Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,

[2] “ఇస్రాయేల్ ప్రజలు దీపంకోసం దంచి తీసిన స్వచ్ఛమైన ఆలీవ్ నూనె నీ దగ్గరికి తేవాలని ఆదేశించు. ఆ దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా వారు ఆ నూనె తేవాలి.

[3] సన్నిధిగుడారంలో శాసనాల స్థలం ఎదుట ఉన్న అడ్డతెరకు వెలుపల ఆ దీపం ఉంటుంది. అది సాయంకాలంనుంచి ఉదయంవరకు యెహోవా సన్నిధానంలో ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండేలా అహరోను చూచుకోవాలి. ఇది మీ తరతరాలకు ఎప్పటికీ నిలిచివుండే చట్టం.

[4] యెహోవా సన్నిధానంలో ఉన్న మేలిమి బంగారు సప్తదీపస్తంభంమీద ఆ దీపాలను అతడు ఎల్లప్పుడూ చూచుకోవాలి.

[5] “నీవు గోధుమపిండితో పన్నెండు భక్ష్యాలు వండాలి. ఒక్కొక్క భక్ష్యానికి రెండు కిలోగ్రాముల పిండి ఉపయోగించాలి.

[6] ఆ భక్ష్యాలు యెహోవా సన్నిధానంలో ఉన్న మేలిమి బంగారు బల్లమీద రెండు వరుసలుగా ఉంచాలి. ఒక్కొక్క వరుసలో ఆరు భక్ష్యాలు ఉండాలి.

[7] ఒక్కొక్క వరుసలో స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. అది ఆ భక్ష్యాలకు స్మృతిచిహ్నంగా, యెహోవాకు చేసిన హోమంగా ఉంటుంది.

[8] యాజి ప్రతి విశ్రాంతిదినమూ యెహోవా సన్నిధానంలో క్రమంగా అదంతా పెట్టాలి. ఇది నిత్యమైన ఒడంబడిక ప్రకారం ఇస్రాయేల్ ప్రజలు ఇవ్వవలసినది.

[9] ఆ భక్ష్యాలు అహరోనుకు, అతడి సంతతివారికి చెందాలి. వారు ఒక పవిత్రమైన చోట వాటిని తినాలి. నిత్యమైన చట్టం ప్రకారం యెహోవాకు చేసే హోమాలలో అది అతి పవిత్రం.”

[10] ఇస్రాయేల్ స్త్రీకి, ఈజిప్ట్‌వాడికి పుట్టిన కొడుకు ఉండేవాడు. అతడి తల్లి పేరు షెలోమీత్. ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కూతురు. ఆ ఇస్రాయేల్ స్త్రీ కొడుకు ఇస్రాయేల్‌ప్రజల శిబిరం లోకి వెళ్ళి ఇస్రాయేల్ మనిషితో పోరాడాడు.

[11] ఆ ఇస్రాయేల్ స్త్రీ కొడుకు యెహోవా పేరును శపించి దూషించాడు. వారు అతణ్ణి మోషే దగ్గరికి తీసుకువచ్చారు.

[12] అతడి విషయం యెహోవా ఆజ్ఞ జారీ చేసేవరకు వారతణ్ణి కావలిలో ఉంచారు.

[13] యెహోవా మోషేతో ఇలా అన్నాడు:

[14] “దూషించినవాణ్ణి శిబిరం వెలుపలికి తీసుకుపో, వాడి దూషణ విన్నవారంతా వాడి తలమీద చేతులు ఉంచాలి. సమాజమంతా వాణ్ణి రాళ్ళు రువ్వి చంపాలి.

[15] అప్పుడు నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పాలి – తన దేవుణ్ణి దూషించినవాడు తన అపరాధం భరించాలి.

[16] యెహోవా పేరును శపించినవాడు మరణశిక్షకు గురి కావాలి. సంఘమంతా అలాంటివాణ్ణి రాళ్ళు రువ్వి చంపాలి. విదేశీయుడు గానీ, స్వదేశీయుడు గానీ యెహోవా పేరును దూషిస్తే వాడు మరణశిక్షకు గురి కావాలి.

[17] “మనిషిని హత్య చేసినవాడెవడైనా మరణశిక్షకు గురి కావాలి.

[18] జంతువును చంపినవాడెవడైనా ‘ప్రాణానికి బదులుగా ప్రాణం’ ప్రకారం దాని నష్టం చెల్లించాలి.

[19] ఎవడైనా సాటి మానవుణ్ణి గాయం చేస్తే వాడు చేసినట్టే వాడికి చెయ్యాలి.

[20] ఎముక విరగగొడితే వాడికి ఎముక విరగగొట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను పోగొట్టాలి. వాడు మరొకణ్ణి గాయం చేసినట్టే వాణ్ణి గాయం చేయాలి.

[21] జంతువును చంపినవాడు దాని నష్టం ఇచ్చుకోవాలి. మనిషిని హత్య చేసినవాడు మరణ శిక్షకు గురి కావాలి.

[22] మీరు విదేశీయులకూ స్వదేశీయులకూ సమదృష్టితో తీర్పు తీర్చాలి. ఎందుకంటే నేను యెహోవాను, మీ దేవుణ్ణి.”

[23] మోషే ఇస్రాయేల్ ప్రజలతో ఆ విధంగా చెప్పాడు, గనుక వారు దూషించినవాణ్ణి శిబిరం వెలుపలికి తీసుకుపోయి రాళ్ళు రువ్వి చంపారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇస్రాయేల్ ప్రజలు చేశారు.

లేవీయకాండం (యాజి ధర్మవిధులు) — Chapters