[1] “ఎవరైనా యెహోవాకు నైవేద్యాన్ని అర్పిస్తే అతడు గోధుమ పిండి అర్పించాలి. అతడు దానిమీద నూనె పోసి సాంబ్రాణి వేసి
[2] యాజులైన అహరోను కొడుకుల దగ్గరకి దాన్ని తేవాలి. దానిలో నుంచి యాజి పిడికెడు గోధుమపిండిని నూనెతోపాటు సాంబ్రాణి అంతా తీసుకొని స్మృతి చిహ్నంగా బలిపీఠంమీద దాన్ని కాల్చివేయాలి. అది మంటల్లో అర్పణ. అది యెహోవాకు పరిమళంగా ఉంటుంది.
[3] ఆ నైవేద్యంలో మిగిలినది అహరోనుకూ అతడి కొడుకులకూ ఉంటుంది. యెహోవాకు అర్పించే హోమాలలో అది అతి పవిత్రం.
[4] “మీరు పొయ్యిలో కాల్చిన నైవేద్యాన్ని అర్పించదలిస్తే పొంగజేసే పదార్థం లేకుండా మెత్తని గోధుమపిండిలో నూనె కలిపి అప్పడాలు చేసి అర్పించాలి. లేకపోతే పొంగజేసే పదార్థం లేకుండా వాటిని చేసి వాటిమీద నూనె పోయాలి.
[5] మీ అర్పణ పెనంమీద కాల్చిన నైవేద్యమైతే పొంగజేసే పదార్థం లేకుండా మెత్తని గోధుమపిండిలో నూనె కలిపి చెయ్యాలి.
[6] అది నైవేద్యం గనుక నీవు దాన్ని ముక్కలుగా చేసి వాటిమీద నూనె పోయాలి.
[7] “మీ అర్పణ కుండలో వండిన నైవేద్యమైతే మెత్తని గోధుమ పిండిలో నూనె కలిపి చెయ్యాలి.
[8] వాటితో చేసిన నైవేద్యాన్ని యెహోవా దగ్గరకి తేవాలి. యాజికి దాన్ని అప్పగించిన తరువాత అతడు దాన్ని బలిపీఠం దగ్గరికి తేవాలి.
[9] యాజి ఆ నైవేద్యంలో కొంత తీసి స్మృతి చిహ్నంగా బలిపీఠంమీద కాల్చివెయ్యాలి. అది మంటల్లో అర్పణ. అది యెహోవాకు పరిమళంగా ఉంటుంది.
[10] ఆ నైవేద్యంలో మిగిలినది అహరోనుకూ అతడి కొడుకులకూ ఉంటుంది. యెహోవాకు అర్పించే హోమాలలో అది అతి పవిత్రం.
[11] “మీరు యెహోవాకు చేసే ఏ నైవేద్యాన్నీ పొంగజేసే పదార్థంతో చెయ్యకూడదు. పొంగజేసే పదార్థాన్నీ తేనెనూ ఏ అర్పణతోను యెహోవాకు హోమంగా కాల్చివెయ్యకూడదు.
[12] వాటిని ప్రథమ ఫలంగా యెహోవాకు అర్పించవచ్చు గాని, అవి బలిపీఠం మీద పరిమళ హోమం కాకూడదు.
[13] మీరు చేసే ప్రతి నైవేద్యానికీ ఉప్పు చేర్చాలి. మీ దేవుని ఒడంబడిక ఉప్పు మీ నైవేద్యాలతో తప్పక ఉండాలి. అన్ని అర్పణలతో ఉప్పు కూడా అర్పించాలి.
[14] “మీరు యెహోవాకు మొదటి పంట నైవేద్యం చేయదలిస్తే కాల్చిన కొత్త మొక్కజొన్న కంకులను గానీ కొత్త మొక్కజొన్న పిండిని గానీ తీసుకురావాలి.
[15] దానిమీద నూనె పోయాలి, సాంబ్రాణి వెయ్యాలి. అది నైవేద్యం గదా.
[16] స్మృతి చిహ్నంగా ఆ పిండిలో కొంత దాని నూనెతోపాటు సాంబ్రాణి అంతా తీసుకొని యాజి కాల్చివెయ్యాలి. అది యెహోవాకు హోమం.