[1] యోబు ఈ విధంగా చెప్పాడు: “మనమందరం కష్టంతో నిండిన కొద్దిపాటి జీవితం కోసమేపుట్టాం.
[2] మనిషి జీవితం పువ్వులాంటిది. అతడు త్వరగా పెరిగి, తర్వత చస్తాడు. కొంచెం సేపు ఉండి, ఆ తర్వాత ఉండని నీడలాంటిది మనిషి జీవితం.
[3] దేవా, నీవు అలాంటి మనిషిని గమనిస్తావా? నీతో తీర్పు పొందటానికి నన్ను నీ ముందుకు తీసుకొనిరమ్ము.
[4] “మురికి దానిలొ నుండి శుభ్రమైన దాన్ని ఎవరు తీయగలరు? ఎవ్వరూ తీయలేరు.
[5] నరుని జీవితం పరిమితం. దేవా, నరుని మాసాల సంఖ్య నీవు నిర్ణయం చేశావు. నరుడు మార్చజాలని హద్దులు నీవు ఉంచావు.
[6] కనుక దేవా, నరునికి దూరంగా చూడు. వానిని ఒంటరిగా విడిచిపెట్టు. అతని కాలం తీరేవరకు అతని కష్టజీవితం అతణ్ణి అనుభవించనివ్వు.
[7] “అయితే ఒక చెట్టుకు నీరీక్షణ ఉంది. దాన్ని నరికివేస్తే, అది మరల పెరుగుతుంది. అది కొత్త కొమ్మలు వేస్తూనే ఉంటుంది.
[8] భూమిలో దాని వేర్లు పాతవైపోవచ్చును. దాని మొద్దు మట్టిలో చీకిపోవచ్చును.
[9] కానీ నీళ్లు ఉంటే అది కొత్త చిగుళ్లు వేస్తుంది. మొక్కల్లా అది కొమ్మలు వేస్తుంది.
[10] అయితే మనిషి మరణిస్తాడు. అతని శరీరం పాతి పెట్టబడుతుంది. మనిషి చనిపోయినప్పుడు, అతుడు వెళ్లిపోయాడు.
[11] సముద్రంలో నీరు ఇంకిపోయినట్టు, ఒక నది నీరు ఎండిపోయినట్టు
[12] సరిగ్గా అదే విధంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు, అతడు పండుకొని, మళ్లీ లేవలేడు. మరణించే మనుష్యులు, ఆకాశాలు ఉండకుండా పోయేంత వరకు మేల్కొనరు, నిద్రించటం మానుకోరు.
[13] “మీరు నన్ను నా సమాధిలో దాచిపెడితే బాగుండునని నా (యోబు) ఆశ. నీ కోపం పోయేవరకు, నీవు నన్ను అక్కడ దాచిపెడితే బాగుండు ననిపిస్తుంది నాకు. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనేందుకు నీవు ఒక సమయాన్ని ఏర్పరచు కోవచ్చు
[14] ఒక మనిషి మరణిస్తే, అతడు మరల బతుకుతాడా? నేను వేచి ఉంటాను, నేను విడుదల అయ్యేంత వరకు కష్టపడి పోరాడుతాను.
[15] దేవా, నీవు నన్ను పిలుస్తావు, నేను (యోబు) నీకు జవాబు ఇస్తాను. నన్ను నీవు చేశావు, నన్ను నీవు కోరుతావు
[16] అప్పుడు నేను వేసే ప్రతి అడుగూ నీవు గమనిస్తావు. కానీ, నేను చేసిన పాపాలు నీవు జ్ఞాపకం చేసుకోవు.
[17] నీవు నా పాపాలు ఒక సంచిలో కట్టివేసి, దూరంగా పారవేయి.
[18] “సరిగ్గా ఒక పర్వతం కూలిపోయినట్టు ఒక బండదాని స్థలం నుండి తొలగించబడినట్టు
[19] నీళ్లు రాళ్లను కడిగివేసి వాటిని అరగ దీసినట్టు, నీళ్లు నేలమీద మట్టిని కొట్టుకుపోవునట్లు, అదే విధంగా, దేవా నీవు ఒక మనిషి ఆశను నాశనం చేస్తావు.
[20] నీవు మనిషిని ఒకసారి ఓడించి ముగిస్తే మనిషి పోయినట్టే. నీవు వాని ముఖాన్ని చావు ముఖంగా మార్చివేసి శాశ్వతంగా వానిని పంపించివేస్తావు.
[21] వాని కుమారులు గౌరవించబడినా అది ఎన్నటికీ అతనికి తెలియదు. అతని కుమారుడు చెడు చేస్తే అతడు ఎన్నటికీ దానిని చూడడు.
[22] మనిషి తన స్వంత శరీరంతో బాధ అనుభవిస్తాడు. అతడు తన కోసమే ఎక్కువగా దుఃఖిస్తాడు.”