[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[2] “చర్మవ్యాధి గల మనిషి శుద్ధంగా ఉన్నాడు అని నిర్ణయించిన రోజు అతణ్ణి గురించిన చట్టమిదే – అతణ్ణి యాజి దగ్గరికి తీసుకురావాలి.
[3] యాజి శిబిరం బయటకి వెళ్ళి అతణ్ణి చూడాలి. ఒకవేళ చర్మవ్యాధి గలవాడికి వ్యాధి పూర్తిగా నయం అయిందనుకోండి.
[4] అలాంటప్పుడు అతణ్ణి శుద్ధం చేయడానికి యాజి ప్రాణంతో ఉన్న రెండు శుద్ధ పక్షులనూ దేవదారు కర్రనూ ఎర్రని నూలునూ హిస్సోపుచెట్టు రెమ్మనూ తెమ్మని ఆజ్ఞాపించాలి. ఇవి చర్మవ్యాధి గలవాణ్ణి శుద్ధపరచడంకోసం.
[5] యాజి ఆ పక్షులలో ఒకదానిని చంపమని ఆజ్ఞాపించాలి. దాన్ని పారుతున్న నీళ్ళ పైగా, మట్టి పాత్రలో చంపాలి.
[6] తరువాత యాజి ప్రాణంతో ఉన్న పక్షిని చేతపట్టుకొని పారుతున్న నీళ్ళ పైగా చంపిన ఆ పక్షి రక్తంలో ముంచాలి. దేవదారు కర్రనూ, ఎర్రని నూలునూ, హిస్సోపు రెమ్మనూ కూడా ఆ రక్తంలో ముంచాలి.
[7] అప్పుడు యాజి శుద్ధపరచబొయ్యే వాడిమీద ఆ రక్తాన్ని ఏడుసార్లు చిలకరించి, అతడు శుద్ధంగా ఉన్నాడని నిర్ణయించి చెప్పాలి. ప్రాణంతో ఉన్న పక్షిని బయట మైదానంలో వదిలిపెట్టాలి.
[8] శుద్ధపరచబడేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వెంట్రుకలన్నీ క్షౌరం చేసుకొని నీళ్ళతో స్నానం చేయాలి. అప్పుడతడు శుద్ధంగా ఉంటాడు. ఆ తరువాత అతడు శిబిరంలోకి రావచ్చు గాని, తన గుడారం వెలుపలే ఏడు రోజులు ఉండిపోవాలి.
[9] ఏడో రోజున తన తలనూ గడ్డాన్నీ కనుబొమ్మలనూ వెంట్రుకలనూ క్షౌరం చేసుకోవాలి. తన బట్టలు ఉతుక్కొని నీళ్ళతో స్నానం చేయాలి. అప్పుడతడు శుద్ధంగా ఉంటాడు.
[10] “ఎనిమిదో రోజు అతడు లోపం లేని రెండు మగ గొర్రెపిల్లలనూ, లోపం లేని ఏడాది ఆడ గొర్రెపిల్లనూ యాజి దగ్గరకి తేవాలి. వాటితో నైవేద్యం కోసం నూనె కలిసిన, మూడు కిలోగ్రాముల గోధుమపిండినీ, అరలీటర్ నూనెనూ తేవాలి.
[11] శుద్ధి చేసే యాజి శుద్ధి కాబోయే ఆ వ్యక్తినీ, అతడు తెచ్చిన వాటినీ యెహోవా సన్నిధానంలో సన్నిధిగుడారం ద్వారం దగ్గర ఉంచాలి.
[12] అప్పుడు యాజి ఆ మగ గొర్రెపిల్లల్లో ఒకదానిని అపరాధ బలిగా అర్పించాలి. దానినీ ఆ అరలీటర్ నూనెనూ కదలిక అర్పణగా యెహోవా సన్నిధానంలో అటూ ఇటూ కదలించాలి.
[13] తరువాత ఆ మగ గొర్రెపిల్లను ఒక పవిత్ర స్థానంలో, పాపాలకోసమైన బలినీ, హోమాన్నీ చంపే చోట వధించాలి. ఎందుకంటే పాపాలకోసం బలిలాగే అపరాధ బలి యాజిది. అది అతి పవిత్రం.
[14] “అప్పుడు యాజి ఆ అపరాధబలి రక్తంలో కొంత తీసుకొని శుద్ధం కాబొయ్యే వాడి కుడి చెవి కొనమీదా, కుడి చేతి బొటనవ్రేలిమీదా, కుడి కాలి బొటన వ్రేలిమీదా దాన్ని పూయాలి.
[15] యాజి ఆ అర లీటర్ నూనెలో కొంత తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి.
[16] తన ఎడమ అరచేతిలో ఉన్న నూనెలో తన కుడి చేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధానంలో ఏడు సార్లు తన వ్రేలితో నూనె చిలకరించాలి.
[17] తన అరచేతిలో ఉన్న మిగతా నూనెలో కొంత శుద్ధి కాబొయ్యే వాడి కుడి చెవి కొనమీదా కుడి చేతి బొటన వ్రేలిమీదా కుడి కాలి బొటనవ్రేలిమీదా పూయాలి. వాటిమీద ఉన్న అపరాధ బలి రక్తం మీద పూయాలన్నమాట.
[18] యాజి తన చేతిలో ఉన్న మిగతా నూనె శుద్ధి కాబొయ్యే వాడి తలమీద పూయాలి. ఇలా యాజి యెహోవా సముఖంలో అతడికోసం ప్రాయశ్చిత్తం చేయాలి.
[19] అంతే కాక అశుద్ధతను పోగొట్టుకొని శుద్ధి కాబోయే వాడికోసం ప్రాయశ్చిత్తం చేయడానికి యాజి పాపాలకోసమైన బలిని సమర్పించాలి. తరువాత యాజి హోమ బలిని వధించాలి.
[20] హోమాన్నీ నైవేద్యాన్నీ బలిపీఠం మీద సమర్పించాలి. ఈ విధంగా యాజి ఆ వ్యక్తి కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, అతడు శుద్ధిగా ఉంటాడు.
[21] “ఒకవేళ ఆ వ్యక్తి బీదవాడై పై చెప్పినదంతా తేలేకపోతాడనుకోండి. అలాంటప్పుడు తన ప్రాయశ్చిత్తం కోసం యెహోవా సముఖంలో కదల్చడానికి అపరాధబలిగా ఒక మగగొర్రెపిల్లను తేవాలి. నూనెతో కలిసిన ఒక కిలోగ్రాం గోధుమ పిండినీ అర లీటర్ నూనెనూ కూడా తేవాలి.
[22] పైగా, అతడు కొనగల రెండు గువ్వలను గానీ, రెండు పావురం పిల్లలను గానీ తేవాలి. వాటిలో ఒకటి పాపాలకోసం బలిగా, ఒకటి హోమబలిగా ఉంటాయి.
[23] ఎనిమిదో రోజున అతడు తన శుద్ధికోసం వాటిని యెహోవా సన్నిధానానికి, సన్నిధిగుడారం ద్వారంలో యాజి దగ్గరకు తీసుకురావాలి.
[24] అప్పుడు యాజి అపరాధబలి కోసం ఆ గొర్రెపిల్లనూ, ఆ అర లీటరు నూనెనూ చేతపట్టుకొని వాటిని కదలిక అర్పణగా యెహోవా సముఖంలో అటూ ఇటూ కదల్చాలి.
[25] యాజి అపరాధబలి గొర్రెపిల్లను వధించాలి. ఆ బలిరక్తంలో కొంత తీసుకొని శుద్ధి కాబొయ్యేవాడి కుడి చెవి కొన మీదా, కుడి చేతి బొటనవ్రేలిమీదా దానిని పూయాలి.
[26] యాజి నూనెలో కొంత తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి.
[27] తన ఎడమ అర చేతిలో ఉన్న ఆ నూనెలో కొంత తన కుడి వ్రేలితో యెహోవా సన్నిధానంలో ఏడు సార్లు చిలకరించాలి.
[28] తన చేతిలో ఉన్న ఆ నూనెలో కొంత శుద్ధి కాబొయ్యేవాడి కుడి చెవి కొనమీదా, కుడి చేతి బొటనవ్రేలిమీదా, కుడి కాలి బొటనవ్రేలిమీదా పూయాలి. అపరాధ బలిపశువు రక్తం మీద పెట్టాలన్నమాట.
[29] తన చేతిలో మిగతా నూనె శుద్ధి కాబొయ్యేవాడి తలమీద పూసి యాజి యెహోవా సముఖంలో అతడికోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి.
[30] అప్పుడా వ్యక్తి కొనగల ఆ గువ్వల్లో గానీ పావురం పిల్లల్లో గానీ ఒకదానిని సమర్పించాలి.
[31] వాటిలో ఒకటి పాపాల కోసం బలిగా, ఇంకొకటి హోమబలిగా ఉంటాయి. వాటిని నైవేద్యంతో పాటు అర్పించాలి. ఈ విధంగా యాజి యెహోవా సన్నిధిలో శుద్ధం కాబొయ్యే వాడి పాపాలను కప్పివేస్తాడు.
[32] చర్మవ్యాధి పొడ కలిగి శుద్ధికోసం మామూలైనవాటిని కొనలేని వ్యక్తి విషయంలో అనుసరించవలసిన చట్టం ఇదే.”
[33] యెహోవా మోషే అహరోనులతో ఇంకా అన్నాడు,
[34] “వారసత్వంగా నేను మీకిచ్చే కనాను దేశంలోమీరు ప్రవేశించిన తరువాత ఆ మీ దేశంలోని ఏదో ఇంట బూజును నేను కలిగిస్తాననుకోండి.
[35] ఆ ఇంటి యాజమాని యాజి దగ్గరకు వచ్చి ‘నా ఇంట్లో బూజు నాకు కనిపించింద’ని అతడికి తెలపాలి.
[36] యాజి ఆ బూజు చూడడానికి వెళ్ళేముందు అతడు ఆ ఇంటిలోనుంచి వస్తువులన్నీ బయటికి తీసుకురావాలని ఆదేశించాలి. ఆ వస్తువులన్నీ అశుద్ధం కాకూడదని వారలా చెయ్యాలి. ఆ తరువాత ఇంటిని చూడడానికి యాజి లోపలికి వెళ్ళాలి.
[37] అతడా బూజును చూడాలి. ఒకవేళ ఆ ఇంటి గోడలలో ఉన్న బూజు పల్లపు చారలతో ఉంటుందనుకోండి. అవి కొంచెం పచ్చగా, లేక ఎర్రగా ఉండి గోడకంటే పల్లంగా కనిపిస్తాయనుకోండి.
[38] అలాంటప్పుడు యాజి ఇంట్లోనుంచి వాకిట్లోకి వచ్చి ఆ ఇల్లు ఏడు రోజులదాకా మూసివేయాలి.
[39] ఏడో రోజున యాజి మళ్ళీ వచ్చి ఇల్లు పరిశీలనగా చూడాలి. ఆ బూజు ఇంటి గోడలలో వ్యాపించి ఉంటే
[40] బూజు గల రాళ్ళు ఊడదీసి ఊరి వెలుపల ఉన్న అశుద్ధ స్థలంలో పారవెయ్యాలని యాజి ఆజ్ఞాపించాలి.
[41] అప్పుడు ఇంటి లోపల చుట్టు గోడలను గీకించాలి. గీకిన పెళ్ళలు ఊరి వెలుపల ఉన్న అశుద్ధస్థలంలో వారు పారవేయాలి.
[42] వేరే రాళ్ళు తీసుకువచ్చి ఊడదీసిన ఆ రాళ్ళకు బదులు ఉంచాలి. వేరే అడుసు తెప్పించి ఆ ఇంటి గోడలకు పూయాలి.
[43] “ఆ రాళ్ళు ఊడదీసి, ఇల్లు గీకి, దానికి కొత్తగా అడుసు పూసిన తరువాత ఆ బూజు తిరిగి ఆ ఇంట బయట పడుతుందనుకోండి.
[44] అలాంటప్పుడు యాజి వచ్చి దాన్ని చూడాలి. ఒకవేళ ఆ బూజు ఆ ఇంట్లో వ్యాపించి ఉంటే అది ఆ ఇంట్లో నాశనకరమైన బూజు, అది అశుద్ధం.
[45] కనుక అతడు ఆ ఇంటినీ, దాని రాళ్ళనూ, కర్రలనూ, అడుసునంతా పడగొట్టించాలి; అదంతా ఊరి వెలుపల ఉన్న అశుద్ధ స్థలానికి మోయించి పారవేయించాలి.
[46] ఆ ఇంటిని మూసివేసిన రోజుల్లో దానిలో ప్రవేశించిన వాడెవడైనా సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు.
[47] ఆ ఇంట ఎవరైనా పడుకొన్నా గానీ, భోజనం చేసినా గానీ ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి.
[48] “ఇంటికి అడుసు వేసిన తరువాత బూజు దానిలో వ్యాపించకపోతే యాజి లోపల ప్రవేశించి చూచి ఇల్లు శుద్ధమని నిర్ణయించి చెప్పాలి. ఎందుకంటే బూజు మళ్ళీ పట్టలేదు.
[49] అప్పుడు ఇంటిని శుద్ధి చేయడానికి అతడు రెండు పక్షులనూ దేవదారు కర్రనూ ఎర్రని నూలునూ హిస్సోపు రెమ్మనూ తెప్పించాలి.
[50] పక్షుల్లో ఒకదాన్ని పారుతున్న నీళ్ళపైగా మట్టి పాత్రలో వధించాలి.
[51] దేవదారు కర్రనూ, హిస్సోపు రెమ్మనూ, ఎర్రని నూలునూ, ప్రాణంతో ఉన్న పక్షినీ చేతపట్టుకొని వధించిన పక్షి రక్తంలోనూ పారుతున్న నీటిలోనూ వాటిని ముంచాలి. ఆ ఇంటిమీద ఏడు సార్లు రక్తాన్ని చిలకరించాలి.
[52] ఆ పక్షి రక్తంతో, పారుతున్న నీళ్ళతో, సజీవమైన పక్షితో, దేవదారు కర్రతో, హిస్సోపుతో, ఎర్రని నూలుతో ఆ ఇంటిని శుద్ధి చేయాలి.
[53] తరువాత ప్రాణంతో ఉన్న పక్షిని బయట మైదానంలో వదిలిపెట్టాలి. ఈ విధంగా ఇంటికోసం యాజి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అప్పుడు ఇల్లు శుద్ధంగా ఉంటుంది.
[54] “ప్రతి విధమైన చర్మరోగం గురించి, పక్కు గురించీ,
[55] వస్త్రంలో గానీ, ఇంట్లో గానీ ఉన్న బూజు గురించీ,
[56] వాపు, కురుపు, పక్కు, నిగనిగలాడే మచ్చ గురించీ ఇదే చట్టం.
[57] ఏది శుద్ధమో ఏది అశుద్ధమో తెలియజేసే విధానమిదే. చర్మవ్యాధి గురించిన చట్టమిదే.”