[1] ఆ తరువాత అహరోను కొడుకులు నాదాబు, అబీహు తమ ధూపార్తులను చేతపట్టుకొని వాటిలో నిప్పు ఉంచి ధూప ద్రవ్యాన్ని వేశారు. ఈ నిప్పు యెహోవా తమకాజ్ఞాపించని వేరే నిప్పు.
[2] అందుచేత యెహోవా సన్నిధానంనుంచి మంటలు వచ్చి వారిని కాల్చివేశాయి. అలాగే వారు యెహోవా సన్నిధానంలో చనిపోయారు.
[3] అప్పుడు మోషే అహరోనుతో అన్నాడు, “ఇది యెహోవా చెప్పిన మాట – నన్ను సమీపించిన వారిపట్ల నా పవిత్రతను కనుపరుస్తాను. ప్రజలందరి ఎదుట నా మహిమను వెల్లడి చేస్తాను.” అహరోను మౌనం వహించాడు.
[4] అప్పుడు అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేల్ కొడుకులను మోషే పిలిపించాడు. వారు మిషాయేల్, ఎల్‌సాఫాను. అతడు వారితో, “దగ్గరకు రండి. పవిత్ర స్థలం ఎదుటనుంచి శిబిరం బయటకి మీ దాయాదులను తీసుకుపోండి” అన్నాడు.
[5] మోషే చెప్పినట్టు వారు దగ్గరకు వచ్చి చొక్కాలతోనే వాళ్ళను శిబిరం బయటకి మోసుకుపొయ్యారు.
[6] అహరోనుతోను, అతడి కొడుకులు ఎలియాజరు, ఈతామారులతోను మోషే ఇలా అన్నాడు: “మీరు చావకుండేలా, యెహోవా ఈ సమాజమంతటిమీదా కోపపడకుండేలా, మీరు తల విరబోసుకోకూడదు, వేసుకొన్న బట్టను చింపుకోకూడదు. కాని, యెహోవా కాల్చివేసిన వాళ్ళ విషయం మీ సోదరులు అంటే ఇస్రాయేల్ వంశస్థులందరూ ఏడ్వవచ్చు.
[7] మీరైతే చావకుండేలా సన్నిధిగుడారం ద్వారం విడిచి వెళ్ళకూడదు. యెహోవా అభిషేకతైలం మీ మీద ఉంది గదా!” మోషే చెప్పిన మాట ప్రకారమే వారు చేశారు.
[8] యెహోవా అహరోనుతో అన్నాడు,
[9] “మీరు చావకుండేలా నీవూ నీ కొడుకులూ సన్నిధిగుడారంలోకి వచ్చేటప్పుడు ద్రాక్ష మద్యం గానీ, మరే మద్యం గానీ తాగకూడదు. ఇది మీ తరతరాలకు ఎప్పటికీ నిలిచివుండే చట్టం.
[10] మీరు ప్రతిష్ఠమైన దానినుంచి లౌకికమైనదాన్ని ప్రత్యేకపరచాలి. శుద్ధమైనదాని నుంచి అశుద్ధమైనదాన్ని వేరు చెయ్యాలి.
[11] యెహోవా మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించిన శాసనాలన్నీ మీరు వారికి నేర్పాలి. గనుక ఆ సమయాలలో ద్రాక్షమద్యం గానీ, మరే మద్యం గానీ తాగకూడదు.”
[12] మోషే అహరోనుతోను, మిగిలిన అతడి కొడుకులు ఎలియాజరు, ఈతామారులతోను ఇలా అన్నాడు: “యెహోవా హోమ వస్తువులలో మిగతా నైవేద్యాన్ని మీరు తీసుకొని బలిపీఠం దగ్గర తినండి. పొంగజేసే పదార్థం లేకుండా దాన్ని తినండి. అది అతి పవిత్రం.
[13] యెహోవా హోమాలలో అది నీకూ నీ కొడుకులకూ నియామక భాగం. యెహోవా నన్ను అలా ఆదేశించాడు. గనుక మీరు ఒక పవిత్రమైన చోట దాన్ని తినాలి.
[14] కదలిక అర్పణగా ఉన్న ఆ బోరనూ ప్రతిష్ఠ చేసిన ఆ తొడనూ కూడా ఒక శుద్ధమైన చోట తినాలి – నీవూ, నీతోపాటు నీ కొడుకులూ కూతుళ్ళూ తినాలి. ఇస్రాయేల్ ప్రజలు తెచ్చిన శాంతి బలులలో నుంచి అవి నీకూ నీ సంతానానికీ నియామక భాగం.
[15] కొవ్వును హోమంగా అర్పించేటప్పుడు బోరను కదలిక అర్పణగా యెహోవా సన్నిధానంలో అటూ ఇటూ కదల్చి తొడను ప్రతిష్ఠిస్తారు గదా. అవి నీకూ నీ సంతానానికీ నియామక భాగం – ఇది ఎప్పటికీ నిలిచివుండే చట్టం – ఇది యెహోవా ఆజ్ఞ.”
[16] తరువాత పాపాలకోసమైన మేక బలిని గురించి మోషే అడిగినప్పుడు అంతకుముందు వారు దాన్ని కాల్చివేశారని తెలిసింది. అహరోను మిగిలిన కొడుకులు ఎలియాజరు, ఈతామారులమీద మోషేకు కోపం వచ్చింది.
[17] అతడు వారితో అన్నాడు “పాపాల కోసమైన బలి మాంసం పవిత్ర స్థానంలో మీరెందుకు తినలేదు? అది అతి పవిత్రం గదా! యెహోవా దాన్ని ఎందుకు నియమించాడు? సమాజ అపరాధాన్ని మీరు భరించి ఆయన సన్నిధానంలో వారి పాపాలను కప్పివేయడానికే గదా.
[18] ఇదిగో, పవిత్ర స్థలంలోకి దాని రక్తాన్ని తేవలెను, గనుక నేను ఆజ్ఞాపించి నట్టే తప్పకుండా పవిత్ర స్థలంలో దాని మాంసం తినవలసిందే.”
[19] అహరోను మోషేతో మాట్లాడాడు – “ఇదిగో విను. ఈ రోజు వారు పాపాలకోసమైన తమ బలినీ హోమాన్నీ యెహోవా సన్నిధానంలో అర్పించారు. అయినా ఇలాంటి విపత్తులు నాకు జరిగాయి. ఒకవేళ పాపాలకోసమైన బలిమాంసం నేను ఈ రోజు తింటే అది యెహోవాకు అంగీకారమా?” అన్నాడు.
[20] మోషే అది విని ఒప్పుకొన్నాడు.