[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, “అహరోను కొడుకులైన యాజులతో ఈ విధంగా చెప్పు – మీ ప్రజలలో చనిపోయినవారి శవాన్ని తాకి మీలో ఎవరూ తనను అశుద్ధం చేసుకోకూడదు.
[2] అయితే తన రక్తసంబంధులలో ఎవరైనా చనిపోతే – తన తల్లి గానీ, తండ్రి గానీ, కొడుకు గానీ, కూతురు గానీ, తోబుట్టినవాడు గానీ,
[3] పెళ్ళికాని కన్య అయి తన దగ్గర ఉన్న సోదరి గానీ చనిపోతే – వారి శవాన్ని తాకడం వల్ల తనను అశుద్ధం చేసుకోవచ్చు.
[4] యాజి తన ప్రజలలో ప్రముఖుడు గనుక అతడు లౌకికుడుగా ప్రవర్తించకూడదు. అలా తనను అశుద్ధం చేసుకోకూడదు.
[5] “యాజులు తమ తలలు బోడి చేసుకోరాదు. గడ్డం ప్రక్కలను క్షౌవరం చేసుకోకూడదు. శరీరంలో గాయాలు చేసుకోకూడదు.
[6] “వారు తమ దేవునికి పవిత్రులుగా ఉండాలి. తమ దేవుని పేరుకు అపకీర్తి కలిగించకూడదు. వారు తమ దేవునికి చెందిన ఆహారాన్ని, అంటే, యెహోవాకు చెందిన హోమబలులు అర్పిస్తారు గదా! కనుక వారు పవిత్రంగా ఉండాలి.
[7] “వారు వేశ్యను గానీ, భ్రష్ట స్త్రీని గానీ పెళ్ళి చేసుకోకూడదు. ఎందుకంటే యాజులు తమ దేవునికి ప్రత్యేకమైనవారు.
[8] “మీ దేవునికి చెందిన ఆహారాన్ని వారు అర్పిస్తారు, గనుక వారు పవిత్రులని మీరు భావించాలి. నేను యెహోవాను. నేను పవిత్రుణ్ణి, మిమ్ములను పవిత్రం చేసేవాణ్ణి, గనుక వారు మీ దృష్టిలో పవిత్రులుగా ఉండాలి.
[9] యాజులలో ఎవరి కూతురైనా వ్యభిచారం చెయ్యడం వల్ల తనను అపవిత్రం చేసుకొంటే, ఆమె తన తండ్రిని అపవిత్రం చేసినట్టే. ఆమెను మంటల్లో వేసి కాల్చివేయాలి.
[10] “సాటి యాజులలో ప్రముఖయాజి కావడానికి తన తలమీద తైలాభిషేకం పొందినవాడు, యాజి విశేష వస్త్రాలు ధరించుకోవడానికి ప్రతిష్ఠించబడ్డ ఆ వ్యక్తి, తన తల విరబోసుకోకూడదు. తాను వేసుకొన్న బట్టలను చింపుకో కూడదు.
[11] అతడు ఎవరి శవం దగ్గరికీ వెళ్ళకూడదు. తండ్రి శవం వల్ల గానీ, తల్లి శవం వల్ల గానీ తనను అశుద్ధం చేసుకోకూడదు.
[12] అతడు తన దేవుని పవిత్ర నివాసాన్ని అపవిత్రం చెయ్యకుండేలా దాన్ని విడిచి వెళ్ళకూడదు. ఎందుకంటే, అతణ్ణి ప్రతిష్ఠించిన దేవుని అభిషేక తైలం అతడి మీద ఉంటుంది. నేను యెహోవాను.
[13] “యాజి కన్యనే వివాహమాడాలి.
[14] వితంతువును గానీ, విడిచిపెట్టబడ్డ స్త్రీని గానీ, భ్రష్ట స్త్రీని గానీ, వేశ్యను గానీ పెళ్ళి చేసుకోకూడదు; తన ప్రజలలో ఉన్న కన్యనే పెళ్ళి చేసుకోవాలి.
[15] నేను యెహోవాను, అతణ్ణి ప్రత్యేకించుకొన్న వాణ్ణి, గనుక అతడు తన ప్రజలలో తన సంతానాన్ని అపవిత్రపరచకూడదు.
[16] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[17] “నీవు అహరోనుతో ఈ విధంగా చెప్పు – తరతరాలకు నీ సంతానంలో ఎవడికైనా ఏదైనా లోపం ఉంటే, అతడు దేవునికి చెందిన ఆహారాన్ని అర్పించడానికి సమీపించకూడదు.
[18] లోపం ఉన్నవాడెవడైనా సరే సమీపించకూడదు. గుడ్డివాడు గానీ, కుంటివాడు గానీ, ముఖరూపం చెడినవాడు గానీ, వికలాంగుడు గానీ,
[19] కాలు విరిగినవాడు గానీ, చెయ్యి విరిగినవాడు గానీ,
[20] గూనివాడు గానీ, మరుగుజ్జువాడు గానీ, కంటిలో పువ్వుగలవాడు గానీ, గజ్జిగలవాడు గానీ, తామరగలవాడు గానీ, బీజం నలిగినవాడు గానీ సమీపించకూడదు.
[21] యాజి అయిన అహరోను సంతానంలో లోపం గల వాడెవ్వడూ యెహోవాకు హోమాలు అర్పించడానికి సమీపించకూడదు. అతడికి లోపం ఉంది, గనుక దేవునికి చెందిన ఆహారాన్ని అర్పించడానికి అతడు సమీపించకూడదు.
[22] దేవునికి చెందిన ఆహారాన్ని అతడు తినవచ్చు.
[23] అయినా, అతడు లోపం గలవాడుగా ఉండడం చేత అడ్డతెర దగ్గరికి చేరకూడదు, బలిపీఠాన్ని సమీపించకూడదు. నా పవిత్ర స్థలాలను అపవిత్రపరచకూడదు. నేనే వాటిని పవిత్రం చేసేవాణ్ణి. నేను యెహోవాను.”
[24] మోషే అహరోనుతో, అతడి కొడుకులతో ఇస్రాయేల్ ప్రజలందరితో ఈ సంగతులు చెప్పాడు.