[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[2] “నీవు అహరోనుతో, అతడి కొడుకులతో, ఇస్రాయేల్ ప్రజలందరితో ఈ విధంగా చెప్పు: ఇది యెహోవా ఆజ్ఞాపించిన విషయం –
[3] ఇస్రాయేల్ ప్రజల్లో ఎవరైనా ఎద్దును గానీ, గొర్రెను గానీ, మేకను గానీ యెహోవాకు బలిగా అర్పించాలనుకొంటే, ఆ వ్యక్తి దాన్ని యెహోవా నివాసం ఎదుటికి సన్నిధిగుడారం ద్వారానికి తేవాలి. ఒకవేళ అతడు శిబిరంలో గానీ, శిబిరం వెలుపల గానీ వేరే చోట దాన్ని వధిస్తే
[4] ఆ వ్యక్తిని తన ప్రజలలో లేకుండా చేయాలి. అతడు రక్తాన్ని చిందించినవాడు; రక్తం విషయంలో అతడు అపరాధి అని నిర్ణయించాలి.
[5] కారణ మేమిటంటే, ఇస్రాయేల్ ప్రజలు బయట వధిస్తున్న బలిపశువులను ఇకనుంచి బయట వధించకుండా యెహోవా దగ్గరకు తేవాలి. సన్నిధిగుడారం ద్వారానికి యాజిదగ్గరకి వాటిని తెచ్చి శాంతి బలులుగా యెహోవాకు సమర్పించాలి.
[6] యాజి సన్నిధిగుడారం ద్వారం దగ్గర ఉన్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తాన్ని చిలకరించాలి. యెహోవాకు పరిమళ అర్పణగా వాటి కొవ్వును కాల్చివేయాలి.
[7] ఇంతకుముందు ఇస్రాయేల్ ప్రజ వ్యభిచారిణిలాగా దయ్యాల వెంటబడుతూ వాటికి బలులు అర్పిస్తూ ఉన్నారు. ఇక నుంచి వారు అలా చెయ్యకూడదు. ఇది తరతరాలకు వారికి ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం.
[8] అందుచేత నీవు వారితో ఇలా చెప్పాలి – ఇస్రాయేల్ ప్రజల్లో, వారి మధ్య ఉన్న పరదేశుల్లో ఎవరైనా హోమబలిని గానీ, వేరే బలిని గానీ, యెహోవాకు అర్పించడానికి సన్నిధిగుడారం ద్వారానికి తీసుకురాకుండా,
[9] వేరే చోట అర్పిస్తే ఆ వ్యక్తిని తన ప్రజలలో లేకుండా చేయాలి.
[10] “అంతేగాక, ఇస్రాయేల్ ప్రజలలో గానీ, వారి మధ్య ఉంటున్న పరదేశులలో గానీ ఎవరైనా దేని రక్తాన్నైనా తింటే, రక్తాన్ని తిన్న ఆ వ్యక్తికి నా ముఖం విరోధంగా ఉంటుంది. నేను అతణ్ణి అతడి ప్రజలలో లేకుండా చేస్తాను.
[11] ఎందుకంటే శరీరానికి ప్రాణం రక్తంలో ఉన్నది. బలిపీఠం మీద మీ పాపాలను కప్పివేయడానికి దాన్ని మీకు నియమించాను. రక్తంలో ఉన్న ప్రాణం కారణంగా అది ప్రాయశ్చిత్తం చేస్తుంది.
[12] అందుచేత మీలో గానీ, మీ మధ్య ఉంటున్న పరదేశులలో గానీ ఎవ్వరూ రక్తాన్నీ తినకూడదని నేను ఇస్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించాను.
[13] “ఇస్రాయేల్ ప్రజల్లో, వారి మధ్య ఉంటున్న పరదేశుల్లో ఎవరైనా వేటకు వెళ్ళి తినతగ్గ జంతువును గానీ, పక్షిని గానీ పడితే అతడు దాని రక్తాన్ని పూర్తిగా ఒలికించాలి. రక్తాన్ని మట్టిలో కప్పివేయాలి.
[14] ఎందుకంటే, శరీరం ఉన్న ప్రతిదానికీ దాని రక్తమే ప్రాణాధారం. అందుచేత, మీరు ఏ ప్రాణి రక్తాన్నీ తినకూడదు. శరీరంతో ఉన్న ప్రతిదానికీ ప్రాణం దాని రక్తమే; రక్తాన్ని తినే వ్యక్తిని లేకుండా చేయాలని నేను ఇస్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించాను.
[15] “చచ్చిన జంతువును గానీ పక్షిని గానీ, మృగాలు చీల్చిన జంతువును గానీ పక్షిని గానీ ఎవరైనా తింటే ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని స్నానం చేయాలి. స్వదేశస్తుడు, విదేశస్తుడు కూడా అలా చెయ్యాలి. ఆ వ్యక్తి సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు. తరువాత శుద్ధం అవుతాడు.
[16] కాని, అతడు తన బట్టలు ఉతుక్కోకుండా స్నానం చేయకుండా ఉంటే అతడు తన అపరాధం భరించాలి.”