Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషేతోను అహరోనుతోను అన్నాడు,

[2] “మీరు ఇస్రాయేల్‌ప్రజతో ఈ విధంగా చెప్పండి – భూమిమీద ఉన్న జంతువులలో వీటిని మాత్రమే మీరు తినవచ్చు –

[3] జంతువులలో ఏవైతే చీలిన గిట్టలుండి నెమరువేస్తాయో వాటిని మీరు తినవచ్చు.

[4] కొన్ని జంతువులకు చీలిన గిట్టలున్నా అవి నెమరువేయవు. నెమరువేసినా చీలిన గిట్టలుండవు – అలాంటి వాటిని మీరు తినకూడదు. వీటిలో ఒంటె ఉంది. అది నెమరువేస్తుంది గానీ దానికి చీలిన గిట్టలు లేవు, గనుక అది మీకు అశుద్ధం.

[5] పొట్టి కుందేలు ఉంది. అది నెమరు వేస్తుంది గాని, దానికి చీలిన గిట్టలు లేవు, గనుక అది మీకు అశుద్ధం.

[6] కుందేలు కూడా ఉంది. అది నెమరువేస్తుంది గాని దానికి చీలిన గిట్టలు లేవు గనుక అది మీకు అశుద్ధం.

[7] పంది కూడా ఉంది. దానికి చీలిన గిట్టలు ఉన్నాయి గాని, అది నెమరు వేయదు గనుక అది మీకు అశుద్ధం.

[8] ఆ జంతువుల మాంసం మీరు తినకూడదు. వాటి పీనుగులను తాకకూడదు. అవి మీకు అశుద్ధం.

[9] “జలచరాలలో వీటిని తినవచ్చు – సముద్రంలో గానీ, నదులలో గానీ వేటికి రెక్కలు, పొలుసులు ఉంటాయో వాటిని తినవచ్చు.

[10] కాని, రెక్కలూ పొలుసులూ లేనివాటిని మీరు అసహ్యించుకోవాలి. అవి సముద్రంలో ఉన్నా నదులలో ఉన్నా సమస్త జల ప్రాణులలోను, నీళ్ళలో పారాడే వాటిలోను అలాంటివి మీకు అసహ్యంగానే ఉండాలి.

[11] వాటి మాంసం తినకూడదు. వాటి పీనుగులను మీకు అసహ్యమైనవని భావించాలి.

[12] నీళ్ళలో దేనికి రెక్కలూ పొలుసులూ ఉండవో వాటిని మీరు అసహ్యించుకోవాలి.

[13] “పక్షులలో కూడా కొన్ని అసహ్యమైనవిగా భావించాలి. వాటిని తినకూడదు. అవి అసహ్యంగా ఉన్నాయి. అవేవంటే, గరుడపక్షి, రాబందు, క్రౌంచపక్షి,

[14] ప్రతి విధమైన గద్ద,

[15] ప్రతి విధమైన కాకి,

[16] నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ,

[17] పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ,

[18] హంస, గూడబాతు, నల్ల రాబందు,

[19] సంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలం.

[20] “రెక్కలు ఉండి నాలుగు కాళ్ళతో తిరిగే ప్రాణులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి.

[21] అయితే రెక్కలు ఉండి నాలుగు కాళ్ళతో తిరుగుతూ, నేలమీద గంతులు వేయడానికి తొడలుగల పురుగులన్నిటినీ తినవచ్చు.

[22] గాలిలో ఎగిరే ప్రతి విధమైన మిడతను గానీ, చిన్న మిడతను గానీ, కీచురాయిని గానీ, ఆకు మిడతను గానీ తినవచ్చు.

[23] కాని, నాలుగు కాళ్ళు గల తక్కిన పురుగులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి.

[24] “వీటివల్ల కూడా మీరు అశుద్ధంగా అవుతారు: వీటి పీనుగులను తాకిన ప్రతి ఒక్కరూ సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు.

[25] వీటి పీనుగులను మోసిన ప్రతి ఒక్కరూ బట్టలు ఉతుక్కోవాలి. ఆ వ్యక్తి సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు.

[26] రెండు గిట్టలున్న అన్ని జంతువులలో చీలిన గిట్టలు లేకుండా నెమరువేయకుండా ఉండే జంతువులు మీకు అశుద్ధం. అలాంటివాటిని తాకిన ప్రతి ఒక్కరూ అశుద్ధంగా ఉంటారు.

[27] నాలుగు కాళ్లతో నడిచే జంతువులలో ఏవి పంజాలతో నడుస్తాయో అవన్నీ మీకు అశుద్ధం. వాటి పీనుగులను తాకిన ప్రతి ఒక్కరూ సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు.

[28] వాటి పీనుగులను మోసినవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు. అలాంటివి మీకు అశుద్ధంగా ఉంటాయి.

[29] “నేలమీద ప్రాకే ప్రాణులలో ఇవి మీకు అశుద్ధంగా ఉంటాయి – అడవి ఎలుక, ఎలుక, ప్రతి రకమైన బల్లి,

[30] ప్రతి రకమైన ఊసరవెల్లి, తొండ.

[31] ప్రాకే ప్రాణులలో అవి మీకు అశుద్ధం. వాటి పీనుగును తాకిన ప్రతి ఒక్కరూ సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు.

[32] వాటిలో చచ్చినది ఏ వస్తువు మీద పడితే ఆ వస్తువు అశుద్ధంగా ఉంటుంది. అది చెక్కపాత్ర కావచ్చు, బట్ట, తోలు, సంచి కావచ్చు. అది మీరు ఉపయోగించుకొనే వస్తువైతే – అది ఏదైనా సరే – దాన్ని నీళ్ళలో వెయ్యాలి. అది సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటుంది. తరువాత శుద్ధంగా ఉంటుంది.

[33] అలాంటి ప్రాణి పీనుగు మట్టి పాత్రలో పడితే దానిలో ఉన్నదంతా అశుద్ధంగా ఉంటుంది. ఆ పాత్రను పగలగొట్టాలి.

[34] ఆ పాత్రలో ఆహారమూ నీళ్ళూ ఉంటే ఆ ఆహారం అశుద్ధంగా ఉంటుంది. అలాంటి పాత్రలోని ఏ పానీయమైనా అశుద్ధంగా ఉంటుంది.

[35] వాటి పీనుగులలో ఏదైనా పొయ్యిమీద గానీ, కుంపటిమీద గానీ, అలాంటి దేని మీద పడ్డా ఆ వస్తువు అశుద్ధంగా ఉంటుంది, మీరు దాన్ని అశుద్ధమైనదిగా ఎంచాలి. దాన్ని ముక్కలుగా పగలగొట్టాలి.

[36] కాని, నీళ్ళుండే ఊటలో గానీ, బావిలో గానీ అది పడినా ఆ ఊట లేక బావి అశుద్ధంగా ఉండదు. అయితే అలాంటి ప్రాణి పీనుగును తాకిన ప్రతి ఒక్కరూ అశుద్ధంగా ఉంటారు.

[37] వాటి పీనుగులలో ఏదైనా చల్లబోయే విత్తనాలమీద పడినా అవి అశుద్ధంగా ఉండవు.

[38] కానీ, నానబెట్టిన విత్తనాలమీద పడితే అవి మీకు అశుద్ధంగా ఉంటాయి.

[39] “మీరు తినదగ్గ జంతువులలో ఏదైనా చస్తే దాని పీనుగును తాకిన వ్యక్తి సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు.

[40] దానిలో ఏదైనా తినేవాడు గానీ, దాన్ని మోసేవాడు గానీ తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు.

[41] నేలమీద ప్రాకే చిన్న ప్రాణులన్నీ అసహ్యంగా ఉంటాయి. వీటిని తినకూడదు.

[42] కడుపుతో ప్రాకే వాటిని గానీ, నాలుగు కాళ్ళతో తిరిగే వాటిని గానీ, చాలా కాళ్ళున్న వాటినీ, అలాంటి ప్రాకే ప్రాణులలో దేనినీ తినకూడదు. అవి అసహ్యంగా ఉంటాయి.

[43] ఇలాంటి ప్రాకే ప్రాణులలో ఏదో ఒక దానివల్ల మిమ్ములను మీరు అసహ్యంగా అశుద్ధంగా చేసుకోకూడదు.

[44] ఎందుకంటే నేను మీ దేవుడైన యెహోవాను. నేను పవిత్రుణ్ణి. గనుక మిమ్ములను మీరు పరిశుద్ధం చేసుకొని శుద్ధులుగా ఉండండి. నేలమీద ప్రాకే ప్రాణులలో దేని వల్లా మిమ్ములను మీరు అశుద్ధంగా చేసుకోకూడదు.

[45] నేను మీకు దేవుడుగా ఉండేందుకు ఈజిప్ట్ నుంచి మిమ్ములను తీసుకువచ్చిన యెహోవాను. నేను పవిత్రుణ్ణి, గనుక మీరూ పవిత్రులై ఉండాలి.

[46] “జంతువులనూ పక్షులనూ అన్ని జలప్రాణులనూ నేలమీద ప్రాకే ప్రాణులన్నీటినీ గురించిన చట్టమిది.

[47] దీని ఉద్దేశం అశుద్ధమైనదానికీ శుద్ధమైనదానికీ, తినదగ్గదానికీ తినదగనిదానికీ భేదం చెయ్యడమే.

లేవీయకాండం (యాజి ధర్మవిధులు) — Chapters