Skip to content
Opens in a new window

[1] అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:

[2] “యోబూ! నా తలంపులు నాకు జవాబిస్తాయి. నేను అనుకొంటున్నది ఏమిటో నేను త్వరపడి నీకు చెప్పాలి.

[3] మేము చెప్పిన దానికి నీవు ఇచ్చిన జవాబులు మాకు అవమానకంగా ఉన్నాయి. కానీ నేను జ్ఞానం గలవాడను, నీకు ఎలా జవాబు ఇవ్వాలో నాకు ెతెలుసు.

[4] “మొట్ట మొదటిసారిగా ఆదాము భూమి మీద చేయ బడినప్పటి నుండి ఒక దుర్మార్గుని సంతోషం ఎక్కువ సేపు ఉండదు అనే విషయం చాలా కాలంగా నీకు తెలిసిందే. దేవుని లక్ష్యపెట్టని వాని ఆనందం కొంతసేపు మాత్రమే ఉంటుంది.

[6] ఒకవేళ దుర్మార్గుని గర్వం ఆకాశాన్ని అంటవచ్చు. అతని తల మేఘాలను తాకవచ్చు.

[7] కానీ అతని స్వంత మలం పోయినట్లే అతడు శాశ్వతంగా పోతాడు. అతన్ని ఎరిగిన ప్రజలు, ‘అతడు ఎక్కడ?’ అని అన్నారు.

[8] ఒక కల వేగంగా ఎగిరిపోయినట్టు అతడు ఎగిరి పోతాడు. ఏ మనిషీ మరల అతణ్ణి చూడడు. అతడు పోయి ఉంటాడు. రాత్రి పూట పీడకలలా అతడు విదిలించబడతాడు.

[9] అతనిని చూచిన మనుష్యులు అతన్ని మరల చూడరు అతని కుటుంబం అతన్ని మరల ఎన్నడూ చూడదు.

[10] దుర్మార్గుని పిల్లలు, పేదవారి దగ్గర అతడు తీసుకొన్న వాటిని తిరిగి ఇచ్చివేస్తారు. దుర్మార్గుని స్వహస్తాలే తన ఐశ్వర్యాన్ని తిరిగి ఇచ్చివేయాలి.

[11] అతడు యువకునిగా ఉన్నప్పుడు, అతని శరీరం బలంగా ఉంది. కాని త్వరలోనే అది మట్టి ఆవుతుంది.

[12] “దుర్మార్గుని నోటిలో దుర్మార్గం తియ్యగా ఉంటుంది. అతడు దానిని తన నాలుక కింద దాచిపెడతాడు.

[13] చెడ్డ మనిషి తన దుర్మార్గాన్ని అలాగే పెట్టుకొని ఉంటాడు. దానిని పోనియ్యటం అతనికి అసహ్యం. కనుక అతడు దానిని తియ్యని పదార్థంవలె తన నోటిలో ఉంచుకొంటాడు.

[14] కానీ అతని భోజనం అతని కడుపులో విషం అవుతుంది. అది అతని లోపల చేదు విషంలా, పాము విషంలా అవుతుంది.

[15] దుష్టుడు ఐశ్వర్యం దిగమింగాడు. కానీ అతడు వాటిని కక్కివేస్తాడు. అవును, దుష్టుని కడుపు వాటిని కక్కివేసేట్టుగా దేవుడు చేస్తాడు.

[16] దుష్టుడు పాముల విషం పీల్చుతాడు. పాము కోరలు వానిని చంపివేస్తాయి.

[17] అప్పుడు నదులు తేనెతో, వెన్నతో ప్రవహించటం చూచి దుష్టుడు ఆనందించ లేడు.

[18] దుష్టుడు తన లాభాలను ఇచ్చివేసేలా బలాత్కారం చేయబడతాడు. అతని కష్టార్జితం అనుభవించటానికి అతనికి అనుమతి ఇవ్వబడదు.

[19] దుష్టుడు పేద ప్రజలను సక్రమంగా చూడలేదు గనుక. అతడు వారి విషయమై పట్టించుకోలేదు, మరియు అతడు వారి వస్తువులను తీసుకొన్నాడు. ఇంకెవరో కట్టిన ఇండ్లు అతడు తీసివేసుకొన్నాడు.

[20] దుష్టునికి ఎన్నటికీ తృప్తిలేదు. వాని ఐశ్వర్యం వానిని రక్షించలేదు.

[21] అతడు భోజనం చేసినప్పుడు ఏమీ మిగలదు. అతని విజయం కొనసాగదు:

[22] దుర్మార్గునికి సమృద్ధిగా ఉన్నప్పటికీ అతడు కష్టంతో కృంగిపోతాడు. అతని సమస్యలు అతని మీదకు దిగి వస్తాయి.

[23] దుర్మార్గుడు తనకు కావలసినదంతా తినివేసిన తర్వాత దేవుడు తన కోపాన్ని ఆ మనిషి మీదకి మళ్లిస్తాడు. దుర్మార్గుని మీద దేవుడు శిక్షా వర్షం కురిపిస్తాడు.

[24] ఒకవేళ దుర్మార్గుడు ఇనుప ఖడ్గం నుండి పారి పోతాడేమో కానీ ఒక ఇత్తడి బాణం వానిని కూల గొడుతుంది.

[25] ఆ ఇత్తడి బాణం అతని శరీరం అంతటిలో గుచ్చుకొని పోయి అతని వీపులో నుండి బయటకు వస్తుంది. ఆ బాణం యొక్క మెరుపు కొన అతని కాలేయంలో గుచ్చుకు పోతుంది. అతడు భయంతో అదిరిపోతాడు.

[26] అతని ఐశ్వర్యాలన్నీ నాశనం చేయబడుతాయి. ఏ మనిషీ ఆరంభించని ఒక అగ్ని అతణ్ణి నాశనం చేస్తుంది. అతని ఇంటిలో మిగిలివున్నదాన్ని అగ్ని నాశనం చేస్తుంది.

[27] దుర్మార్గుడు దోషి అని ఆకాశం రుజువు చేస్తుంది. భూమి అతనికి విరోధంగా సాక్ష్యం ఇస్తుంది.

[28] అతని ఇంట్లో ఉన్న సమస్తం దేవుని కోప ప్రవాహంలో కొట్టుకొని పోతుంది.

[29] దుర్మార్గానికి దేవుడు చేయాలని తలపెడుతోంది అదే. దేవుడు వారికి ఇవ్వాలని తలస్తోంది అదే.”

యోబు — Chapters