[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[2] “నీవు ఇస్రాయేల్ ప్రజతో ఈ విధంగా చెప్పాలి: యెహోవా ఆజ్ఞాపించిన విషయాలలో దేనినైనా ఎవరైనా పొరపాటున మీరి చెయ్యకూడని తప్పిదం చేస్తారనుకోండి.
[3] అలా చేసి ప్రజలమీదికి అపరాధం తెచ్చి పెట్టేవాడు అభిషేకం పొందిన యాజి అయితే అతడు తాను చేసిన ఆ పాపానికి బలి చేయాలి. లోపం లేని కోడెను యెహోవాకు పాపాలకోసం బలిగా సమర్పించాలి.
[4] అతడు ఆ కోడెను యెహోవా సన్నిధానంలోకి, సన్నిధిగుడారం ద్వారం దగ్గరికి తేవాలి. ఆ కోడె తలమీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధానంలో దాన్ని వధించాలి.
[5] అప్పుడు అభిషేకం పొందిన ఆ యాజి ఆ కోడె రక్తంలో కొంత సన్నిధిగుడారంలోకి తీసుకురావాలి.
[6] అక్కడ యాజి పవిత్ర స్థలంలో ఉన్న అడ్డ తెర ఎదుట యెహోవా సన్నిధానంలో తన వ్రేలు ఆ రక్తంలో ముంచి ఏడు సార్లు చిలకరించాలి.
[7] అప్పుడు ఆ యాజి యెహోవా సన్నిధానంలో సన్నిధిగుడారంలో ఉన్న సువాసన ధూపవేదికమీది కొమ్ములమీద ఆ రక్తంలో కొంత పూయాలి. మిగతా కోడె రక్తాన్నంతా సన్నిధిగుడారం ద్వారం దగ్గర ఉన్న హోమ బలిపీఠం అడుగున పోయాలి.
[8] ఆ తరువాత పాపాలకోసమైన బలిగా ఉన్న ఆ కోడె కొవ్వునంతా తీయాలి. పేగులను కప్పి ఉన్న కొవ్వునూ, పేగులమీది కొవ్వునంతటినీ
[9] రెండు మూత్రపిండాల దగ్గర ఉన్న కారిజం అంటి ఉన్న కొవ్వునూ తీయాలి;
[10] శాంతిబలిగా అర్పించే ఎద్దునుంచి తీసినట్టే యాజి వాటిని తీసి హోమ బలిపీఠంమీద వాటిని కాల్చివెయ్యాలి.
[11] కానీ ఆ కోడె చర్మాన్ని, దాని మాంసాన్నంతా, దాని తలనూ, కాళ్ళనూ, లోపలిభాగాలనూ, పేడనూ,
[12] ఆ కోడెనంతా శిబిరం బయట, బూడిద పారబోసే శుద్ధమైన చోటికి తీసుకుపోవాలి. అక్కడ బూడిద పారబోసే స్థలంలోనే దాన్ని కట్టెలమీద కాల్చివెయ్యాలి.
[13] “చెయ్యకూడదని యెహోవా ఆజ్ఞాపించిన విషయాలలో దేనినైనా ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతా పొరపాటున చేసి అపరాధులవుతారనుకోండి. ఆ సంగతి వారికి తెలియదనుకోండి.
[14] వారు చేసిన ఆ పాపం సమాజానికి తెలిసినప్పుడు వారు పాపాలకోసం బలిగా ఒక కోడెను అర్పించాలి; సన్నిధిగుడారం ఎదుటికి దాన్ని తీసుకురావాలి.
[15] అక్కడ సమాజ నాయకులు యెహోవా సన్నిధానంలో కోడెను వధించాలి.
[16] కోడె రక్తంలో కొంత, అభిషేకం పొందిన యాజి సన్నిధి గుడారంలోకి తీసుకురావాలి.
[17] ఆ యాజి ఆ రక్తంలో వ్రేలు ముంచి అడ్డతెర ఎదుట యెహోవా సన్నిధానంలో దాన్ని ఏడు సార్లు చిలకరించాలి.
[18] యెహోవా సన్నిధానంలో సన్నిధిగుడారంలో ఉన్న ధూపవేదిక కొమ్ములమీద కూడా ఆ రక్తంలో కొంత పూయాలి. మిగతా రక్తాన్నంతా సన్నిధిగుడారం ద్వారం దగ్గర ఉన్న హోమబలిపీఠం అడుగున పోయాలి.
[19] అతడు ఆ జంతువు కొవ్వంతా తీసి బలిపీఠంమీద కాల్చివెయ్యాలి.
[20] అలాగే ఈ కోడెను చెయ్యాలి. పాపాలకోసం బలిగా ఉన్న ఆ కోడెను చేసినట్టే దీన్ని చెయ్యాలి. ఈ విధంగా యాజి వారి పాపాన్ని కప్పివేస్తాడు. వారికి క్షమాపణ దొరుకుతుంది.
[21] అప్పుడు అతడు ఆ కోడెను శిబిరం బయటికి తీసుకువెళ్ళి, ఆ మొదటి కోడెను కాల్చినట్టు దీన్ని కాల్చాలి. ఇది సమాజానికి పాపాలకోసమైన బలి.
[22] “చెయ్యకూడదని తన దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన విషయాలలో దేనినైనా ఒక అధికారి పొరపాటున చేసి అపరాధి అవుతాడనుకోండి.
[23] తాను చేసిన ఆ పాపం తనకు తెలియవస్తే అతడు బల్యర్పణగా లోపం లేని మగ మేకను తీసుకురావాలి.
[24] అతడు ఆ మేక తలమీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధానంలో హోమ పశువులను వధించేచోట దాన్ని వధించాలి. అది పాపాలకోసం బలి.
[25] పాపాలకోసమైన ఆ బలి రక్తంలో కొంత యాజి తన వ్రేలితో తీసి బలిపీఠం మీది కొమ్ముల పై పూయాలి. మిగతా రక్తాన్నంతా హోమబలిపీఠం అడుగున పోయాలి.
[26] శాంతిబలి జంతువు కొవ్వును చేసినట్టే దీని కొవ్వునంతా ఆ బలిపీఠం మీద కాల్చివెయ్యాలి. ఇలా యాజి ఆ వ్యక్తి చేసిన ఆ పాపాన్ని కప్పివేస్తాడు. అతడికి క్షమాపణ దొరుకుతుంది.
[27] “చెయ్యకూడదని యెహోవా ఆజ్ఞాపించిన విషయాలలో దేనినైనా సామాన్య ప్రజల్లో ఎవరైనా పొరపాటున చేసి అపరాధి అవుతారనుకోండి.
[28] తాను చేసిన ఆ పాపం తనకు తెలియవస్తే ఆ పాపంకోసం ఆ వ్యక్తి లోపం లేని ఆడ మేకను బల్యర్పణగా తీసుకురావాలి.
[29] పాపాలకోసమైన ఆ జంతువు తలమీద చెయ్యి ఉంచి హోమబలి పశువులను వధించే చోట దాన్ని వధించాలి.
[30] దాని రక్తంలో కొంత యాజి తన వ్రేలితో తీసి హోమ బలిపీఠంపైన ఉన్న కొమ్ములమీద పూయాలి.
[31] శాంతిబలి పశువులనుంచి కొవ్వును తీసినట్టే దీని కొవ్వునంతా తీయాలి. యెహోవాకు పరిమళ హోమంగా యాజి దాన్ని బలిపీఠం మీద కాల్చివెయ్యాలి. ఇలా యాజి ఆ వ్యక్తి పాపాన్ని కప్పివేస్తాడు. ఆ వ్యక్తికి క్షమాపణ దొరుకుతుంది.
[32] “ఒకవేళ ఆ వ్యక్తి పాపాలకోసమైన బల్యర్పణగా ఒక గొర్రెను తీసుకువస్తే లోపం లేని ఆడ గొర్రెను తీసుకురావాలి.
[33] పాపాలకోసమైన ఆ బలి జంతువు తలమీద చెయ్యి ఉంచి, హోమ పశువులను వధించే చోట పాపాలకోసమై బలిగా దాన్ని వధించాలి.
[34] పాపాలకోసమైన ఈ బలి రక్తంలో కొంత యాజి తన వ్రేలితో తీయాలి, హోమ బలిపీఠం పైన ఉన్న కొమ్ములమీద పూయాలి. మిగతా రక్తాన్నంతా పీఠం అడుగున పోయాలి.
[35] శాంతిబలి జంతువునుంచి కొవ్వును తీసినట్టే దీని కొవ్వునంతా తీయాలి. యెహోవాకు హోమాలు అర్పించే చోట, ఆ బలిపీఠంమీద యాజి దాన్ని కాల్చివెయ్యాలి. యాజి ఆ వ్యక్తి చేసిన ఆ పాపాన్ని అలా కప్పివేస్తాడు. ఆ వ్యక్తికి క్షమాపణ దొరుకుతుంది.