[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[2] “ఇస్రాయేల్ ప్రజలు నాకు ప్రతిష్ఠించినవాటి విషయంలో అహరోను, అతడి కొడుకులు జాగ్రత్తగా ఉండి, నా పవిత్రమైన పేరుకు అపకీర్తి కలిగించకూడదని వారితో చెప్పు. నేను యెహోవాను.
[3] నీవు వారితో ఈ విధంగా చెప్పు – మీ తరతరాలకు, మీ సంతతివారందరిలో ఎవడైనా అశుద్ధంగా ఉన్నప్పుడు, ఇస్రాయేల్ ప్రజలు నాకు ప్రతిష్ఠించిన పవిత్రమైన వాటిని సమీపిస్తాడనుకోండి. అలాంటివాడు నా సన్నిధానంలో లేకుండా పోవాలి. నేను యెహోవాను.
[4] “అహరోను సంతానంలో ఎవడికైనా చర్మవ్యాధి గానీ, ఏదైనా స్రావం గానీ ఉంటే అలాంటివాడు శుద్ధమయ్యేవరకు పవిత్రమైనవాటిని తినకూడదు. ఎవడైనా శవం వల్ల అశుద్ధం అయిపోయిన దేనినైనా తాకితే, ఎవడికైనా వీర్యస్ఖలనం జరిగితే,
[5] ఎవడైనా అశుద్ధమైన పురుగును తాకితే, ఏదైనా అశుద్ధతవల్ల అశుద్ధంగా ఉన్న మనిషిని తాకితే అతడు అశుద్ధంగా ఉంటాడు.
[6] అలాంటి అశుద్ధత తగిలినవాడు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు. స్నానం చేసేవరకు అతడు పవిత్రమైన వాటిని తినకూడదు.
[7] పొద్దు క్రుంకిన తరువాత అతడు శుద్ధంగా ఉంటాడు. అప్పుడు పవిత్రమైనవాటిని తినవచ్చు. అతడి ఆహారం అదే గదా.
[8] చచ్చిన జంతువును గానీ పక్షిని గానీ, తినకూడదు. అలా తనను అశుద్ధంగా చేసుకోకూడదు. నేను యెహోవాను.
[9] గనుక పాటించమని నేను ఇచ్చిన ఆజ్ఞలను వారు పాటించాలి. పాటించకపోతే నా ఆలయాన్ని అపవిత్రపరచి, అపరాధులై, మరణశిక్షకు గురి అవుతారు. నేను వారిని ప్రత్యేకించుకొన్న యెహోవాను.
[10] “యాజి కాని వ్యక్తి ప్రతిష్ఠమైనదాన్ని తినకూడదు. యాజి ఇంట్లో ఉన్న అతిధి దాన్ని తినకూడదు, జీతగాడు తినకూడదు.
[11] కాని, యాజి వెల ఇచ్చి కొనుక్కొన్నవాడు, అతడి ఇంట్లో పుట్టిన దాసుడు, యాజి తినే ఆహారాన్ని తినవచ్చు.
[12] యాజి కూతురు యాజి కాని వాణ్ణి పెళ్ళాడితే ఆమె ప్రతిష్ఠితమైన అర్పణలలో దేనినీ తినకూడదు.
[13] అయితే యాజి కూతురి భర్త చనిపోతాడనుకోండి, లేక ఆమెను విడిచిపెడతాడనుకోండి, ఆమెకు సంతానం లేదనుకోండి. పసితనంలో లాగే ఆమె పుట్టింటికి తిరిగి చేరుకొంటే, తన తండ్రి ఆహారాన్ని తినవచ్చు. అయితే హక్కు లేనివారెవరూ దానిని తినకూడదు.
[14] అలాంటి వాడు పొరపాటున ప్రతిష్ఠితమైనదానిని తింటే, దాని విలువతో మరో అయిదో వంతు కలిపి యాజికివ్వాలి.
[15] ఇస్రాయేల్ ప్రజలు యెహోవాకు ప్రతిష్ఠించిన అర్పణలు తినేహక్కు లేని వ్యక్తిని యాజి తిననివ్వకూడదు. అలా వాటిని అపవిత్ర పరచకూడదు, అలాంటి వ్యక్తిని తిననివ్వడంవల్ల అతడిమీదికి అపరాధం, శిక్ష తెచ్చిపెట్టకూడదు.
[16] నేను యెహోవాను, అర్పణలను పవిత్ర పరచేవాణ్ణి.”
[17] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[18] “అహరోనుతో, అతడి కొడుకులతో, ఇస్రాయేల్ ప్రజలందరితో ఈ విధంగా చెప్పు: ఇస్రాయేల్ వంశీయులలో గానీ ఇస్రాయేల్ దేశంలోని విదేశీయులలో గానీ ఎవరైనా యెహోవాకు హోమబలిని అర్పించదలిస్తే – అది ఏ రకమైన స్వేచ్ఛార్పణ కానివ్వండి, మొక్కుబడి కానివ్వండి –
[19] ఆ బలి అంగీకారంగా ఉండాలంటే అతడు పశువులలో గానీ, గొర్రెమేకలలో గానీ లోపం లేని మగదానిని సమర్పించాలి.
[20] లోపం గలదాన్ని సమర్పించ కూడదు. అది మీకోసం అంగీకారంగా ఉండదు.
[21] ఎవరైనా మొక్కుబడి చెల్లించడానికి గానీ స్వేచ్ఛార్పణ అర్పించడానికి గానీ శాంతిబలిగా గొడ్లలోనుంచి లేదా గొర్రెమేకలలో నుంచి ఒకదానిని యెహోవాకు తెస్తాడనుకోండి. అది అంగీకారంగా ఉండాలంటే లోపం లేకుండా ఉండాలి. దానికి ఏ కళంకమూ ఉండకూడదు.
[22] గుడ్డిదానిని గానీ, కుంటిదానిని గానీ, అంగవైకల్యం గల దానిని గానీ, పుండు గల దానిని గానీ, గజ్జిగలదానిని గానీ, తామర గలదానిని గానీ యెహోవాకు సమర్పించ కూడదు. వాటిలో దేనినీ బలిపీఠం మీద హోమంగా యెహోవాకు సమర్పించ కూడదు.
[23] కురూపమైన కోడెను గానీ, గొర్రెమేకల మందలో ఒకదానిని గానీ స్వేచ్ఛార్పణగా అర్పించవచ్చు, అయితే అది మొక్కుబడిగా అంగీకారం కాదు.
[24] విత్తులు నులిమినదానిని గానీ, విరిగినదానిని గానీ, చితికినదానిని గానీ, కోసినదానిని గానీ యెహోవాకు అర్పించకూడదు. మీ దేశంలో అలాంటిది అర్పించకూడదు.
[25] అలాంటివాటిలో దేనినైనా విదేశీయుడు తెస్తే మీరు దాన్ని తీసుకొని మీ దేవునికి చెందిన ఆహారంగా అర్పించకూడదు. అలాంటివి లోపం గలవి. వాటికి కళంకం ఉంది, అవి మీకోసం అంగీకారంగా ఉండవు.”
[26] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[27] “దూడ గానీ, గొర్రెపిల్ల గానీ, మేకపిల్ల గానీ పుడితే అది ఏడు రోజులు దాని తల్లితో ఉండాలి. అయితే ఎనిమిదో రోజు మొదలుకొని అది యెహోవాకు హోమబలిగా అంగీకారం.
[28] ఆవును గానీ, గొర్రెను గానీ, మేకను గానీ దాని పిల్లలతోపాటు ఒకే రోజున వధించకూడదు.
[29] మీరు కృతజ్ఞతాబలిని అర్పించేటప్పుడు నేను మిమ్ములను అంగీకరించేలా దానిని సరైన విధంగా అర్పించాలి.
[30] అర్పించిన రోజే దాన్ని తినివేయాలి. మరుసటి రోజువరకు దానిలో కొంచెమైనా మిగల్చకూడదు. నేను యెహోవాను.
[31] మీరు నా ఆజ్ఞలు శిరసావహించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి. నేను యెహోవాను.
[32] నా పవిత్రమైన పేరుకు అపకీర్తి కలిగించకూడదు. ఇస్రాయేల్ ప్రజలలో నా పేరు పవిత్రమై ఉండాలి. నేను యెహోవాను, మిమ్ములను పవిత్రం చేసేవాణ్ణి.
[33] నేను మీకు దేవుణ్ణయి ఉండేందుకు మిమ్ములను ఈజిప్ట్ దేశం నుంచి తీసుకువచ్చిన యెహోవాను.”