[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[2] “ఎవరైనా తనకు తన పొరుగువాడు అప్పగించినదాని విషయంలో అతణ్ణి వంచించడంవల్ల యెహోవాకు ద్రోహి అయి పాపం చేస్తా డనుకోండి; తాకట్టు ఉంచిన దానిని గురించి అతణ్ణి వంచిస్తాడనుకోండి; లేకపోతే అతడి వస్తువును దొంగిలిస్తా డనుకోండి; అతణ్ణి మోసగించి ఏదో తీసుకుంటాడనుకోండి.
[3] పోయినది తనకు దొరికినప్పుడు దొరకలేదని బొంకుతా డనుకోండి. లేకపోతే, మనుషులు చేసే ఇలాంటి పాపాలలో తాను చేసినదాని గురించి అబద్ధసాక్ష్యం పలుకుతాడనుకోండి. అలాంటివాడు యెహోవాపట్ల ద్రోహి అవుతున్నాడు.
[4] ఎవరైనా ఇలా పాపం చేసి అపరాధి అయితే తాను దొంగలించినదాన్ని మళ్ళీ ఇచ్చివేయాలి. మోసంచేత తీసుకొన్న దాన్ని గానీ, తనకు అప్పగించిన దాన్ని గానీ, పోయి తనకు దొరికినదాన్ని గానీ మళ్ళీ ఇచ్చివేయాలి.
[5] దేని గురించి అబద్ధ సాక్ష్యం పలికాడో దాన్ని పూర్తిగా ఇచ్చివేయాలి. అంతేగాక దానిలో అయిదో భాగాన్ని కూడా ఇవ్వాలి. అది ఎవరికి చెందుతుందో వారికి అదంతా ఇవ్వాలి. తాను అపరాధ బలిని సమర్పించే రోజే దాన్ని ఇవ్వాలి.
[6] అతడు యెహోవాకు సమర్పించే తన అపరాధబలిగా మందలోనుంచి లోపం లేని పొట్టేలును యాజి దగ్గరికి తేవాలి. నీవు దాని విలువను నిర్ణయించాలి.
[7] యెహోవా సన్నిధానంలో యాజి ఆ బలిని అర్పించి ఆ వ్యక్తి తప్పిదాలను కప్పివేస్తాడు. ఆ వ్యక్తి ఏమేమి చేసి అపరాధి అయ్యాడో వాటన్నిటిలో అతడికి క్షమాపణ దొరుకుతుంది.”
[8] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[9] “నీవు అహరోనుకూ అతని కొడుకులకూ ఈ విధంగా ఆజ్ఞాపించు. హోమాన్ని గురించిన చట్టం ఇది – హోమం రాత్రి అంతా ఉదయం వరకూ బలిపీఠం మీద కాలుతూ ఉండాలి. బలిపీఠం మీది నిప్పు ఎప్పుడూ మండుతూ ఉండాలి.
[10] యాజి నార షరాయిలనూ, సన్ననార నిలువుటంగీనీ తొడుక్కోవాలి; బలిపీఠం మీద మంటలు కాల్చివేసిన హోమం బూడిదను ఎత్తి బలిపీఠం దగ్గర పెట్టాలి.
[11] అప్పుడతడు తన బట్టలు మార్చుకొని ఆ బూడిదను శిబిరం బయట ఉన్న శుద్ధమైన చోటుకు తీసుకుపోవాలి.
[12] బలిపీఠం మీది నిప్పు మండుతూ ఉండాలి. అది ఎన్నడూ ఆరిపోకూడదు. ప్రతి రోజూ ప్రొద్దున్నే యాజి దానిమీద కట్టెలు వెయ్యాలి, దానిమీద హోమాన్ని చక్కగా ఉంచాలి. శాంతిబలి పశువు కొవ్వును కాల్చివెయ్యాలి.
[13] బలిపీఠం మీద నిప్పు ఎప్పుడూ మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు.
[14] “నైవేద్యాన్ని గురించిన చట్టం ఇది: అహరోను కొడుకులు యెహోవా సన్నిధానంలో బలిపీఠానికి ముందుగా దాన్ని సమర్పించాలి.
[15] యాజి ఆ నైవేద్యంనుంచి పిడికెడు పిండిని, దాని నూనెలో నుంచి కొంత, దాని సాంబ్రాణి అంతా తీయాలి. స్మృతి చిహ్నంగా వాటిని బలిపీఠం మీద యెహోవాకు పరిమళంగా కాల్చివెయ్యాలి.
[16] మిగతాదాన్ని అహరోను, అతడి కొడుకులు తినాలి. పొంగజేసే పదార్థం వెయ్యకుండా రొట్టెలు చేసి ఒక పవిత్రమైన చోట వాటిని తినాలి. అంటే సన్నిధి గుడారం ఆవరణంలో దాన్ని తినాలి.
[17] పొంగజేసే పదార్థం వేసి ఆ రొట్టె కాల్చకూడదు. నా హోమాలలో వారికి ఈ భాగాన్ని ప్రసాదించాను. పాపాలకోసమైన బలిలాగే, అపరాధ బలిలాగే, అది అతి పవిత్రం.
[18] అహరోను కొడుకులలో ప్రతి ఒక్కరూ దాన్ని తినవచ్చు. ఇది యెహోవా హోమాల విషయం మీ తరతరాలకు ఎప్పటికీ నిలిచివుండే చట్టం. వాటికి తగిలే ప్రతి వస్తువూ పవిత్రం అవుతుంది.”
[19] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[20] “అహరోను అభిషేకం పొందిన రోజు అతడూ అతడి కొడుకులూ ఈ నైవేద్యాన్ని యెహోవాకు సమర్పించాలి – మామూలు నైవేద్యం లాగే సుమారు ఒక కిలోగ్రాం మెత్తని గోధుమ పిండి దానిలో సగం పొద్దున, సగం సాయంకాలం సమర్పించాలి.
[21] నూనెతో బాగా కలిపి పెనం మీద కాల్చి దాన్ని తేవాలి. అప్పుడా నైవేద్యాన్ని ముక్కలుముక్కలుగా చేసి యెహోవాకు పరిమళంగా సమర్పించాలి.
[22] అహరోను కొడుకులలో అతడి స్థానంలో అభిషేకం పొందే యాజి కూడా అలాగే సమర్పించాలి. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం. అదంతా యెహోవాకు పూర్తిగా కాల్చివెయ్యాలి.
[23] యాజి చేసే ప్రతి నైవేద్యాన్నీ పూర్తిగా కాల్చివెయ్యాలి. దాన్ని తినకూడదు.”
[24] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[25] “నీవు అహరోనుతోను అతడి కొడుకులతోను ఈ విధంగా చెప్పు: పాపాలకోసమైన బలిని గురించిన చట్టమిది – హోమబలి జంతువును వధించిన స్థలంలోనే యెహోవా సన్నిధానంలో పాపాలకోసమైన బలి జంతువును కూడా వధించాలి. అది అతి పవిత్రం.
[26] పాపాల కోసం దాన్ని అర్పించిన యాజి దాన్ని తినాలి. ఒక పవిత్ర స్థలంలో, అంటే సన్నిధిగుడారం ఆవరణంలో దాన్ని తినాలి.
[27] దాని మాంసానికి తగిలే ప్రతి వస్తువూ పవిత్రంగా ఉంటుంది. ఒకవేళ దాని రక్తంలో కొంత వస్త్రం మీద పడితే ఆ వస్త్రం ఒక పవిత్రమైన చోట ఉతకాలి.
[28] ఆ బలి మాంసాన్ని మట్టి కుండలో వండితే ఆ కుండను పగలకొట్టాలి; కంచు పాత్రలో వండితే ఆ పాత్రను తోమి నీళ్ళతో కడగాలి.
[29] యాజులలో ప్రతి మగవాడూ దాన్ని తినవచ్చు. అది అతి పవిత్రమైనది.
[30] కాని, పాపాలకోసమైన బలి రక్తంలో కొంచమైనా సన్నిధిగుడారంలోని పవిత్ర స్థలంలో పాపాన్ని కప్పివేయడానికి తీసుకువస్తే ఆ బలి మాంసాన్ని తినకూడదు. దాన్ని పూర్తిగా కాల్చివెయ్యాలి.