[1] ఎలీహు మాట్లాడటం కొనసాగించాడు. అతడు అన్నాడు:
[2] “యోబూ, నీవు యోబు అనే నేను ‘దేవునికంటె ఎక్కువ సక్రమంగా ఉన్నాను’ అని చెప్పటం న్యాయం కాదు.
[3] యోబూ, నీవు దేవుణ్ణి, ‘దేవా, ఒక మనిషి, దేవుని సంతోష పరచుటవలన ఏమి పొందుతాడు? నా పాపం నిన్నెలా బాధిస్తుంది? నేను పాపం చేయక పోతే నాకేం మంచి లభిస్తుంది?’ అని అడుగు.
[4] “యోబూ, ఎలీహు అనే నేను నీకు, ఇక్కడ నీతో ఉన్న స్నేహితులకు జవాబు ఇవ్వగోరుతున్నాను.
[5] యోబూ, పైన ఆకాశం చూడు. పైకి చూచి, మేఘాలు నీకంటే ఎత్తుగా ఉన్నాయని తెలుసుకో.
[6] యోబూ, నీవు పాపం చేస్తే అది దేవుణ్ణి బాధ పెట్టదు. ఒకవేళ నీ పాపాలు చాలా ఉంటే అవి దేవునికి ఏమీ చేయలేవు.
[7] యోబూ, నీవు మంచివానిగా ఉంటే అదేమి దేవునికి సహాయం చేయదు. నీనుండి దేవునికి ఏమీ రాదు.
[8] యోబూ, నీవు చేసే మంచిచెడ్డలు నీలాంటి వాళ్లను మాత్రమే బాధిస్తాయి. (అవి దేవునికి సహాయకారి కావు మరియు దేవుణ్ణి బాధించవు.)
[9] “మనుష్యులు దుర్మార్గంగా, అన్యాయంగా పరామర్శించబడితే సహాయం కోసం వారు మొరపెడతారు. శక్తివంతమైన వాళ్లు తమకు సహాయాన్ని చేయాలని వారు బతిమలాడుతారు.
[10] కానీ సహాయం కోసం వారు దేవుని వేడుకోరు. ‘నన్ను తయారు చేసి, నా ఆనందం కోసం రాత్రులలో పాటలు ఇచ్చినటువంటి దేవుడెక్కడ? అని ఎవరూ అనరు.
[11] సహాయం కోసం వారు దేవుని అడగరు. దేవుడే మనుష్యుల్ని జ్ఞానం గల వారినిగా చేశాడు. జంతువులను, పక్షులను దేవుడు జ్ఞానంగల వాటినిగా చేయలేదు.’
[12] “కాని చెడ్డవాళ్లు గర్వంగా ఉంటారు. కనుక వారు సహాయం కోసం దేవునికి మొరపెడితే దేవుడు వారికి జవాబు ఇవ్వడు.
[13] వారి పనికిమాలిన విన్నపం దేవుడు వినడు, అదినిజం. సర్వశక్తిగల దేవుడు వారిపట్ల శ్రద్ధ చూపడు.
[14] యోబూ, అదే విధంగా దేవుడు నీకు కనబడలేదని నీవు చెప్పినప్పుడు, దేవుడు నీ మాట వినడు. దేవుణ్ణి కలుసుకొని, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించు కొనే అవకాశంకోసం నిరీక్షిస్తున్నానని నీవు అంటున్నావు.
[15] “యోబూ, దేవుడు దుర్మార్గులను శిక్షించడనీ, పాపాన్ని దేవుడు లక్ష్యపెట్టడనీ నీవు తలస్తున్నావు.
[16] కనుక యోబు తన పనికిమాలిన మాటలు కొనసాగిస్తున్నాడు. యోబు మాట్లాడుతోంది ఏమిటో అతనికే తెలియదు.”