[1] ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా మోయాబు విషయం చెప్పేదేమంటే, “నెబోకు బాధ తప్పదు. అది పాడైపోతుంది. కిర్యతాయిం పట్టబడి అవమానం పాలవుతుంది. కోటను పడగొట్టడం, సిగ్గు పరచడం జరుగుతుంది.
[2] మోయాబుకు ఇకనుంచి ప్రసిద్ధి ఉండదు. మోయాబును జనంగా ఉండకుండా అంతం చేద్దాం, పట్టండి అంటూ హెష్బోనులో దానికి వ్యతిరేకంగా దురాలోచనలు చేయడం జరుగుతుంది. మద్మేనూ! నీవు కూడా నాశనమవుతావు. ఖడ్గం నిన్ను తరుముతుంది.
[3] హొరొవయీంలోనుంచి కేకలు వినబడుతాయి. అక్కడ కొల్లగొట్టడం, గొప్ప నాశనం జరుగుతుంది.
[4] మోయాబు ధ్వంసమవుతుంది. దాని చిన్నవారి పెడబొబ్బలు వినిపిస్తూ ఉంటాయి.
[5] లూహీతుకు ఎక్కుతూ ఉండగా ఏడుస్తూనే ఉంటారు. హొరొవయీంకు దిగుతూ ఉండేవాళ్ళకు నాశనం అవుతున్న చప్పుడు వినబడుతుంది.
[6] “పారిపోండి! మీ ప్రాణాలను దక్కించుకోండి! ఎడారిలో పొదలాగా ఉండండి!
[7] నీవు నీ పనుల మీద, ధనంమీద ఆధారపడ్డావు, గనుక నీవు కూడా పట్టుబడతావు. కెమోషు, వాడి పూజారులు, అధికారులు బందీలుగా వేరే దేశానికి పోతారు.
[8] వినాశకారి ప్రతి పట్టణం మీదికీ వస్తాడు. ఏ పట్టణమూ తప్పించుకోదు. యెహోవా చెప్పినట్టే లోయ నాశనం అవుతుంది, ఎత్తయిన మైదానం పాడవుతుంది.
[9] మోయాబు త్వరగా ఎగిరిపోయేట్టు దానికి రెక్కలు ఇవ్వండి. దాని పట్టణాలు పాడవుతాయి. వాటిలో ఎవరూ కాపురముండరు.
[10] యెహోవా పూనుకొన్న ఈ పని అశ్రద్ధగా చేసేవాడు శాపానికి గురి అవుతాడు గాక! తన ఖడ్గాన్ని రక్తపాతం చేయకుండా చేసేవాడు శాపానికి గురి అవుతాడు గాక!
[11] “మోయాబు ఆరంభం నుంచి నెమ్మదిగా ఉంది. అది మడ్డిమీద నిలిచే ద్రాక్షరసంలాంటిది. ఒక పాత్రలోనుంచి ఇంకో పాత్రలోకి పోయబడని దానిలాగా ఉంది. ఆ జనాన్ని చెరపట్టుకుపోవడం జరగలేదన్న మాట. గనుక దాని సారం ఎప్పటిలాగే ఉంది. దాని వాసన కూడా మారలేదు.
[12] అయితే రాబోయే రోజుల్లో పాత్రలను వంచేవాళ్ళను దాని దగ్గరికి పంపిస్తాను. వాళ్ళు దానిని వంచి దాని పాత్రలను ఖాళీ చేస్తారు, పగలగొట్టివేస్తారు. ఇది యెహోవా వాక్కు,
[13] ఇస్రాయేల్ ప్రజలు బేతేల్ మీద నమ్మకం ఉంచిన సంగతిని గురించి సిగ్గుపడ్డట్టే మోయాబు కెమోషు విషయం సిగ్గుపాలవుతుంది.
[14] ‘మేము బలాఢ్యులం, యుద్ధవీరులం’ అని మీరు ఎలా చెప్పుకొంటారు?
[15] మోయాబు నాశనం అవుతుంది. శత్రువులు దాని పట్టణాలలో చొరబడతారు. మోయాబు యువకులలో ఉత్తములు హతం అవుతారు అని రాజూ, సేనలప్రభువూ అయిన యెహోవా చెపుతున్నాడు.
[16] “మోయాబుకు విపత్తు సమీపంగానే ఉంది. దానికి ఆపద త్వరగా వస్తూ ఉంది.
[17] దాని చుట్టూరా ఉన్న వారలారా! దాని పేరు ప్రతిష్ఠలు తెలిసిన వారలారా! మీరంతా దాని విషయం శోకించండి. ‘బలం గల రాజదండం విరిగిపోయింది! ఘనమైన రాజదండం విరిగిపోయింది!’ అనండి.
[18] దీబోను పురవాసులారా! మోయాబును నాశనం చేసేవాడు మీ మీదికి కూడా వస్తాడు, మీ కోటలను పాడు చేస్తాడు, గనుక మీ గొప్పతనం విడిచి దిగిరండి! ఎండిపోయిన భూమిలో కూర్చోండి!
[19] ఆరోయేరు పట్టణస్థులారా! దారి దగ్గర నిలబడి చూస్తూ ఉండండి. పారిపోతున్నవాణ్ణి, తప్పించుకుపోతున్న స్త్రీని చూచి ‘ఏం జరిగింది?’ అని అడగండి.”
[20] “మోయాబు చితికిపోయింది. సిగ్గుపాలయింది. గోలపెట్టండి! కేకలు వేయండి! ‘మోయాబు పాడైపోయింద’ని అర్నోను నది దగ్గర చాటించండి.
[21] దాని ఎత్తయిన మైదానం మీదికి కూడా న్యాయమైన దండన వచ్చింది. హోలోను, యాహను, మేఫాతు, దీబోను,
[22] నెబో, బేత్ దిబ్లాతయీం,
[23] కిర్యతాయిం, బేత్‌మెయోను,
[24] కెరీయోతు, బొస్రా మోయాబు దేశంలో దగ్గరగా దూరంగా ఉన్న అన్ని పట్టణాలకూ దండన వచ్చింది.
[25] మోయాబు కొమ్ము విరిగిపోయింది. దాని హస్తం తెగిపోయింది. ఇది యెహోవా వాక్కు.
[26] “మోయాబు యెహోవాకు వ్యతిరేకంగా తనను గొప్ప చేసుకొంది, గనుక దానికి మత్తు కలిగించండి. అది తన వాంతిలో పొర్లాడాలి, నవ్వుల పాలు కావాలి.
[27] ఇస్రాయేల్‌ప్రజ నీకు నగుబాటుగా ఉంది గదా. నీవు వారిని గురించి మాట్లాడేటప్పుడెల్లా తల ఆడించుకొంటావేం! మరి వారు దొంగలతో కలిసి తిరిగారా?
[28] మోయాబులో నివసించేవారలారా! మీ పట్టణాలు విడిచి బండల సందులలో ఉండండి. అగాధం అవతల ప్రక్కన గూడు కట్టుకొనే పావురంలాగా ఉండండి.
[29] “మోయాబువాళ్ళ గర్వాన్ని గురించి మేము విన్నాం. వాళ్ళు చాలా గర్విష్ఠులు. వాళ్ళ మిడిసిపాటు, గర్వం, మదం, అహంభావం గురించి నాకు తెలుసు. ఇది యెహోవా వాక్కు.
[30] వాళ్ళ అహంకారం వ్యర్థం. వాళ్ళు పలికే డంబాలు పనికిమాలినవి.
[31] కాబట్టి నేను మోయాబు విషయం విలపిస్తాను. మోయాబువాళ్ళందరి కోసం ఏడుస్తాను. కీర్‌హరెశ్ మనుషుల విషయం మూలుగుతాను.
[32] సిబ్మా ద్రాక్ష చెట్టూ! యాజెరు విషయం లాగా నీ విషయం కన్నీళ్ళు విడుస్తాను. నీ తీగెలు సరస్సు అవతలికి కూడా వ్యాపించాయి. అవి యాజెరు సరస్సు వరకు ప్రాకాయి. నీ వేసవికాలం పండ్లమీద, నీ ద్రాక్ష గెలలమీద వినాశకారి పడ్డాడు.
[33] మోయాబు ఫలవంతమైన పొలాలలో సంతోషానందాలు లేకుండా పోయాయి. ద్రాక్ష గానుగ తొట్లలో ద్రాక్షరసం లేకుండా నేను చేశాను. ఎవరూ వాటిని సంతోషంతో త్రొక్కరు. కేకలు ఉన్నా అవి సంతోషాన్ని సూచించే కేకలు కావు.
[34] నిమ్రీంలో నీళ్ళు కూడా ఇంకిపోయాయి గనుక హెష్బోనులోనుంచి వాళ్ళ బొబ్బలు ఏలాలే వరకు, యాహసు వరకు వినబడుతూ ఉన్నాయి; సోయరు నుంచి హొరొనయీం వరకు, ఎగ్లాత్‌షాలిషా వరకు వినబడుతాయి.
[35] ఎత్తయిన పూజా స్థలాలలో బలులు అర్పించేవాళ్ళు, తమ దేవుళ్ళకు ధూపం వేసేవాళ్ళు మోయాబులో లేకుండా నేను చేస్తాను. ఇది యెహోవా వాక్కు.
[36] “కాబట్టి మోయాబు కోసం నా హృదయం పిల్లనగ్రోవిలాగా ధ్వనిస్తూ ఉంది. కీర్‌హరెశ్‌వాళ్ళ విషయం నా హృదయం పిల్లనగ్రోవిలాగా ధ్వనిస్తూ ఉంది. వాళ్ళు సంపాదించుకొన్న ఆస్తి అంతా నాశనమైంది.
[37] ప్రతి తల బోడిగా చేయబడింది. ప్రతి గడ్డం చెక్కివేయబడింది. అన్ని చేతులకు కాట్లు ఉన్నాయి, ప్రతి నడుముమీద గోనెపట్ట ఉంది.
[38] ఎవరికీ నచ్చని కుండలాగా మోయాబును నేను పగలగొట్టాను, గనుక మోయాబులో ప్రతి ఇంటి కప్పుమీద, దాని వీధుల్లో రోదనం వినబడుతూ ఉంది. ఇది యెహోవా వాక్కు.
[39] మోయాబు ఎంత చితికిపోయింది! వాళ్ళు ఎంత గోల పెడుతున్నారు! మోయాబు వీపు చూపి పారిపోయింది. ఎంత సిగ్గు! వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు హేళనగా అసహ్యకారణంగా అయ్యారు.”
[40] యెహోవా చెప్పేదేమిటంటే, “ఇదిగో! శత్రువు గరుడపక్షిలాగా ఎగిరివస్తున్నాడు, తన రెక్కలు మోయాబుమీద చాపుతున్నాడు.
[41] పట్టణాలను పట్టుకొంటాడు, కోటలను వశం చేసుకొంటాడు. ఆ రోజున మోయాబు యుద్ధవీరుల గుండెలు, ప్రసవవేదనలు పడుతున్న స్త్రీ గుండెలాగా ఉంటాయి.
[42] యెహోవాకు వ్యతిరేకంగా తనను గొప్ప చేసుకొన్నందుచేత మోయాబు జనంగా ఉండకుండా పూర్తిగా నాశనం అవుతుంది.
[43] మోయాబు దేశ నివాసులారా! భయం, గొయ్యి, ఉరి మీ ఎదుటే ఉన్నాయి. ఇది యెహోవా వాక్కు.
[44] భయ కారణం నుంచి పారిపోయేవాళ్ళు గోతిలో పడతారు. గోతిలోనుంచి పైకి ఎక్కేవాళ్ళు ఉరిలో చిక్కుకొంటారు. మోయాబు మీదికి రావలసిన శిక్షా సంవత్సరం రప్పించబోతున్నాను. ఇది యెహోవా వాక్కు.
[45] హెష్బోనులో నుంచి జ్వాల బయలుదేరింది, సీహోను మధ్యనుంచి మంటలు వచ్చాయి. అవి మోయాబు నుదురును, అల్లరిమూక నడినెత్తిని కాల్చాయి, గనుక పారిపోయినవాళ్ళు హెష్బోను నీడలో దిక్కుమాలినవాళ్ళై నిలబడి ఉన్నారు.
[46] మోయాబూ! నీకు బాధ తప్పదు. కెమోషు జనం నాశనమవుతారు. నీ కొడుకులు బందీలుగా పోతారు, నీ కూతుళ్ళు చెరలోకి పోతారు.
[47] అయినా రాబోయే కాలంలో మోయాబుకు ముందున్న క్షేమస్థితిని నేను మళ్ళీ కలిగిస్తాను. ఇది యెహోవా వాక్కు.” ఇంతటితో మోయాబు తీర్పును గురించిన సందేశం అయిపోయింది.