Skip to content
Opens in a new window

[1] బబులోను రాజు నెబుకద్‌నెజరు యూదాదేశానికి యోషీయా కొడుకు సిద్కియాను రాజుగా చేశాడు. అతడు యెహోయాకీం కొడుకైన కొన్యాకు మారుగా పరిపాలన చేశాడు.

[2] అయితే యెహోవా యిర్మీయా ప్రవక్తచేత పలికించిన మాటలను అతడు గానీ అతడి పరివారం గానీ ప్రజలు గానీ పాటించలేదు.

[3] అయినా సిద్కియారాజు, “మా కోసం మన దేవుడు యెహోవాకు ప్రార్థన చేయండి” అని యిర్మీయాప్రవక్త దగ్గరికి షెలెమ్యా కొడుకు యెహుకల్‌నూ మయశేయా కొడుకు జెఫన్యాయాజినీ పంపాడు.

[4] యిర్మీయాను ఖైదులో ఉంచడం ఇంకా జరగలేదు. అతడు ప్రజలమధ్యకు వస్తూ పోతూ ఉన్నాడు.

[5] అంతలో ఫరో సైన్యం ఈజిప్ట్‌నుంచి బయలుదేరింది. జెరుసలంను ముట్టడివేస్తూ ఉన్న కల్దీయవాళ్ళు అది విని జెరుసలంనుంచి వెళ్ళారు.

[6] అప్పుడు యెహోవానుంచి వాక్కు యిర్మీయా ప్రవక్తకు వచ్చింది:

[7] “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నా దగ్గర విచారణ చేయాలని నిన్ను పంపిన యూదా రాజుకు నీవు ఇలా చెప్పు: నీకు సహాయం చేయడానికి బయలుదేరిన ఫరో సైన్యం దాని సొంత దేశమైన ఈజిప్ట్‌కు తిరిగి వెళ్ళిపోతుంది.

[8] కల్దీయవాళ్ళు మళ్ళీ వచ్చి ఈ నగరంమీద యుద్ధం చేస్తారు. దీనిని వశం చేసుకొని మంటలతో కాల్చివేస్తారు.

[9] యెహోవా చెప్పేదేమిటంటే, మిమ్మల్ని మీరు మోసం చేసుకొంటూ ‘కల్దీయవాళ్ళు మనదగ్గరనుంచి దూరంగా వెళ్ళిపోతారు’ అనవద్దు. వాళ్ళు అలా చేయరు.

[10] ఒకవేళ మీమీద యుద్ధం చేసే కల్దీయవాళ్ళ సైన్యమంతటినీ మీరు గెలిచినా, వాళ్ళ డేరాలలో గాయపడ్డవాళ్ళు మాత్రమే మిగిలినా, వాళ్ళు డేరాలనుంచి వచ్చి ఈ నగరాన్ని మంటలు అంటించి కాల్చివేస్తారు.”

[11] ఫరో సైన్యం రావడం కారణంగా కల్దీయవాళ్ళ సైన్యం వెళ్ళాక,

[12] యిర్మీయా జెరుసలంనుంచి బెన్యామీను ప్రదేశానికి బయలుదేరాడు. అక్కడ తనవారిదగ్గర తన భాగం తీసుకొందాం అనుకొన్నాడు.

[13] అతడు “బెన్యామీను ద్వారం” దగ్గరికి చేరినప్పుడు కాపలావాళ్ళ అధిపతి అక్కడ ఉన్నాడు. అతడి పేరు ఇరీయా. అతడు షెలమ్యా కొడుకు, హనన్యా మనుమడు. అతడు యిర్మీయాప్రవక్తను పట్టుకొని “నువ్వు కల్దీయవాళ్ళతో చేరబోతున్నావు” అన్నాడు.

[14] అందుకు యిర్మీయా “అది నిజం కాదు. నేను కల్దీయవాళ్ళతో చేరబోవడం లేదు” అన్నాడు. అయితే ఇరీయా అతడి మాట నమ్మలేదు. యిర్మీయాను పట్టుకొని అధికారుల దగ్గరికి తీసుకుపోయాడు.

[15] వాళ్ళు యిర్మీయామీద కోపపడి, అతణ్ణి తాము ఖైదుగా మార్చిన యోనాతాను ఇంటిలో వేయించారు. ఇతడు లేఖకుడు.

[16] యిర్మీయా ఖైదు గదిలో చేరి, అక్కడ చాలా రోజులు ఉన్నాడు.

[17] తరువాత సిద్కియారాజు మనుషులను పంపి రాజు నగరుకు అతణ్ణి రప్పించాడు. “యెహోవానుంచి ఏదైనా వాక్కు ఉందా?” అని అతణ్ణి రహస్యంగా అడిగాడు. అందుకు యిర్మీయా “ఉంది, మిమ్ములను బబులోను రాజు చేతికి అప్పగించడం జరుగుతుంది” అన్నాడు.

[18] యిర్మీయా సిద్కియారాజుతో ఇంకా అన్నాడు, “మీరు నన్ను ఖైదులో వేశారు. అయితే నేను మీకు గానీ, మీ పరివారానికి గానీ ఈ ప్రజలకు గానీ వ్యతిరేకంగా ఏం తప్పు చేశాను?

[19] ‘మీమీదికి, ఈ దేశంమీదికి బబులోను రాజు రాడని మీ ప్రవక్తలు ప్రకటించారు గదా. వాళ్ళెక్కడ ఉన్నారు?

[20] నా యజమానీ, రాజా, ఇప్పుడు దయతో వినండి. నా మనవి అంగీకరించండి. నేను లేఖకుడైన యోనాతాను ఇంట్లో చస్తానేమో. నన్ను అక్కడికి పంపించవద్దు.”

[21] అందుచేత సిద్కియారాజు యిర్మీయాను కాపలావాళ్ళ ఆవరణంలో ఉంచాలనీ, నగరంలో రొట్టెలన్నీ అయిపోయేంత వరకూ రొట్టెలు కాల్చేవాళ్ళ వీధిలోనుంచి ప్రతిరోజూ రొట్టెను తెచ్చి అతడికి ఇవ్వాలనీ ఆదేశించాడు. యిర్మీయా కావలివాళ్ళ ఆవరణంలో ఉండిపోయాడు.

యిర్మీయా — Chapters