Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,

[2] “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – ఇస్రాయేల్ ప్రజలలో గానీ, ఇస్రాయేల్‌దేశంలో నివసించే విదేశీయులలో గానీ ఎవరైనా తమ సంతానంలో ఎవరినైనా మోలెక్‌దేవుడికి అర్పిస్తే వారిని చంపితీరాలి. మీ దేశ ప్రజలు వాళ్ళను రాళ్ళతో కొట్టాలి.

[3] అలాంటి వ్యక్తి తన సంతానాన్ని మోలెక్‌దేవుడికి ఇచ్చి, నా పవిత్రాలయాన్ని అశుద్ధం చేశాడు, నా పవిత్రమైన పేరును దూషణకు గురి చేశాడు గనుక నేను ఆ వ్యక్తికి విరోధినై వాణ్ణి ప్రజలలో లేకుండా చేస్తాను.

[4] ఆ మనిషి తన సంతానాన్ని మోలెక్‌కు ఇచ్చినప్పుడు మీ దేశప్రజలు నిర్లక్ష్యంగా ఉండి, వాణ్ణి చంపకపోతే,

[5] నేను ఆ మనిషికీ వాడి కుటుంబంవాళ్ళకూ విరోధినై వాణ్ణి ప్రజలలో లేకుండా చేస్తాను. అంతే కాక, వాణ్ణి అనుసరించి మోలెక్‌దేవుడితో వ్యభిచారిణిలాగా ప్రవర్తించిన వాళ్ళందరినీ కూడా ప్రజల్లో లేకుండా చేస్తాను.

[6] “ఆ విధంగా, పూనకం వచ్చినవాళ్ళవైపు, సోదె చెప్పేవాళ్ళ వైపు తిరిగి, వాళ్ళను అనుసరించే వ్యక్తికి కూడా నేను విరోధినై అతణ్ణి ప్రజలలో లేకుండా చేస్తాను.

[7] “నేను యెహోవాను, మీ దేవుణ్ణి, గనుక మిమ్ములను మీరు పవిత్రపరచుకొని పవిత్రులై ఉండాలి.

[8] నా చట్టాలను పాటించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి. నేను మిమ్ములను పవిత్రపరచే యెహోవాను.

[9] “ఎవరైనా తన తండ్రినయినా తల్లినయినా దూషిస్తే వారిని చంపితీరాలి. వారు తమ తండ్రినో తల్లినో దూషించినందుచేత తమ మరణానికి వారే బాధ్యులు.

[10] “మరో మనిషి భార్యతో ఎవరైనా వ్యభిచారం చేస్తే, పొరుగువాడి భార్యతో వ్యభిచారం చేసిన ఆ వ్యక్తినీ ఆ వ్యభిచారిణినీ చంపితీరాలి.

[11] “ఎవడైనా తన తండ్రి భార్యతో పోతే అది తన తండ్రిని నగ్న శరీరిగా చేసినట్టే. అలా చేసిన ఆ ఇద్దరినీ చంపితీరాలి. వాళ్ళ చావుకు వాళ్ళే బాధ్యులు.

[12] “ఎవడైనా తన కోడలితో పోతే వాళ్ళిద్దరినీ చంపితీరాలి. వాళ్ళు వరుసలు తప్పి పాపం చేశారు. వాళ్ళ చావుకు వాళ్ళే బాధ్యులు.

[13] “పురుషుడు స్త్రీతో పోయినట్టు పురుషుడితో పోతే వాళ్ళిద్దరూ చేసినది చాలా అసహ్య కార్యం. వాళ్ళను చంపితీరాలి. వాళ్ళ చావుకు వాళ్ళే బాధ్యులు.

[14] “ఎవడైనా ఒకామెను, ఆమె తల్లిని పెళ్ళి చేసుకొంటే అది దుర్మార్గం. మీ మధ్య దుర్మార్గం ఉండకుండేలా ఆ ముగ్గురినీ మంటల్లో వేసి కాల్చివేయాలి.

[15] “పురుషుడు జంతువుతో సంపర్కం చేస్తే వాణ్ణి చంపితీరాలి. జంతువును కూడా చంపితీరాలి.

[16] స్త్రీ తనను జంతువు పొందేలా దాని దగ్గరికి పోతే ఆమెనూ ఆ జంతువునూ చంపితీరాలి. ఆమె, అది తప్పక చావాలి. తమ చావుకు బాధ్యత తమదే.

[17] “ఒకడు తన తోబుట్టువును – ఆమె పినతండ్రి కూతురు కానియ్యి, తన తల్లి కూతురు కానియ్యి – చేర్చుకొని ఆమె దిసమొలను చూస్తే, అతడి దిసమొలను ఆమె చూస్తే అది సిగ్గుచేటు. వాళ్ళ ప్రజల కళ్ళెదుటే వాళ్ళను ప్రజల్లో లేకుండా చేయాలి. వాడు తన తోబుట్టువును నగ్న శరీరిగా చేశాడు. వాడు తన అపరాధం భరించాలి.

[18] “ఎవరైనా కడగా ఉన్న ఆమెతో పోయి ఆమెను నగ్న శరీరిగా చేస్తే అతడు ఆమె రక్తధారను దిగంబరం చేశాడు, ఆమె తన రక్తధారను దిగంబరం చేసింది. వాళ్ళిద్దరినీ తమ ప్రజలలో లేకుండా చేయాలి.

[19] “నీ తల్లి తోబుట్టువును గానీ, నీ తండ్రి తోబుట్టువును గానీ నగ్న శరీరిగా చెయ్యకూడదు. అలా చేసినవాడు తన సమీప బంధువురాలిని నగ్నశరీరిగా చేశాడు. వాళ్ళు తమ అపరాధం భరించాలి.

[20] “తన పినతండ్రి భార్యతో గానీ, మేనమామ భార్యతో గానీ ఎవరైనా పోతే అది అతణ్ణి నగ్నశరీరిగా చేసినట్టే. అలా చేసిన ఆ స్త్రీ పురుషులు తమ అపరాధం భరించాలి. వాళ్ళకు సంతానం ఎన్నడూ కలగదు.

[21] “ఎవరైనా తన తోబుట్టినవాడి భార్యను చేర్చుకొంటే అది అసహ్యం. అది తోబుట్టినవాణ్ణి నగ్నశరీరిగా చేసినట్టే. వాళ్ళకు ఎన్నడూ సంతానం కలగదు.

[22] “కాబట్టి, మీరు నా చట్టాలన్నీ, నా న్యాయనిర్ణయాలన్నీ పాటించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి. అలాంటప్పుడు మీరు నివసించడానికి నేను మిమ్ములను తీసుకుపోతున్న దేశం మిమ్ములను వెళ్ళగక్కివేయదు.

[23] నేను మీ ఎదుటనుంచి వెళ్ళగొట్టే ప్రజల వాడుకల ప్రకారం మెలగకూడదు. పై చెప్పినవాటిని వాళ్ళు జరిగించారు గనుక వాళ్ళంటే నాకు అసహ్యం.

[24] మీరు వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు. అది పాలు తేనెలు నదులై పారుతున్న దేశం. ఆ దేశం మీది అయ్యేలా దాన్ని మీకిచ్చానని మీతో చెప్పాను గదా! నేను యెహోవాను; ఇతర ప్రజలలోనుంచి మిమ్ములను ప్రత్యేకించుకొన్న మీ దేవుణ్ణి.

[25] “అందుచేత మీరు శుద్ధ జంతువులను అశుద్ధ జంతువులనుంచీ, శుద్ధ పక్షులను అశుద్ధ పక్షులనుంచీ ప్రత్యేకించాలి. అశుద్ధమని నేను మీకు వేరు చేసిన ఏ జంతువువల్ల గానీ, ఏ పక్షివల్ల గానీ, నేల మీద తిరిగే ఏ ప్రాణివల్ల గానీ మిమ్ములను అసహ్యం చేసుకోకూడదు.

[26] నేను యెహోవాను; నేను పవిత్రుణ్ణి; మీరు నావారు కావాలని ఇతర ప్రజలనుంచి మిమ్ములను ప్రత్యేకించుకొన్నాను; గనుక మీరు నాకు పవిత్రప్రజగా ఉండాలి.

[27] “పురుషుడు గానీ, స్త్రీ గానీ పూనకం వచ్చి పలికితే సోదె చెపితే వాళ్ళను చంపితీరాలి. వాళ్ళను రాళ్ళతో కొట్టాలి. వాళ్ళ చావుకు వాళ్ళే బాధ్యులు.”

లేవీయకాండం (యాజి ధర్మవిధులు) — Chapters