Skip to content
Opens in a new window

[1] “మీరు విగ్రహాలను చేసుకోకూడదు. చెక్కిన ప్రతిమను గానీ, స్తంభాన్ని గానీ నిలబెట్టకూడదు. ఆరాధనకోసం ఏదో రూపంగా చెక్కిన రాయి మీ దేశంలో నిలబెట్టకూడదు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.

[2] “నేను నియమించిన విశ్రాంతిదినాలను ప్రత్యేక దినాలుగా మీరు ఆచరించాలి. నా పవిత్ర స్థానమంటే మీకు భయభక్తులు ఉండాలి. నేను యెహోవాను.

[3] “మీరు నా చట్టాల ప్రకారం నడుచుకొంటూ, నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే,

[4] మీ వానకాలాల్లో నేను మీకు వర్షం కురిపిస్తాను. మీ భూమి పంటలు ఇస్తుంది, మీ చెట్లు ఫలిస్తాయి.

[5] మీ ద్రాక్షపళ్ళ కాలంవరకు మీ నూర్పు సాగుతూ ఉంటుంది. విత్తనాలు చల్లే కాలం వరకు ద్రాక్షపళ్ళు ఉంటాయి. మీరు సంతృప్తిగా తింటారు, మీ దేశంలో నిర్భయంగా కాపురముంటారు.

[6] దేశంలో నేను శాంతి ప్రసాదిస్తాను. మీరు నిద్రపోయేటప్పుడు మిమ్ములను ఎవడూ భయపెట్టడు. దేశంలో దుష్టమృగాలు లేకుండా చేస్తాను. మీ దేశం మీదికి ఖడ్గం రాదు.

[7] మీరు మీ శత్రువులను తరుముతారు. వాళ్ళు మీ ఎదుట ఖడ్గం చేత కూలుతారు.

[8] మీలో అయిదుగురు నూరుమందిని తరుముతారు; నూరు మంది పది వేలమందిని తరుముతారు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గంచేత కూలుతారు.

[9] “ఈ విధంగా నేను మిమ్ములను కటాక్షిస్తాను. మీకు సంతానమిచ్చి మిమ్ములను వృద్ధి చేస్తాను. మీతో నా ఒడంబడిక సుస్థిరం చేస్తాను.

[10] మునుపు కూర్చుకొన్న పాత ధాన్యం మీరు తింటారు; కొత్తది వచ్చినప్పుడు పాతది మిగిలి ఉంటుంది.

[11] నా నివాసం మీమధ్య ఉంచుతాను. మిమ్ములను నిరాకరించను.

[12] నేను మీ మధ్య సంచరిస్తాను, మీకు దేవుడుగా ఉంటాను. మీరు నాకు ప్రజగా ఉంటారు.

[13] నేను యెహోవాను. మీ దేవుణ్ణి. మీరు ఈజిప్ట్ వాళ్ళకు దాసులుగా ఉండకూడదని వాళ్ళ దేశం నుంచి మిమ్ములను తీసుకు వచ్చినవాణ్ణి. నేను మీ కాడిని విరగగొట్టి, మీరు తలెత్తుకుని నడిచేలా చేశాను.

[14] “కాని, మీరు నా మాట వినకపోతే, నా ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తించకపోతే,

[15] నా చట్టాలను తృణీకరిస్తే, నా న్యాయనిర్ణయాలను నిరాకరిస్తే, నా ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తించకుండా నా ఒడంబడిక అతిక్రమిస్తే,

[16] నేను మీకు ఈ విధంగా చేస్తాను: తాపజ్వరం, క్షయరోగం అనే భయంకరమైనవాటిని మీమీదికి రప్పిస్తాను. వాటివల్ల మీ కళ్ళు మసక బారతాయి. మీ ప్రాణాలు కృశించిపోతాయి. మీరు విత్తనాలు చల్లడం వల్ల లాభం ఉండదు. ఎందుకంటే మీ శత్రువులు వాటి పంట తింటారు.

[17] నేను మీకు విరోధినవుతాను. మీ శత్రువులు మిమ్ములను కూలగొట్టివేస్తారు. మిమ్ములను ద్వేషించేవాళ్ళు మీమీద పరిపాలన చేస్తారు. మిమ్ములను తరిమేవాళ్ళెవరూ లేకపోయినా మీరు పారిపోతారు.

[18] “ఇవన్నీ జరిగినా మీరింకా నా మాట వినకుండా ఉంటే, మీ పాపాల కారణంగా నేను మిమ్ములను ఇంకా ఏడంతలుగా దండిస్తాను.

[19] మీ మొండి గర్వాన్ని అణగగొట్టివేస్తాను. ఆకాశాన్ని ఇనుములాగా, భూమిని కంచులాగా చేస్తాను.

[20] మీ భూమి ఫలించదు. మీ దేశంలో చెట్లు కాపు కాయవు, గనుక మీ బలం వ్యర్థంగా ఉడిగిపోతుంది.

[21] “మీరు నన్ను ఎదిరించి, నా మాట వినడానికి ఇష్టపడకుండా ఉంటే, మీ పాపాల కారణంగా నేను మిమ్ములను బాధిస్తాను.

[22] మీ మధ్యకు దుష్టమృగాలను రప్పిస్తాను. అవి మీ పిల్లలను చంపివేస్తాయి. మీ పశువులను నాశనం చేస్తాయి. మిమ్ములను కొద్దిమందిగా చేస్తాయి. మీ త్రోవలు నిర్జనంగా ఉంటాయి.

[23] “ఈ శిక్షలవల్ల మీరు నా ఎదుట బాగుపడకుండా, నన్ను ఎదిరిస్తే,

[24] నేనూ మిమ్ములను ఎదిరిస్తాను. మీ పాపాల కారణంగా ఇంకా ఏడంతలుగా దండిస్తాను.

[25] మీమీదికి ఖడ్గం రప్పిస్తాను. ఆ ఖడ్గం నా ఒడంబడిక విషయం ప్రతిక్రియ చేస్తుంది. అప్పుడు మీరు మీ పట్టణాలలో గుమికూడితే మీ మధ్యకు ప్రాణాంతకమైన అంటురోగం రప్పిస్తాను. మీరు శత్రువుల వశం అవుతారు.

[26] ప్రాణాధారమైన మీ ఆహారం నేను తీసివేసిన తరువాత, పదిమంది స్త్రీలు మీకోసం భోజనం వండడానికి ఒకే పొయ్యి సరిపోతుంది. మీ భోజనం కొలత ప్రకారం మీకిస్తారు. దానిని తిన్నా మీకు తృప్తిగా ఉండదు.

[27] “ఇవన్నీ జరిగిన తరువాత కూడా మీరు నా మాట వినకుండా, నన్ను ఎదిరిస్తే

[28] నేనూ కోపాగ్నితో మిమ్ములను ఎదిరిస్తాను. నేనే మీ పాపాల కారణంగా ఏడంతలుగా మిమ్ములను దండిస్తాను.

[29] మీరు మీ కొడుకుల, కూతుళ్ళ శరీరాలను భక్షిస్తారు.

[30] అప్పుడు మీ ఎత్తయిన పూజాస్థలాలను నేను పాడు చేస్తాను. మీ సూర్యదేవతా విగ్రహాలను పడగొట్టిస్తాను. ప్రాణం లేని మీ విగ్రహాలమీద మీ శవాలను పడవేయిస్తాను. నేను మిమ్ములను నిరాకరిస్తాను.

[31] మీ పట్టణాలను నాశనం చేస్తాను. మీ పవిత్ర స్థలాలను పాడు చేస్తాను. మీ పరిమళ ధూపం వాసన చూడను.

[32] నేను మీ దేశాన్ని పాడు చేస్తాను. తరువాత దానిలో కాపురముండే మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపోతారు.

[33] మిమ్ములను ఇతర జనాలమధ్య చెదరగొట్టివేస్తాను. కత్తి దూసి మీ వెంట తరుముతాను. మీ దేశం పాడైపోతుంది, మీ పట్టణాలు శిథిలమైపోతాయి.

[34] “అప్పుడు మీ దేశం తన విశ్రాంతి కాలాలు అనుభవిస్తుంది. మీరు మీ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు, మీ దేశం పాడై ఉన్న రోజులన్నీ అది విశ్రమిస్తుంది.

[35] మీరు దానిలో నివసించినప్పుడు మీ విశ్రాంతి కాలాలలో అది అనుభవించని విశ్రాంతి అప్పుడు అనుభవిస్తుంది. అది పాడై ఉన్న రోజులన్నీ విశ్రమిస్తుంది.

[36] “మీలో మిగిలినవారు వారి శత్రువుల దేశాల్లో ఉన్నప్పుడు వారి హృదయాలలో అధైర్యం పుట్టిస్తాను. గాలికి కొట్టుకుపోతున్న ఆకు చప్పుడుకు వారు పరుగెత్తుతారు, ఖడ్గం ఎదుటనుంచి పారిపోయినట్టు వారు ఆ చప్పుడు విని పారిపోతారు. తరిమేవాళ్ళు లేకపోయినా వారు కూలుతారు.

[37] తరిమేవాళ్ళు లేకపోయినా ఖడ్గం నుంచి పారిపోయినట్టు వారు పారిపోతూ ఒకడిమీద ఒకడు పడిపోతారు. మీ శత్రువులయెదుట మీరు నిలబడలేకపోతారు.

[38] మీరు ఇతర జనాలమధ్య నాశనమవుతారు. మీ శత్రువుల దేశం మిమ్ములను తినివేస్తుంది.

[39] మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశాలలో తమ అపరాధాల కారణంగా కృశించి పోతారు.

[40] “వారు నన్ను ఎదిరించి ద్రోహం చేసినందువల్ల నేను వారిని ఎదిరించి వారి శత్రువుల దేశానికి పంపివేసిన తరువాత వారు తమ అపరాధాలు, తమ పూర్వీకుల అపరాధాలు ఒప్పుకుంటే

[41] అప్పుడు సున్నతి లేని వారి హృదయాలు అణగారిపోతే, తాము చేసిన అపరాధాలకు న్యాయమైన దండన పొందామని వారు ఒప్పుకుంటే,

[42] యాకోబుతో చేసిన ఒడంబడికను తలచుకొంటాను. కనాను దేశాన్ని కూడా తలచుకొంటాను.

[43] ఇస్రాయేల్ ప్రజలు లేనప్పుడు ఆ దేశం పాడైన స్థితిలో ఉంటుంది. అప్పుడది తన విశ్రాంతి కాలాలు అనుభవిస్తుంది. ఆలోగా వారు న్యాయమైన దండనకు గురి అవుతారు. ఎందుకంటే, వారు నా న్యాయనిర్ణయాలను తిరస్కరించిన వారుగా ఉంటారు. నా చట్టాలను నిరాకరించినవారుగా ఉంటారు. కాబట్టే ఇదంతా!

[44] అయినా వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు కూడా నేను వారిని తిరస్కరించను. పూర్తిగా నాశనం చేయాలని వారిని నిరాకరించను. అలా నా ఒడంబడికను వమ్ము చేయను. ఎందుకంటే నేను యెహోవాను వారి దేవుణ్ణి.

[45] ఇతర జనాలు చూస్తుండగానే నేను వారి పూర్వీకులను ఈజిప్ట్ దేశంనుంచి తీసుకు వచ్చాను. నేను వారికి దేవుడుగా ఉండాలని అలా చేశాను. వారి పూర్వీకులతో నేను చేసిన ఒడంబడికను వారి కోసం తలచుకొంటాను. నేను యెహోవాను.

[46] యెహోవా మోషే ద్వారా, సీనాయి పర్వతం మీద, తనకూ ఇస్రాయేల్ ప్రజకూ మధ్య నియమించిన చట్టాలు, న్యాయనిర్ణయాలు, ఆదేశాలు ఇవే.

లేవీయకాండం (యాజి ధర్మవిధులు) — Chapters