[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[2] “నీవు అహరోన్నూ అతడి కొడుకులనూ సన్నిధిగుడారం ద్వారం దగ్గరికి తీసుకురా. యాజి వస్త్రాలనూ, అభిషేక తైలాన్నీ, పాపాలకోసమైన బలి కోడెనూ, రెండు పొట్టేళ్ళనూ, గంపెడు పొంగని రొట్టెలనూ కూడా తీసుకురా.
[3] అక్కడ సమాజమంతటినీ సమకూర్చు.”
[4] యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అతడు చేశాడు. సమాజం సన్నిధిగుడారం ద్వారం దగ్గర సమావేశం అయ్యారు.
[5] మోషే సమాజంతో “ఇలా చెయ్యాలని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అన్నాడు.
[6] మోషే అహరోన్నూ అతడి కొడుకులనూ తీసుకువచ్చి వారికి స్నానం చేయించాడు.
[7] అప్పుడతడు అహరోనుకు చొక్కాను తొడిగి, నడికట్టు కట్టి, నిలువుటంగీనీ ఏఫోదునూ వేసి, నేర్పుతో నేసిన ఏఫోదు కట్టును కట్టి, దానితో అతడికి ఏఫోదును బిగించాడు.
[8] వక్షపతకం కూడా అతడికి వేశాడు. వక్షపతకంలో “ఊరీం”, “తుమ్మీం” ఉంచాడు.
[9] అతడి తలమీద పాగా పెట్టాడు; పాగా ముందు భాగం మీద కిరీటంలాంటి పవిత్రమైన బంగారు రేకును ఉంచాడు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞప్రకారమే ఇదంతా జరిగింది.
[10] అప్పుడు మోషే అభిషేక తైలం చేతపట్టుకొని దైవనివాసాన్ని, దానిలో ఉన్న ప్రతిదాన్నీ అభిషేకించి ప్రతిష్ఠించాడు.
[11] అతడు ఆ తైలంలో కొంత ఏడు సార్లు బలిపీఠం మీద చిలకరించాడు. దాని సామానంతా, గంగాళాన్నీ, దాని బలిపీఠాన్నీ ప్రతిష్ఠించడానికి అభిషేకించాడు.
[12] అహరోన్ను ప్రతిష్ఠించడానికి అభిషేక తైలంలో కొంత అతడి తలమీద పోసి అభిషేకించాడు.
[13] అప్పుడు మోషే అహరోను కొడుకులను దగ్గరికి తీసుకువచ్చి వారికి చొక్కాలను తొడిగాడు, నడికట్లను కట్టాడు, కుళ్ళాయిలను పెట్టాడు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇదంతా జరిగింది.
[14] అప్పుడతడు పాపాలకోసమైన బలిగా కోడెను తెప్పించాడు. అహరోను, అతడి కొడుకులు దాని తలమీద చేతులు పెట్టారు.
[15] దాన్ని వధించిన తరువాత మోషే దాని రక్తాన్ని తీసుకొని దానిలో కొంత బలిపీఠం కొమ్ములన్నిటిమీదా తన వ్రేలితో పూసి దాన్ని పవిత్రం చేశాడు. మిగతా రక్తాన్ని బలిపీఠం అడుగున పోసి, అలా ఆ పీఠం కోసం ప్రాయశ్చిత్తం చేయడం వల్ల దాన్ని ప్రతిష్ఠించాడు.
[16] అప్పుడు మోషే ఆ బలిజంతువు పేగులమీది కొవ్వునంతా, కారిజం అంటివున్న కొవ్వునూ, రెండు మూత్ర పిండాలనూ వాటి కొవ్వునూ తీసి బలిపీఠం మీద కాల్చివేశాడు.
[17] అయితే ఆ కోడెనూ, దాని చర్మాన్నీ, దాని మాంసాన్నీ, దాని పేడనూ, శిబిరం బయట పూర్తిగా కాల్చివేశారు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇదంతా జరిగింది.
[18] ఆ తరువాత అతడు హోమంగా ఒక పొట్టేలును తెప్పించాడు. అహరోను, అతడి కొడుకులు ఆ పొట్టేలు తలమీద చేతులు పెట్టారు.
[19] దాన్ని వధించిన తరువాత మోషే దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు.
[20] ఆ పొట్టేలు అవయవాలను విడదీసి వాటినీ, దాని తలనూ కొవ్వునూ కాల్చివేశాడు.
[21] దాని లోపలి భాగాలనూ కాళ్ళనూ నీళ్ళతో కడిగి ఆ పొట్టేలునంతా బలిపీఠంమీద కాల్చివేశాడు. అది పరిమళంగా ఉన్న హోమం, యెహోవాకు మంటల్లో అర్పించిన అర్పణ. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞప్రకారమే ఇది జరిగింది.
[22] మోషే ఆ రెండో పొట్టేలును కూడా తెప్పించాడు. అది యాజి సేవాప్రతిష్ఠకోసం. దాని తలమీద అహరోను, అతడి కొడుకులు చేతులు పెట్టారు.
[23] దాన్ని వధించాక మోషే దాని రక్తంలో కొంత తీసి అహరోను కుడి చెవి కొనమీద, కుడిచేతి బొటనవ్రేలిమీద, కుడికాలి బొటనవ్రేలిమీద పూశాడు.
[24] అహరోను కొడుకులను కూడా దగ్గరికి తీసుకువచ్చి వారి కుడిచెవి కొనమీద, కుడిచేతి బొటనవ్రేలిమీద, కుడికాలి బొటనవ్రేలిమీద కూడా పూశాడు. మిగతా రక్తాన్ని బలిపీఠం చుట్టూరా చల్లాడు.
[25] అప్పుడు దాని కొవ్వునూ, కొవ్విన తోకనూ, పేగులమీది కొవ్వునూ, కారిజం అంటివున్న కొవ్వునూ, రెండు మూత్రపిండాలనూ, వాటి కొవ్వునూ, కుడి తొడనూ తీశాడు.
[26] యెహోవా సన్నిధానంలో ఉన్న గంపెడు పొంగని రొట్టెలలో నుంచి పొంగజేసే పదార్థం లేని ఒక పిండి వంటకం, నూనె కలిపిన ఒక భక్ష్యం, ఒక పలచని అప్పడం తీసుకొని ఆ కొవ్వుమీద, కుడితొడమీద ఉంచాడు.
[27] అప్పుడు అవన్నీ అహరోను చేతులలో, అతడి కొడుకుల చేతులలో పెట్టి యెహోవా సన్నిధానంలో అటూ ఇటూ కదల్చాడు. అది కదలిక అర్పణ.
[28] ఆ తరువాత మోషే వారి చేతుల్లోనుంచి వాటిని తీసి, బలిపీఠంమీద ఉన్న హోమబలిమీద పెట్టి కాల్చివేశాడు. అదంతా పరిమళంగా ఉన్న సేవాప్రతిష్ఠ అర్పణంగా ఉంది. అది యెహోవాకు మంటల్లో అర్పణ.
[29] మోషే దాని బోరను కూడా తీసి కదలిక అర్పణగా యెహోవా సన్నిధానంలో కదల్చాడు. సేవా ప్రతిష్ఠ కోసమైన పొట్టేలులో అది మోషేకు వచ్చిన భాగం. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞప్రకారమే ఇదంతా జరిగింది.
[30] అప్పుడు మోషే, అభిషేక తైలంలో కొంత, బలిపీఠం మీద ఉన్న రక్తంలో కొంత తీసుకొని, అహరోను మీద, అతడి వస్త్రాలమీద, అతడి కొడుకుల మీద, వారి వస్త్రాల మీద చిలకరించాడు. ఈ విధంగా అహరోన్నూ, అతడి వస్త్రాలనూ, అతడి కొడుకులనూ, వారి వస్త్రాలనూ ప్రతిష్ఠించాడు.
[31] మోషే అహరోనుతోను, అతడి కొడుకులతోను ఇలా అన్నాడు: “సన్నిధిగుడారం ద్వారం దగ్గర ఈ మాంసం వండాలి: అక్కడే దాన్నీ, సేవాప్రతిష్ఠ కోసమైన రొట్టెనూ ఆ గంపలోని రొట్టెనూ తినాలి. అహరోను, అతడి కొడుకులు దాన్ని తినాలని నేను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చెయ్యాలి.
[32] మిగతా మాంసం, రొట్టె పూర్తిగా కాల్చివెయ్యాలి.
[33] మిమ్మల్ని ప్రతిష్ఠించడం ఏడు రోజులు పడుతుంది. మీ ప్రతిష్ఠ దినాలు ముగిసేవరకు, ఆ ఏడు రోజులలో మీరు సన్నిధిగుడారం ద్వారం విడిచి వెళ్ళకూడదు.
[34] ఈ రోజు మీ పాపాలను కప్పివేయడానికి ఇలా చేశాను. చేయాలని యెహోవా ఆజ్ఞాపించాడు.
[35] మీరు చావకుండేలా సన్నిధిగుడారం ద్వారా దగ్గరే ఏడు రోజులు రాత్రింబగళ్ళూ ఉండాలి. యెహోవా చెప్పినట్టే చేస్తూ ఉండాలి. ఆయన అలా నాకు ఆజ్ఞ ఇచ్చాడు”.
[36] యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టెల్లా అహరోను, అతడి కొడుకులు చేశారు.