[1] ఆ సంవత్సరంలోనే (యూదా రాజు సిద్కియా పరిపాలన ప్రారంభంలో ఉన్న నాలుగో సంవత్సరం అయిదో నెల) గిబియోన్‌పురవాసి అజ్జూరు కొడుకు హనన్యాప్రవక్త యెహోవా ఆలయంలో నాతో మాట్లాడాడు. యాజుల ఎదుట, ప్రజలందరి ఎదుట, అతడు ఇలా చెప్పాడు:
[2] “ఇస్రాయేల్‌ప్రజల దేవుడూ సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, బబులోను రాజు ఉంచినకాడిని విరగగొట్టివేస్తాను.
[3] బబులోను రాజు నెబుకద్‌నెజరు ఇక్కడనుంచి బబులోనుకు తీసుకుపోయిన యెహోవా ఆలయ పాత్రలను రెండేళ్ళలోపల ఇక్కడికి మళ్ళీ తెప్పిస్తాను.
[4] అంతే గాక, బబులోను రాజు ఉంచినకాడిని విరగగొట్టివేసి, యూదా రాజూ, యెహోయాకీం కొడుకూ అయిన యెకొన్యారాజు తిరిగి ఈ స్థలానికి వచ్చేలా చేస్తాను. యూదానుంచి బబులోనుకు బందీలుగా పోయిన వాళ్ళందరినీ అతడితోపాటు రప్పిస్తాను. ఇది యెహోవా వాక్కు.”
[5] అప్పుడు, యెహోవా ఆలయంలో నిలబడి ఉన్న యాజుల ఎదుట, ప్రజలందరి ఎదుట యిర్మీయాప్రవక్త హనన్యాప్రవక్తకు జవాబిచ్చాడు.
[6] యిర్మీయాప్రవక్త అన్నాడు, “తథాస్తు! యెహోవా అలాగే చేస్తాడు గాక! బబులోనునుంచి ఈ స్థలానికి యెహోవా ఆలయ పాత్రలనూ బందీలుగా పోయినవాళ్ళందరినీ ఆయన రప్పించి, నీవు ప్రవక్తగా పలికిన మాటలు నెరవేరుస్తాడు గాక!
[7] అయినా, నేను నీ ఎదుట, ఈ ప్రజలందరి ఎదుట ఒక మాట చెప్పబోతున్నాను. ఈ మాట వినండి.
[8] నాకూ నీకూ ముందుగా వచ్చిన ప్రవక్తలు అనేక దేశాలమీదికీ, గొప్ప రాజ్యాలమీదికీ యుద్ధం, విపత్తు, ఘోరమైన అంటురోగాలు వస్తాయని పూర్వకాలంనుంచి పరవశులై పలుకుతూ వచ్చారు.
[9] శాంతి సిద్ధిస్తుందని ఒక ప్రవక్త ప్రకటిస్తాడనుకోండి. ఆ ప్రవక్త పలికిన మాట నెరవేరితేనే నిజంగా యెహోవా ఆ ప్రవక్తను పంపాడని తెలుస్తుంది.”
[10] యిర్మీయాప్రవక్త మెడకు ఆ కాడిమ్రాను ఇంకా ఉంది. హనన్యాప్రవక్త దానిని అతడి మెడమీదనుంచి తీసి, విరగగొట్టాడు.
[11] అప్పుడు ప్రజలందరి ఎదుట హనన్యా ఇలా అన్నాడు: “యెహోవా చెప్పేదేమిటంటే, బబులోను రాజు నెబుకద్‌నెజరు ఉంచిన కాడిని నేను రెండేళ్ళలోగా అన్ని జనాల మెడలపైనుంచి ఈవిధంగా తీసి విరగగొట్టివేస్తాను.” అది విని యిర్మీయాప్రవక్త తన దారిన వెళ్ళాడు.
[12] హనన్యాప్రవక్త యిర్మీయాప్రవక్త మెడమీదనుంచి కాడిమ్రానును తీసి విరగగొట్టిన కొద్దికాలానికి యెహోవానుంచి ఈ వాక్కు యిర్మీయాకు వచ్చింది:
[13] “వెళ్ళి హనన్యాతో ఇలా చెప్పు: యెహోవా చెప్పేదేమిటంటే, నీవు కొయ్య కాడిని విరగగొట్టావు. ఆ విధంగా దానికి బదులు నీవు ఇనుప కాడిని చేయించావు.
[14] ఇస్రాయేల్‌యొక్క దేవుడూ సేనలప్రభువూ అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు: ఈ జనాలన్నీ బబులోను రాజు నెబుకద్‌నెజరుకు సేవ చేయాలని నేను వాటి మెడమీద ఇనుప కాడిని ఉంచుతాను. అవి అతడికి సేవ చేసి తీరుతాయి. భూమిమీద తిరిగే జంతువులను కూడా అతడి వశం చేస్తాను.”
[15] అప్పుడు యిర్మీయాప్రవక్త హనన్యాప్రవక్తతో “హనన్యా, విను! యెహోవా నిన్ను పంపలేదు. నీవు ఈ ప్రజచేత అబద్ధాన్ని నమ్మించావు.
[16] గనుక యెహోవా చెప్పేదేమిటంటే, నేను నిన్ను భూతలంమీద లేకుండా చేయబోతున్నాను. నీవు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు మాటలు పలికావు గనుక ఈ సంవత్సరమే నీవు చచ్చిపోతావు.”
[17] ఆ సంవత్సరమే ఏడో నెలలో హనన్యాప్రవక్త మృతి చెందాడు.