేసిన తర్వాత వారి దేవుడు యెహోవా మాటలన్నీ చెప్పిన తర్వాత,
[2] హోషేయా కొడుకు అజర్యా, కారేహ కొడుకు యోహానాను, ఇంకా గర్విష్ఠులంతా యిర్మీయాతో ఇలా అన్నారు: “నీవు అబద్ధమాడుతున్నావు. ఈజిప్ట్‌లో ఉండడానికి అక్కడికి వెళ్ళవద్దని మాతో చెప్పమని మన దేవుడు యెహోవా నిన్ను పంపలేదు.
[3] అయితే నేరీయా కొడుకు బారూకు మాకు వ్యతిరేకంగా నిన్ను ప్రేరేపిస్తున్నాడు. మేము కల్దీయవాళ్ళ వశం కావాలనీ వాళ్ళు మమ్మల్ని చంపాలనీ లేదా బబులోనుకు బందీలుగా తీసుకుపోవాలనీ వాడి ఉద్దేశం.”
[4] యూదాదేశంలో ఉండాలని యెహోవా ఇచ్చిన ఆజ్ఞను కారేహ కొడుకు యోహానాను, సైన్యాధిపతులంతా, ప్రజలంతా శిరసావహించలేదు.
[5] కారేహ కొడుకు యోహానాను సైన్యాధిపతులంతా ఇలా చేశారు: చెదరిపోయిన అన్ని దేశాలనుంచి యూదా దేశంలో కాపురముండడానికి వచ్చిన యూదా వారందరినీ పురుషులనూ స్త్రీలనూ పిల్లలనూ అందరినీ
[6] రాజు కుమార్తెలనూ తీసుకొని బయలుదేరారు. కావలివాళ్ళ అధిపతి నెబుజరదాను షాఫాను మనుమడూ అహీకాం కొడుకూ అయిన గెదల్యా దగ్గర విడిచిపెట్టిన వారందరినీ, యిర్మీయాప్రవక్తనూ నేరీయా కొడుకైన బారూకునూ కూడా తీసుకుపోయారు.
[7] వాళ్ళు యెహోవా మాట పెడచెవిని పెట్టి, ఈజిప్ట్ దేశానికి వెళ్ళారు. తహపనేసు వరకు ప్రయాణం సాగించారు.
[8] తహపనేసులో యెహోవానుంచి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది:
[9] “యూదులు చూస్తూ ఉండగానే నీ చేతుల్లో పెద్ద రాళ్ళను తీసుకొని తహపనేసులో ఫరో నగరుద్వారం దగ్గరికి వెళ్ళు. అక్కడ ఇటుకలు పరచిన స్థలంలో ఉన్న సున్నంలో వాటిని పాతిపెట్టు.
[10] అప్పుడు వాళ్ళతో ఇలా చెప్పు: ఇస్రాయేల్ ప్రజల దేవుడూ సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేది ఏమిటంటే ఇదిగో వినండి! నేను నా దాసుడైన బబులోను రాజు నెబుకద్‌నెజరును పిలవనంపిస్తాను. నేను దాచిన ఈ రాళ్ళమీద అతడు తన సింహాసనం నిలుపుకొనేట్టు చేస్తాను. అతడు తన రత్నకంబళిని వాటిమీదే వేయిస్తాడు.
[11] అతడు వచ్చి ఈజిప్ట్ పై బడతాడు. అప్పుడు అంటురోగానికి నిర్ణయిమైన వాళ్ళు అంటురోగానికి గురి అవుతారు, చెర కోసం నిర్ణయమైన వాళ్ళు చెరకు పోతారు, కత్తికి నిర్ణయమైన వాళ్ళు కత్తిపాలవుతారు.
[12] ఈజిప్ట్‌వారి దేవుళ్ళ గుళ్ళకు నేను జ్వాల అంటిస్తాను. నెబుకద్‌నెజరు వాటిని కాల్చివేసి ఆ దేవుళ్ళ విగ్రహాలను పట్టుకుపోతాడు. గొర్రెల కాపరి తన కంబళిని చుట్టుకొన్నట్టు అతడు ఈజిప్ట్ దేశాన్ని తనకు చుట్టుకొంటాడు. తర్వాత అక్కడనుంచి ప్రశాంతంగా వెళ్ళిపోతాడు.
[13] ఈజిప్ట్‌లో ఉన్న సూర్యుడి ఆలయంలోని విగ్రహాలను పగలగొట్టివేస్తాడు. ఈజిప్ట్ వారి దేవుళ్ళ గుళ్ళను మంటలంటించి కాల్చివేస్తాడు.”