Skip to content
Opens in a new window

[1] ఎనిమిదో రోజు మోషే అహరోన్నూ అతడి కొడుకులనూ ఇస్రాయేల్‌ప్రజల పెద్దలనూ పిలిపించాడు.

[2] అహరోనుతో ఇలా అన్నాడు: “నీవు పాపాలకోసమైన బలిగా లోపం లేని ఒక కోడెనూ హోమబలిగా లోపం లేని పొట్టేలును యెహోవా సన్నిధానానికి తీసుకురా.

[3] ఆ తరువాత ఇస్రాయేల్ ప్రజతో ఈ విధంగా చెప్పు – ఈ రోజు యెహోవా మీకు ప్రత్యక్షం అవుతాడు, గనుక ఆయన సన్నిధానంలో బలులు సమర్పించాలి. మీరు పాపాలకోసమైన బలిగా లోపం లేని మేకపోతునూ హోమబలిగా లోపం లేని ఏడాది కోడెనూ గొర్రెపిల్లనూ తీసుకురండి;

[4] శాంతి బలులుగా ఎద్దునూ, పొట్టేలునూ తీసుకురండి; నూనె కలపిన నైవేద్యాన్ని కూడా తీసుకురండి”.

[5] మోషే ఆజ్ఞాపించినవాటిని వారు సన్నిధిగుడారం ఎదుటికి తీసుకువచ్చారు. సమాజమంతా దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధానంలో నిలబడ్డారు.

[6] అప్పుడు మోషే “యెహోవా మహిమా ప్రకాశం మీకు కనిపించేలా మీరు ఇలా చెయ్యాలని ఆయన ఆజ్ఞాపించాడు” అన్నాడు.

[7] అహరోనుతో మోషే “బలిపీఠం సమీపించి పాపాలకోసం నీ బలినీ నీ హోమాన్నీ సమర్పించు. నీ పాపాలనూ ప్రజల పాపాలనూ కప్పివెయ్యి. యెహోవా ఇచ్చిన ఆజ్ఞప్రకారం, ప్రజలు తెచ్చిన అర్పణ అర్పించి వారి పాపాలను కప్పివెయ్యి” అన్నాడు.

[8] అందుచేత అహరోను బలిపీఠం సమీపించాడు. పాపాలకోసమైన బలిగా తన కోడెను వధించాడు.

[9] అహరోను కొడుకులు దాని రక్తాన్ని అతనికి అందించారు. అతడు దానిలో తన వ్రేలు ముంచి బలిపీఠం మీది కొమ్ములమీద పూశాడు. మిగతా రక్తాన్ని బలిపీఠం అడుగున పోశాడు.

[10] ఆ బలి కొవ్వునూ, మూత్రపిండాలనూ, కారిజం అంటివున్న కొవ్వునూ బలిపీఠం మీద కాల్చివేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారమే అదంతా చేశాడు.

[11] దాని మాంసాన్నీ, చర్మాన్నీ శిబిరం బయట పూర్తిగా కాల్చివేశారు.

[12] అతడు హోమబలిని వధించాడు. అహరోను కొడుకులు దాని రక్తాన్ని అతనికి అందించారు. అతడు దాన్ని బలిపీఠం చుట్టూరా చల్లాడు.

[13] వారు హోమబలి తలను, ఏ భాగానికి ఆ భాగాన్ని అతనికి అందించారు, అతడు వాటిని బలిపీఠం మీద కాల్చివేశాడు.

[14] దాని లోపలి భాగాలనూ కాళ్ళనూ నీళ్లతో కడిగి బలిపీఠం పైన ఉన్న ఆ హోమం మీద ఉంచి వాటిని కూడా కాల్చివేశాడు.

[15] అప్పుడతను ప్రజల అర్పణను దగ్గరకు తెప్పించాడు. ప్రజల పాపాలకోసమైన బలిమేకను వధించి మొదటి దానిలాగే దాన్ని పాపాలకోసం అర్పించాడు.

[16] హోమబలి జంతువును కూడా దగ్గరకు తెప్పించాడు. న్యాయనిర్ణయం ప్రకారం దాన్ని అర్పించాడు.

[17] నైవేద్యాన్ని కూడా దగ్గరకు తెప్పించాడు. దానిలో నుంచి పిడికెడు తీసి, ప్రొద్దున చేసిన హోమం గాక దాన్ని కూడా బలిపీఠం మీద కాల్చివేశాడు.

[18] ప్రజలకోసం శాంతిబలులుగా ఉన్న ఆ ఎద్దునూ, పొట్టేలునూ వధించాడు. అహరోను కొడుకులు అతనికి వాటి రక్తాన్ని అందించారు. అతడు బలిపీఠం చుట్టూరా దాన్ని చల్లాడు.

[19] ఎద్దు కొవ్వును, పొట్టేలు కొవ్వును వాటి కొవ్విన తోకను వాటి పేగులమీది కొవ్వును వాటి మూత్రపిండాలను, కారిజం మీద అంటివున్న కొవ్వును తీశారు.

[20] ఆ బలుల బోరలమీద ఆ కొవ్వును ఉంచారు. అహరోను ఆ కొవ్వును బలిపీఠం మీద కాల్చివేశాడు.

[21] మోషే ఇచ్చిన ఆజ్ఞప్రకారం అహరోను ఆ బోరలనూ కుడి తొడలనూ కదలిక అర్పణగా యెహోవా సన్నిధానంలో అటూ ఇటూ కదల్చాడు.

[22] అహరోను పాపాలకోసమైన బలినీ, హోమ బలినీ, శాంతి బలులనూ అర్పించాక, ప్రజలవైపు తన చేతులెత్తి వారిని దీవించాడు. అప్పుడతను దిగివచ్చాడు.

[23] అతడు, మోషే సన్నిధిగుడారంలోకి ప్రవేశించారు. మళ్ళీ బయటికి వచ్చి ప్రజలను దీవించారు. అప్పుడు యెహోవా మహిమాప్రకాశం ప్రజలందరికీ కనిపించింది.

[24] యెహోవా సన్నిధానంనుంచి మంటలు వచ్చి బలిపీఠం మీద వున్న హోమాన్నీ, కొవ్వునూ కాల్చివేశాయి. దాన్ని చూచి ప్రజలంతా ఆనందధ్వనులు చేసి, సాగిలపడ్డారు.

లేవీయకాండం (యాజి ధర్మవిధులు) — Chapters