Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,

[2] “నీవు ఇస్రాయేల్ ప్రజల సమాజమంతటితో ఈ విధంగా చెప్పు – నేను మీ దేవుడు యెహోవాను. నేను పవిత్రుణ్ణి గనుక మీరూ పవిత్రులై ఉండాలి.

[3] “మీలో ప్రతి వ్యక్తీ తన తల్లిపట్ల, తండ్రి పట్ల గౌరవం చూపాలి. నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి. నేను యెహోవాను. మీ దేవుణ్ణి.

[4] “మీరు వ్యర్థమైన వాటివైపు తిరగకూడదు. పోత విగ్రహాలను చేసుకోకూడదు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.

[5] “మీరు యెహోవాకు శాంతిబలి అర్పిస్తే, అది అంగీకారంగా ఉండేలా తగిన విధంగా దాన్ని అర్పించాలి.

[6] మీరు దాన్ని అర్పించిన రోజూ, తరువాతి రోజూ దాన్ని తినాలి. మూడో రోజు వరకూ మిగిలినదానిని పూర్తిగా కాల్చివేయాలి.

[7] మూడో రోజు దానిలో కొంచెమైనా తింటే అది అసహ్యమవుతుంది. నేను దాన్ని అంగీకరించను.

[8] మూడో రోజు దాన్ని తిన్నవాడు యెహోవాకు చెందిన పవిత్రమైనదాన్ని అపవిత్రం చేశాడు గనుక అతడు తన అపరాధం భరించాలి. అతణ్ణి ప్రజల్లో లేకుండా చేయాలి.

[9] “మీరు మీ పొలం పంట కోసేటప్పుడు పొలం గట్టుదాకా పూర్తిగా కోయగూడదు, కోతతో పరిగె ఏరుకోకూడదు.

[10] మీ ద్రాక్ష తీగెలనుంచి పళ్ళన్నీ కూర్చుకోకూడదు. ద్రాక్ష తోటలో రాలిన పళ్ళు ఏరుకోకూడదు. బీదలకు, విదేశీయులకు వాటిని విడిచిపెట్టాలి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.

[11] “మీరు దొంగతనం చేయకూడదు. మోసంతో వ్యవహరించకూడదు. ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పకూడదు.

[12] “నా పేర అబద్ధంగా శపథం చేయకూడదు. దానివల్ల మీ దేవుని పేరు దూషణపాలు అవుతుంది. నేను యెహోవాను.

[13] మీ పొరుగువాణ్ణి పీడించకూడదు, దోచుకోకూడదు. కూలివారి కూలి మరుసటి రోజువరకు మీ దగ్గర ఉంచకూడదు.

[14] “చెవిటివాణ్ణి తిట్టకూడదు. గుడ్డివాడి ఎదుట అడ్డు బండలు వేయకూడదు. మీ దేవుడి పట్ల భయభక్తులు చూపాలి. నేను యెహోవాను.

[15] “అన్యాయమైన తీర్పులు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతం చూపకూడదు; న్యాయంతో మీ సాటి మానవుడికి తీర్పు తీర్చాలి.

[16] “మీ ప్రజలలో ఎవరూ కొండెగాడుగా తిరగకూడదు. మీ పొరుగువాడు ప్రాణాపాయంలో ఉంటే మీరు నిర్లక్ష్యంగా నిలబడకూడదు. నేను యెహోవాను.

[17] “మీ హృదయంలో స్వదేశస్థుల మీద పగపట్టకూడదు. మీ పొరుగువాడి అపరాధం మీమీదికి రాకుండేలా మీరు వాణ్ణి తప్పకుండా మందలించాలి.

[18] “కీడుకు ప్రతికీడు చెయ్యకూడదు. మీ ప్రజలమీద కోపం ఉంచుకోకూడదు. మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి, నేను యెహోవాను.

[19] “మీరు నా చట్టాల ప్రకారం ప్రవర్తించాలి. మీ జంతువులను ఇతర జాతి జంతువులను జత కూడనియ్యకూడదు. మీ పొలంలో రెండు జాతుల విత్తనాలు చల్లకూడదు. రెండు రకాల దారాలతో నేసిన బట్ట వేసుకోకూడదు.

[20] “దాసిగా ఉన్న అమ్మాయికి వివాహం నిశ్చయం అయిందనుకోండి. ఆమెకు విడుదల కలగలేదు, స్వతంత్రం లేదు. వేరొకడు ఆమెతో పోతే శిక్ష తప్పక ఉండాలి. ఆమెకు స్వతంత్రం లేదు గనుక వారికి మరణ శిక్ష విధించకూడదు.

[21] అలా చేసిన వ్యక్తి అపరాధ బలిగా ఒక పొట్టేలును సన్నిధిగుడారం ద్వారానికి యెహోవా సముఖంలోకి తీసుకురావాలి.

[22] యాజి అపరాధ బలి పొట్టేలును సమర్పించి యెహోవా సన్నిధానంలో అతడి పాపాన్ని కప్పివేస్తాడు. ఈ విధంగా అతడు చేసిన పాపం విషయం అతడికి క్షమాపణ దొరుకుతుంది.

[23] “మీరు కనాను దేశానికి చేరి అక్కడ నానా రకాల ఫలవృక్షాలను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రమని భావించాలి. అంటే, అవి మూడేళ్ళ వరకు మీకు అపవిత్రంగా ఉండాలి. వాటిని తినకూడదు.

[24] నాలుగో ఏట యెహోవాకు స్తుతి నైవేద్యంగా అర్పించడానికి ఆ చెట్ల పండ్లన్నీ పవిత్రంగా ఉంటాయి.

[25] అయిదో ఏట వాటి పండ్లు తినవచ్చు. ఈ విధంగా చేస్తే ఆ చెట్లు మీకు ఎక్కువగా కాస్తాయి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.

[26] “మీరు దేనినీ దాని రక్తంతోపాటు తినకూడదు. “శకునాలు చూడకూడదు, మంత్రవిద్య అభ్యసించ కూడదు.

[27] “మీ తలకు ప్రక్కల ఉన్న వెండ్రుకలను గుండ్రంగా కత్తిరించకూడదు. మీ గడ్డం ప్రక్కలను గొరగకూడదు.

[28] “చనిపోయినవారి కోసం మీ శరీరంలో గాయాలు చేసుకోకూడదు; దేహం మీద పచ్చబొట్లు పొడుచుకోకూడదు. నేను యెహోవాను.

[29] “మీ కూతురును వేశ్యగా చేయకూడదు. ఆ విధంగా ఆమెను అపవిత్రం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే దేశమంతా వేశ్యలమయంగా ఉంటుంది, పోకిరితనంతో నిండిపోతుంది.

[30] “నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ప్రత్యేక దినాలుగా ఆచరించాలి. నా పవిత్రాలయాన్ని భయభక్తులతో చూడాలి. నేను యెహోవాను.

[31] “పూనకం వచ్చేవాళ్ళ దగ్గరికి, సోదె చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళ వల్ల మీరు అశుద్ధులవుతారు. వాళ్ళను వెదకకూడదు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.

[32] “తల నెరసిన వ్యక్తి సముఖంలో నిలబడాలి. ముసలివాడి ముఖాన్ని గౌరవించాలి. మీ దేవుని పట్ల భయభక్తులు చూపాలి. నేను యెహోవాను.

[33] “మీ దేశంలో మీ మధ్య విదేశీయుడు నివసిస్తే అతడికి కీడు చెయ్యకూడదు.

[34] మీ మధ్య నివసించే విదేశీయుణ్ణి స్వదేశీయుణ్ణి సమదృష్టితో చూడాలి. మిమ్మల్నెలాగో అతణ్ణి అలాగే చూడాలి. మీరు ఈజిప్ట్‌లో విదేశీయులు గదా. నేను మీ దేవుడైన యెహోవాను.

[35] “అన్యాయమైన తీర్పులు తీర్చకూడదు. కొలతలో గానీ, తూకంలో గానీ, పరిమాణంలో గానీ అన్యాయం చేయకూడదు.

[36] సరైన త్రాసులు, సరైన తూకం రాళ్ళు, సరైన తూము, సరైన కొలత మీరు వినియోగించాలి. నేను యెహోవాను; ఈజిప్ట్ దేశం నుంచి మిమ్ములను తీసుకువచ్చిన మీ దేవుణ్ణి.

[37] మీరు నా చట్టాలన్నీ, నా న్యాయనిర్ణయాలన్నీ పాటించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి. నేను యెహోవాను.”

లేవీయకాండం (యాజి ధర్మవిధులు) — Chapters