[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[2] “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – యెహోవా నియమించిన కాలాలు మీరు పవిత్ర సభలుగా చాటించాలి. నా నియామక కాలాలు ఇవే:
[3] వారంలో పని చేయడానికి ఆరు రోజులున్నాయి. ఏడో రోజు విశ్రాంతి దినం, పవిత్ర సభదినం. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీరెక్కడ నివాసం చేసినా ఆ రోజు యెహోవాకు చెందిన విశ్రాంతి దినం.
[4] “యెహోవా నియమించిన కాలాలు ఇవి: మీరు వాటి నియామక కాలాలలో పవిత్ర సభలుగా చాటించవలసినవి ఇవి:
[5] మొదటి నెల పద్నాలుగో రోజు సాయంకాలాన యెహోవా పస్కా పండుగ ఆరంభం అవుతుంది.
[6] “ఆ నెల పదిహేనో రోజు యెహోవాకు పొంగని రొట్టె పండుగ ఆరంభం అవుతుంది. అప్పుడు మీరు ఏడు రోజులు పొంగజేసే పదార్థం కలపని రొట్టెలు తినాలి.
[7] మొదటి రోజున మీరు పవిత్ర సభగా సమకూడాలి. ఆరోజున మీ బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు.
[8] ఏడు రోజులు మీరు యెహోవాకు హోమాలు చెయ్యాలి. ఏడో రోజున కూడా మీరు పవిత్రసభగా సమకూడాలి. ఆ రోజున మీ బ్రతుకుదెరువుకోసం ఏ పనీ చెయ్యకూడదు.”
[9] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు:
[10] “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – నేను మీకిచ్చే దేశానికి మీరు చేరి దాని పంట కోసేటప్పుడు ఆ మొదటి పంటలో ఒక కట్టను యాజి దగ్గరికి తేవాలి.
[11] యెహోవా మిమ్ములను అంగీకరించేలా అతడు యెహోవా సన్నిధానంలో ఆ కట్టను అటూ ఇటూ కదల్చాలి. విశ్రాంతి దినానికి మరుసటి రోజున యాజి దానిని అలా కదల్చాలి.
[12] మీరు ఆ కట్టను అర్పించేరోజున లోపం లేని ఏడాది పొట్టేలును యెహోవాకు హోమబలిగా అర్పించాలి.
[13] దానితో అర్పించవలసిన నైవేద్యం రెండు కిలోగ్రాముల మెత్తని గోధుమపిండి, దానితో నూనె కలపాలి. దాన్ని యెహోవాకు పరిమళ హోమంగా అర్పించాలి. దానితో అర్పించవలసిన పానార్పణం ఒక లీటరు ద్రాక్షరసం.
[14] ఆ రోజు వరకు, అంటే మీరు మీ దేవునికి ఇలా అర్పణ తెచ్చేవరకు ఆ మొదటి కంకులు గానీ, రొట్టెలు గానీ, పేలాలు గానీ తినకూడదు. మీరు ఎక్కడ నివాసం చేసినా మీ తరతరాలకు ఇది ఎప్పటికీ నిలిచివుండే చట్టం.
[15] “విశ్రాంతి దినానికి మరుసటి రోజు మొదలుకొని కదల్చడానికి ఆ కట్టను మీరు తెచ్చిన రోజు మొదలుకొని ఏడు వారాలు లెక్కించాలి.
[16] ఏడో విశ్రాంతిదినానికి తరువాతి రోజు వరకు మీరు యాభై రోజులు లెక్కించి యెహోవాకు కొత్త నైవేద్యం అర్పించాలి.
[17] మీరు మీ ఇండ్లలోనుంచి రెండు కిలో గ్రాముల పిండితో చేసిన రెండు రొట్టెలు కదల్చే నైవేద్యంగా తేవాలి. గోధుమ పిండిలో పొంగజేసే పదార్థం వేసి వాటిని కాల్చాలి. అని యెహోవాకు ప్రథమ ఫలాల నైవేద్యం.
[18] ఆ రొట్టెలతో కూడా లోపం లేని ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలనూ, ఒక కోడెనూ, రెండు పొట్టేళ్ళనూ అర్పించాలి. అవి యెహోవాకు హోమబలులు; నైవేద్యాలతో, వాటి పానార్పణలతోపాటు యెహోవాకు పరిమళ హోమం.
[19] అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాపాలకోసం బలిగా, రెండు ఏడాది మగ గొర్రెపిల్లలను శాంతిబలిగా అర్పించాలి.
[20] యాజి ప్రధమ ఫలాల రొట్టెలతోపాటు ఆ రెండు గొర్రెపిల్లలనూ యెహోవా సన్నిధానంలో కదల్చాలి. అవి యెహోవాకు పవిత్రమైనవి. అవి యాజివి అవుతాయి.
[21] ఆ రోజే ప్రజలు పవిత్ర సభగా సమకూడాలని చాటించాలి, ఆ రోజున మీరు బ్రతుకు దెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు. మీరు ఎక్కడ నివాసం చేసినా మీ తరతరాలకూ ఇది ఎప్పటికీ నిలిచివుండే చట్టం.
[22] “మీరు మీ పొలం పంట కోసేటప్పుడు పొలం ఓరలను పూర్తిగా కోయకూడదు; కోతలో పరిగె ఏరుకోకూడదు. బీదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.”
[23] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[24] “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – ఏడో నెల మొదటి రోజు మీకు విశ్రాంతిదినం. అది బూరలూదే జ్ఞాపకార్థ దినం. పవిత్ర సభగా సమకూడే రోజు. పొట్టేలు కొమ్ము బూరలు ఊది ఆ రోజును చాటించాలి.
[25] ఆ రోజున మీరు బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చేయకూడదు గాని, యెహోవాకు హోమం చెయ్యాలి.”
[26] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[27] “ఈ ఏడో నెల పదో రోజు పాపాలకోసం ప్రాయశ్చిత్త దినం. ఆ రోజున మీరు పవిత్ర సభగా సమకూడాలి. మీరు మిమ్ములను అదుపు చేసుకోవాలి. యెహోవాకు హోమం చెయ్యాలి.
[28] ఆ రోజున ఎలాంటి పనీ చెయ్యకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో మీ పాపాలు కప్పివేయడం జరిగే ప్రాయశ్చిత్త దినం అది.
[29] ఆ రోజు తనను అదుపు చేసుకోని ప్రతివాణ్ణీ ప్రజలలో లేకుండా చేయాలి.
[30] ఆ రోజున ఎలాంటి పనైనా చేసిన ప్రతివాణ్ణీ ప్రజలలో లేకుండా నేనే నాశనం చేస్తాను.
[31] ఆ రోజున మీరు ఎలాంటి పనీ చెయ్యకూడదు. మీరు ఎక్కడ నివాసం చేసినా మీ తరతరాలకూ ఎప్పటికీ నిలిచివుండే చట్టమిది.
[32] అది మీకు మహా విశ్రాంతిదినం. అప్పుడు మిమ్ములను అదుపు చేసుకోవాలి. ఆ నెల తొమ్మిదో రోజు సాయంకాలం నుంచి మరుసటి రోజు సాయంకాలం వరకు మీరు దానిని విశ్రాంతిదినంగా ఆచరించాలి.”
[33] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[34] “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు– ఏడో నెల పదిహేనో రోజు పర్ణశాలల పండుగ ఆరంభం. యెహోవాకు ఏడు రోజులు దానిని ఆచరించాలి.
[35] మొదటి రోజున పవిత్ర సభగా సమకూడాలి. ఆ రోజున మీరు బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు.
[36] ఆ ఏడు రోజులు మీరు యెహోవాకు హోమాలు చెయ్యాలి. ఎనిమిదో రోజున మీరు పవిత్ర సభగా సమకూడి యెహోవాకు హోమం చెయ్యాలి. అది పండుగ ముగింపు రోజు, అందులో మీరు బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు.
[37] “ఇవి యెహోవా నియమించిన కాలాలు. యెహోవా నియమించిన విశ్రాంతి దినాలు కాకుండా, యెహోవాకు మీరు ఇచ్చే కానుకలూ మొక్కుబళ్ళూ స్వేచ్ఛార్పణలూ కాకుండా, ఈ నియామక కాలాలలో కూడ అర్పణలు తేవాలి.
[38] పవిత్ర సభగా సమకూడవలసిన రోజులుగా వాటిని చాటించాలి. ఆ రోజులలో యెహోవాకు హోమాలను, నైవేద్యాలను, బలులను, పానార్పణలను సమర్పించాలి. ఏ రోజు అర్పణ ఆ రోజున తీసుకురావాలి.
[39] “ఏడో నెల పదిహేనో రోజు నుంచి – మీరు పొలం పంట కూర్చుకొన్నప్పుడు – యెహోవాకు ఏడు రోజుల పండుగ ఆచరించాలి. మొదటి రోజు విశ్రాంతిదినం, ఎనిమిదో రోజు విశ్రాంతిదినం.
[40] మొదటి రోజున మీరు దబ్బ పండ్లను, ఈతమట్టలను, ఆకులతో నిండి ఉన్న గొంజి చెట్ల కొమ్మలను, కాలువల దగ్గర పెరిగే నిరవంజి చెట్లను తీసుకురావాలి. ఏడు రోజులు మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో సంతోషించాలి.
[41] ఈ విధంగా మీరు ఏటేటా యెహోవాకు ఈ పండుగ ఏడు రోజులుగా ఆచరించాలి. మీ తరతరాలకు ఎప్పటికీ నిలిచివుండే చట్టమిది. ఈ పండుగ ఏడో నెలలో ఆచరించవలసినది.
[42] అప్పుడు మీరు పర్ణశాలలలో ఉండాలి. నేను ఇస్రాయేల్ ప్రజలను ఈజిప్ట్‌దేశంనుంచి తీసుకు వచ్చినప్పుడు వారు పర్ణశాలలలో నివసించేలా చేశాను.
[43] మీ తరతరాలవారు ఈ సంగతి తెలుసుకొనేలా ఇస్రాయేల్ దేశస్తులందరూ ఆ ఏడు రోజులు పర్ణశాలలలో ఉండిపోవాలి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి”.
[44] అప్పుడు మోషే ఇస్రాయేల్‌ప్రజలకు యెహోవా నియామక కాలాలు వివరించి చెప్పాడు.