[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[2] “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – నేను యెహోవాను, మీ దేవుణ్ణి.
[3] పూర్వం మీరు కాపురమున్న ఈజిప్ట్ దేశం వాళ్ళలాగా మీరు ప్రవర్తించకూడదు. నేను మిమ్ములను తీసుకుపోతున్న కనానుదేశం వాళ్ళలాగా కూడా మీరు మెలగకూడదు. వాళ్ళ ఆచారాలను అనుసరించి నడుచు కోకూడదు.
[4] నా న్యాయనిర్ణయాల ప్రకారం, మీరు ప్రవర్తిస్తూ ఉండాలి. నా చట్టాలలో నడుచుకొంటూ ఉండాలి. నేను యెహోవాను. మీ దేవుణ్ణి.
[5] కనుక మీరు నా చట్టాలను, నా న్యాయనిర్ణయాలను పాటించాలి. వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండేవాడు వాటివల్ల బ్రతుకుతాడు. నేను యెహోవాను.
[6] “నేను యెహోవాను. మీలో ఎవరూ తన రక్తసంబంధులను సమీపించి వారిని నగ్న శరీరులుగా చేయకూడదు.
[7] “మీ తండ్రిని నగ్న శరీరిగా చేయకూడదు. మీ తల్లిని నగ్న శరీరిగా చేయకూడదు. ఆమె మీ తల్లి. ఆమెను నగ్న శరీరిగా చేయకూడదు.
[8] “మీ తండ్రి భార్యను నగ్న శరీరిగా చేయకూడదు. ఆమెది మీ తండ్రి నగ్నతే.
[9] “మీ సోదరిని నగ్న శరీరిగా చేయకూడదు. ఆమె మీ తండ్రి కూతురు కానియ్యి, మీ తల్లి కూతురు కానియ్యి; ఆమె ఇంట్లో పుట్టినా, వేరే స్థలంలో పుట్టినా ఆమెను నగ్న శరీరిగా చేయకూడదు.
[10] “మీ కొడుకు కూతురును, మీ కూతురి కూతురును నగ్నశరీరిగా చెయ్యకూడదు. వారి నగ్నత మీదే.
[11] “మీ తండ్రి భార్య కూతురు మీ తండ్రికి పుట్టింది. ఆమె మీ సోదరి. ఆమెను నగ్న శరీరిగా చెయ్యకూడదు.
[12] “మీ తండ్రి సోదరిని నగ్నశరీరిగా చెయ్యకూడదు. ఆమె మీ తండ్రికి రక్తసంబంధి.
[13] “మీ తల్లి సోదరిని నగ్నశరీరిగా చెయ్యకూడదు. ఆమె మీ తల్లికి సమీపబంధువు.
[14] “మీ తండ్రి తోడబుట్టినవాణ్ణి నగ్నశరీరిగా చెయ్యకూడదు – అంటే అతడి భార్యను ముట్టడానికి సమీపించకూడదు. ఆమె మీ పినతల్లి.
[15] “మీ కోడలును నగ్నశరీరిగా చెయ్యకూడదు. ఆమె మీ కొడుకు భార్య. ఆమెను నగ్నశరీరిగా చెయ్యకూడదు.
[16] “మీ తోడబుట్టినవాడి భార్యను నగ్నశరీరిగా చెయ్యకూడదు. ఆమెది అతడి నగ్నతే.
[17] “ఒక స్త్రీనీ ఆమె కూతురునూ నగ్నశరీరులుగా చెయ్యకూడదు. ఆమె కొడుకు కూతురును గానీ, ఆమె కూతురు కూతురును గానీ నగ్న శరీరిగా చేయడానికి వారిని చేర్చు కోకూడదు. అలా చేయడం అవినీతి. వారు సమీప బంధువులు.
[18] “మీ భార్య బ్రతికి ఉండగానే ఆమె సోదరిని నగ్న శరీరిగా చేయడానికి సవతిగా చేర్చుకోకూడదు.
[19] “అశుద్ధత వల్ల స్త్రీ కడగా ఉంటే ఆమెను నగ్న శరీరిగా చేయడానికి ఆమెను సమీపించకూడదు.
[20] “మీ పొరుగువాడి భార్యతో శయనించకూడదు. అలా చేస్తే మీరు అశుద్ధులవుతారు.
[21] “మీ సంతానంలో ఎవరినీ మోలెక్‌దేవుడికి అర్పించ కూడదు. ఆ విధంగా మీ దేవుని పేరుకు అపకీర్తి కలిగించ కూడదు, నేను యెహోవాను.
[22] “స్త్రీతో శయనించినట్టు పురుషుడితో శయనించకూడదు. అది అసహ్యం.
[23] “ఏ జంతువుతో సంపర్కం చేయకూడదు. దానివల్ల మీరు అశుద్ధులవుతారు. జంతువు స్త్రీని పొందేందుకు ఆమె దాని ఎదుట నిలబడకూడదు. అలా చెయ్యడం అసహ్యం.
[24] “ఈ కార్యాలలో దేనివల్లా అశుద్ధులు కాకూడదు. నేను మీ ఎదుట నుంచి వెళ్ళగొట్టబోయే జనాలు ఇవన్నీ చేసి అశుద్ధులయ్యారు.
[25] ఆ దేశం అశుద్ధమైపోయింది, గనుక దానికి సరిపోయిన శిక్షను నేను దానిమీదికి రప్పిస్తున్నాను. దాని నివాసులు అది వెళ్ళగ్రక్కివేస్తున్నది.
[26] అందుచేత మీరు నా చట్టాలను, నా న్యాయనిర్ణయాలను పాటిస్తూ ఆ అసహ్య కార్యాలలో దేనినీ చెయ్యకూడదు. స్వదేశీయుడు గానీ, మీలో ఉంటున్న విదేశీయుడు గానీ వాటిని చెయ్యకూడదు.
[27] ఆ దేశం మీవల్ల అశుద్ధమై మీకు పూర్వమున్న ప్రజలు వెళ్ళగ్రక్కివేస్తున్నట్టు మిమ్ములను కూడా వెళ్ళగ్రక్కివేయకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి.
[28] మీకు పూర్వమున్న ఆ దేశనివాసులు ఈ అసహ్య కార్యాలన్నీ చేయడం వల్ల ఆ దేశం అశుద్ధమైపోయింది.
[29] మీలో ఎవరైనా అలాంటి అసహ్య కార్యాలలో దేనినైనా చేస్తే వారిని ప్రజలలో లేకుండా చేయాలి.
[30] గనుక మీరు వచ్చేముందు ఆ దేశస్తులు చేసిన ఈ అసహ్యమైన వాడుకలను అనుసరించకుండా, వాటివల్ల అశుద్ధులు కాకుండేలా మీరు నా ఆజ్ఞలు శిరసావహించాలి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.”