Skip to content
Opens in a new window

[1] “ఎవరైనా పశువులలో మగదాన్ని గానీ, ఆడదాన్నీ గానీ శాంతిబలిగా అర్పిస్తే యెహోవా దగ్గరికి తీసుకువచ్చినది లోపం లేకుండా ఉండాలి.

[2] అతడు తాను అర్పించేదాని తలమీద చెయ్యి ఉంచి, సన్నిధిగుడారం ద్వారం దగ్గర దాన్ని వధించాలి. యాజులైన అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూరా దాని రక్తాన్ని చిలకరించాలి.

[3] అతడు ఆ శాంతి బలిపశువులోనుండి కొన్ని భాగాలను యెహోవాకు హోమంగా అర్పించాలి – అంటే, పేగులను అంటి ఉన్న కొవ్వు అంతా,

[4] రెండు మూత్రపిండాలనూ వాటిమీద కొవ్వునూ, డొక్కలమీది కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర ఉన్న కారిజం అంటుకొని ఉన్న కొవ్వునూ అర్పించాలి.

[5] అహరోను కొడుకులు బలిపీఠం మీది నిప్పుపైన ఉన్న కట్టెల మీది హోమద్రవ్యం పైన వాటిని కాల్చివెయ్యాలి. అది మంటల్లో అర్పణ. అది యెహోవాకు పరిమళంగా ఉంటుంది.

[6] “ఎవరైనా యెహోవాకు గొర్రెను గానీ, మేకను గానీ శాంతిబలిగా అర్పిస్తే అది మగదైనా ఆడదైనా లోపం లేకుండా ఉండాలి.

[7] అతడి అర్పణ గొర్రెపిల్లయితే దాన్ని యెహోవా సన్నిధానంలోకి తీసుకురావాలి.

[8] అతడు తాను అర్పించేదాని తలమీద చెయ్యి ఉంచి సన్నిధిగుడారం ఎదుట దాన్ని వధించాలి. అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూరా దాని రక్తాన్ని చల్లాలి.

[9] అతడు ఆ శాంతిబలి జంతువులో నుంచి కొన్ని భాగాలను యెహోవాకు హోమంగా అర్పించాలి – అంటే దాని కొవ్వునూ, వెన్నెముకనూ, కొవ్విన తోకనంతా, పేగులను అంటి ఉన్న కొవ్వునూ, పేగులమీది కొవ్వునంతటినీ

[10] రెండు మూత్రపిండాలనూ, వాటిమీది కొవ్వునూ, డొక్కలమీది కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కారిజం అంటి ఉన్న కొవ్వునూ అర్పించాలి.

[11] యాజి వాటిని ఆహారంగా బలిపీఠం మీద కాల్చి వెయ్యాలి. అది యెహోవాకు హోమం.

[12] “అతడి అర్పణ మేక అయితే దాన్ని యెహోవా సన్నిధానంలోకి తీసుకురావాలి.

[13] దాని తలమీద చెయ్యి ఉంచి సన్నిధిగుడారం ఎదుట దాన్ని వధించాలి. అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూరా దాని రక్తాన్ని చల్లాలి.

[14] దానిలోనుండి కొన్ని భాగాలను యెహోవాకు హోమంగా అర్పించాలి – అంటే, పేగులను అంటి ఉన్న కొవ్వునూ, పేగుల మీది కొవ్వునంతటినీ,

[15] రెండు మూత్రపిండాలనూ, వాటిమీది కొవ్వునూ, డొక్కలమీది కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర ఉన్న కారిజం అంటి ఉన్న కొవ్వునూ అర్పించాలి.

[16] యాజి వాటిని ఆహారంగా బలిపీఠంమీద కాల్చివెయ్యాలి. అది పరిమళ హోమం. కొవ్వంతా యెహోవాదే.

[17] “మీరెక్కడ నివసించినా మీరు కొవ్వును గానీ రక్తాన్ని గానీ తిననేకూడదు. ఇది మీ తరతరాలకు ఎప్పటికీ నిలిచివుండే చట్టం.”

లేవీయకాండం (యాజి ధర్మవిధులు) — Chapters