[1] అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
[2] “అవును, నీవు చెప్పేది సత్యమే అని నాకు తెలుసు. అయితే మానవుడు దేవుని దృష్టిలో ఎలా నిర్దోషిగా ఉండగలడు?
[3] ఒక మనిషి దేవునితో వాదించలేడు. దేవుడు వెయ్యి ప్రశ్నలు అడుగవచ్చు. కానీ ఒక్కదానికి కూడా ఏ మనిషీ జవాబు యివ్వలేడు.
[4] దేవుని జ్ఞానం లోతైనది, ఆయన శక్తి గొప్పది. దేవునితో పోరాడిన ఏ మనిషీ బాధపడకుండా తప్పించుకోలేడు.
[5] దేవుడు పర్వతాలను కదిలిస్తాడు. కాని వాటికి తెలియదు. ఆయనకు కోపం వచ్చినప్పుడు పర్వతాలను తలక్రిందులు చేస్తాడు.
[6] భూమిని కంపింప చేయటానికి దేవుడు భూకంపాలను పంపిస్తాడు. భూమి పునాదులను దేవుడు కంపిపజేస్తాడు.
[7] దేవుడు సూర్యునితో మాట్లాడి దానిని ఉదయించకుండా చేయగలడు. ప్రకాశించకుండా, నక్షత్రాలకు ఆయన తాళం వేసి పెట్టగలడు.
[8] దేవుడే ఆకాశాలను చేశాడు. మహాసముద్ర తరంగాల మీద ఆయన నడుస్తాడు.
[9] “స్వాతి, మృగశీర్షము, కృత్తిక అనేవాటిని చేసినవాడు ఆయనే. దక్షిణ ఆకాశాన్ని దాటిపోయే గ్రహాలను ఆయన చేశాడు.
[10] మనుష్యులు గ్రహించలేని ఆశ్చర్యకర కార్యాలను దేవుడు చేస్తాడు. దేవుని మహా అద్భుతాలకు అంతం లేదు.
[11] దేవుడు నన్ను దాటి వేళ్లేటప్పుడు నేను ఆయనను చూడలేను. దేవుడు పక్కగా వెళ్లేటప్పుడు ఆయన గొప్పతనాన్ని నేను గ్రహించలేను.
[12] దేవుడు దేనినై నా తీసివేస్తే, ఏ ఒక్కరూ ఆయన్ని వారించలేరు. ‘ఏమిటి నీవు చేస్తున్నది?’ అని ఎవ్వరూ ఆయనతో అనలేరు.
[13] దేవుడు తన కోపాన్ని తగ్గించుకోడు. రాహాబు సహాయకులకు కూడా దేవుడంటే భయం.”
[14] యోబు ఇంకా ఇలా చెప్పాడు: “కనుక నేను దేవునితో వాదించలేను. ఆయనతో వాదించేందుకు నేను వాడాల్సిన మాటలు నాకు తెలియవు.
[15] యోబు అనే నేను నిర్దోషిని. కానీ ఆయనకు నేను జవాబు ఇవ్వలేను. నా న్యాయమూర్తిని (దేవుని) ప్రాధేయపడడం మాత్రమే నేను చేయగలిగింది అంతా.
[16] ఒకవేళ నేను ఆయనకు మొరపెట్టినా, ఆయన జవాబిచ్చినా, దేవుడు నా ప్రార్థన విన్నాడని నేను నమ్మను.
[17] నన్ను అణచివేయటానికి దేవుడు తుఫానులు పంపిస్తాడు. ఏ కారణం లేకుండానే ఆయన నాకు ఇంకా ఎక్కువ గాయాలు కలిగిస్తాడు.
[18] దేవుడు నన్ను మళ్లీ శ్వాస పీల్చనీయడు. ఆయన నన్ను ఇంకా ఎక్కువ కష్టపెడతాడు.
[19] నేను దేవుణ్ణి ఓడించలేను. దేవుడు శక్తిమంతుడు. దేవుని న్యాయస్థానానికి వెళ్లి నాకు న్యాయం చేకూర్చేటట్టు నేను చేయలేను. దేవుణ్ణి న్యాయస్థానానికి రమ్మని ఆయనను ఎవరు బలవంతం చేస్తారు?
[20] యోబు అనే నేను నిర్దోషిని, కాని నేను చెప్పే మాటలు నేను దోషిలా కనబడేటట్టు చేస్తాయి. కనుక, నేను నిర్దోషిని, కాని నా నోరు నేను దోషిని అని ప్రకటిస్తుంది.
[21] నేను నిర్దోషిని, కాని నన్ను గూర్చి నేను లక్ష్య పెట్టను. నా సోంత జీవితం నాకు అసహ్యం.
[22] జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కనుక ‘దేవుడు నిర్దోషులను, దుర్మార్గులను కూడా నాశనం చేస్తాడు’ అని నేను తలస్తాను.
[23] ఏదో ఒక దారుణం జరిగి ఒక నిర్దోషి అకస్మాత్తుగా చనిపోయినప్పుడు అతని శ్రమను చూసి దేవుడు నవ్వుతాడు.
[24] భూమిని దుర్మార్గుడు చేజిక్కించుకున్నప్పుడు దేవుడు న్యాయమూర్తులను గుడ్డివాళ్లను చేస్తాడా? ఇది దేవుడు చేయకపోతే ఇంకెవరు చేశారు?
[25] “పరుగెత్తేవాని కంటె వేగంగా నా రోజులు గడిచి పోయాయి. నా రోజులు ఎగిరిపోతున్నాయి, వాటిలో సంతోషం లేదు.
[26] జమ్ము పడవలు పోయేలా నా రోజులు వేగంగా పోతున్నాయి. పక్షిరాజులు తాము పట్టుకొన్న జంతువుల మీదికి దూసుకు వచ్చినట్టుగా నా రోజులు వేగంగా గడిచి పోతున్నాయి.
[27] “నేను ఆరోపణలు చేయను, ‘నేను నా బాధ మరచిపోతాను, నా ముఖం మార్చుకొని, నవ్వుతూ ఉంటాను’ అని ఒక వేళ నేను చెప్పినా,
[28] నాకు నా శ్రమ అంతటిని గూర్చి ఇంకా భయమే. ఎందుకంటే నేను దోషిని అని దేవుడు ఇంకా చెబుతున్నాడని నాకు తెలుసు గనుక.
[29] నేను దోషిని అని ఇది వరకే తీర్పు తీర్చబడింది. కనుక నేను ఇంకా ఎందుకు వ్రయత్నిస్తూ ఉండాలి. పోనీ దానిని, ‘మర్చిపో’ అని అంటాను నేను.
[30] మంచుతో నన్ను నేను కడుగుకొన్నా, సబ్బుతో నేను నా చేతులు కడుగుకొన్నా
[31] దేవుడు నన్ను చావు గోతిలొ పడవేస్తాడు. అప్పుడు నా వస్త్రాలే నన్ను ద్వేషిస్తాయి.
[32] దేవుడు నాలా మనిషి కాడు. అందుకే నేను ఆయనకు జవాబు ఇవ్వలేను. న్యాయస్థానంలో మేము ఒకరి నొకరం కలుసుకొలేం.
[33] మాకు మధ్య నిలబడేందుకు ఎవరైనా ఉంటే బాగుండును. మా ఇద్దరికీ న్యాయంగా తీర్పు తీర్చేవారు ఎవరైనా ఉంటే బాగుండును.
[34] దేవుని శిక్షా దండాన్ని తీసువేసుకొనే వారు ఎవరైనా ఉంటే బాగుండును. అప్పుడు దేవుడు నన్ను ఇంకెంత మాత్రము భయపెట్టడు.
[35] అప్పుడు నేను దేవునికి భయపడకుండా నేను చెప్పదలచుకొన్నది చెప్పగలుగుతాను. కానీ ఇప్పుడు నేను అలా చేయలేను.