[1] వర్షం లేని కాలాన్ని గురించి యెహోవా నుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు –
[2] “యూదా దుఃఖిస్తూ ఉంది. దాని ద్వారాలు నీరసించిపొయ్యాయి. ప్రజలు నేలమీద విలపిస్తూ ఉన్నారు. జెరుసలం చేసే రోదనం పైకి పోతూ ఉంది.
[3] వాళ్ళ నాయకులు నీళ్ళకోసం పనివాళ్ళను పంపుతారు. వాళ్ళు బావులదగ్గరికి పోతే నీళ్ళుండవు. వాళ్ళు ఖాళీ కడవలతో తిరిగి వస్తారు. నిరాశ చెంది, నొచ్చుకుంటూ, తమ తలలు కప్పుకొంటారు.
[4] దేశంలో వర్షం రాకపోవడంచేత నేల బీటలు వారింది. కర్షకులు ఆశాభంగం పొంది తమ తలలు కప్పుకొంటారు.
[5] లేడి మైదానంలో ఈని పిల్లను వదలివేస్తుంది. ఎందుకంటే అక్కడ గడ్డి లేదు.
[6] అడవి గాడిదలు చెట్లులేని ఎత్తు స్థలాలమీద నిలబడి ఉండి నక్కలలాగా రొప్పుతూ ఉన్నాయి. మేత లేక వాటి కండ్లు పీక్కుపోతున్నాయి.”
[7] యెహోవా! మేము చాలా సార్లు త్రోవ తప్పిపోయాం, నీకు వ్యతిరేకంగా అపరాధం చేశాం. మా అపరాధాలు మాకు విరుద్ధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అయినా నీ పేరు ప్రతిష్ఠలకోసం ఏదైనా చెయ్యి.
[8] ఇస్రాయేల్ ప్రజకు ఆశ్రయంగా ఉన్నవాడా! కష్టకాలంలో వారికి రక్షకా! ఈ దేశంలో నీవెందుకు పరాయివాడుగా ఉన్నావు? ఒక్క రాత్రే బస చేసే బాటసారిలాగా ఉన్నావు?
[9] నీవెందుకు నిర్ఘాంతపోయిన మనిషిలాగా, కాపాడలేని బలాఢ్యుడిలాగా ఉన్నావు? యెహోవా! నీవు మామధ్య ఉన్నావు. నీ పేరు మా మీద నిలిచి ఉంది. మమ్మల్ని విడిచిపెట్టవద్దు.
[10] ఈ ప్రజను గురించి యెహోవా చెప్పేదేమిటంటే, “తిరుగులాడడం అంటే ఈ ప్రజకు చాలా ఇష్టం. తమ అడుగులు హద్దులో ఉంచేవారు కారు. అందుచేత యెహోవా వారిని స్వీకరించడం లేదు. ఇప్పుడు ఆయన వాళ్ళ దురాచారాలను తలచుకొని, వాళ్ళ అపరాధాల కారణంగా వాళ్ళను శిక్షిస్తాడు.”
[11] అప్పుడు యెహోవా నాతో అన్నాడు, “ఈ ప్రజల క్షేమంకోసం ప్రార్థన చేయకు.
[12] వాళ్ళు ఉపవాసం ఉన్నా వాళ్ళ మొర నేను వినను. వాళ్ళు హోమాలు, నైవేద్యాలు అర్పించినా నేను వాళ్ళను స్వీకరించను. దానికి బదులుగా వాళ్ళను ఖడ్గానికీ, కరవుకూ ఘోరవ్యాధికీ గురిచేసి నాశనం చేస్తాను.”
[13] అందుకు నేను అన్నాను, “అయ్యో. యెహోవా ప్రభూ! ప్రవక్తలు వాళ్ళతో ఇలా చెపుతున్నారు: మీరు ఖడ్గం చూడరు, కరవు రాదు, ఇక్కడ స్థిరమైన శాంతి మీకు ప్రసాదిస్తాను.”
[14] అప్పుడు యెహోవా నాతో అన్నాడు, “ప్రవక్తలు నా పేర అబద్ధాలు పలుకుతున్నారు. నేను వాళ్ళను పంపలేదు, వాళ్ళను నియమించలేదు. వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళు పలుకుతూ ఉండేది మాయాదర్శనాలు, పనికిమాలిన శకునాలు, వాళ్ళ మనసులో పుట్టే మోసాలు.
[15] అందుచేత యెహోవా అనే నేను నా పేర పలికే ఆ ప్రవక్తలను గురించి చెప్పేదేమిటంటే, నేను వాళ్ళను పంపకపోయినా, వాళ్ళు ‘ఈ దేశంమీదికి ఖడ్గం గానీ, కరవుగానీ రాదు’ అంటున్నారు – ఆ ప్రవక్తలు ఖడ్గంచేత, కరవుచేత నాశనమవుతారు.
[16] అంతేగాక, వాళ్ళు ఎవరితో నా పేరు పలుకుతున్నారో ఆ ప్రజలను కరవు, ఖడ్గం కారణంగా జెరుసలం వీధుల్లో పడవేయడం జరుగుతుంది. వాళ్ళను, వాళ్ళ భార్యలను వాళ్ళ కొడుకులను, కూతుళ్ళను పాతిపెట్టడానికి ఎవ్వరూ ఉండరు. వాళ్ళకు తగిన కీడు వాళ్ళమీద కుమ్మరిస్తాను.
[17] “నీవు వాళ్ళతో ఈ మాటలు చెప్పాలి – ‘కన్యకుమార్తె – నా ప్రజ – పెద్ద దెబ్బకు గురి అయి నలిగిపోయింది, ఘోరమైన గాయం పొందింది, గనుక రాత్రింబగళ్ళు, ఎడతెరిపి లేకుండా నేను కన్నీరు మున్నీరుగా విలపిస్తాను.
[18] నగరంనుంచి బయటి ప్రాంతానికి నేను వెళ్ళి చూస్తే ఖడ్గంచేత హతమైనవారు కనిపిస్తున్నారు. నగరంలోకి వెళ్ళి చూస్తే కరవుచేత బాధపడేవాళ్ళు కనిపిస్తున్నారు. ప్రవక్తలూ యాజులూ తమకు తెలియని దేశంలో తిరుగులాడుతున్నారు.”
[19] నీవు యూదాను పూర్తిగా విసర్జించావా? సీయోను అంటే నీకు అసహ్యంగా ఉందా? మేము బాగుపడలేనంతగా మమ్మల్ని నీవెందుకు కొట్టావు? మేము శాంతికోసం చూశాం గాని, మంచి ఏమీ జరగలేదు. క్షేమంకోసం చూశాం గాని, భయమే ప్రాప్తించింది.
[20] యెహోవా! మేము నీకు వ్యతిరేకంగా పాపం చేశాం. మేము చేసిన చెడుగు, మా పూర్వీకులు చేసిన అపరాధాలు ఒప్పుకొంటున్నాం.
[21] మమ్మల్ని త్రోసివేయవద్దు – నీ పేరుప్రతిష్ఠలను గురించి ఆలోచించు. గౌరవప్రదమైన నీ సింహాసనాన్ని అవమానపరచకు. నీవు మాతో చేసిన ఒడంబడికను తలచుకొని దానిని భంగం చేయకు.
[22] ఇతర జనాలు పెట్టుకొన్న వ్యర్థమైన విగ్రహాలలో ఏదైనా వర్షం కురిపించగలదా? ఆకాశం దానంతట అదే వాన ఇస్తుందా? మా దేవుడవైన యెహోవా! వాన కురిపించేది నీవే. ఇలాంటి వాటన్నిటినీ నీవే చేస్తున్నావు. గనుక నీకోసమే మేము ఆశాభావంతో చూస్తున్నాం.