Skip to content
Opens in a new window

[1] అప్పుడు తేమానువాడైన ఎలీఫజు జవాబు యిచ్చాడు:

[2] “దేవునికి నరుడు ఉపకారికాగలడా? జ్ఞానం గల వ్యక్తి తప్పక తనకు తానే ఉపయోగికారిగా వుంటాడు.

[3] ఒకవేళ నీవు సక్రమమయినదే చేసినప్పటికీ, సర్వ శక్తిమంతుడైన దేవునికి అది సంతోషం కలిగించదు. నీవు ఎల్లప్పుడూ మంచివాడివిగానే వున్నా దేవునికి ఏమీ లాభంలేదు.

[4] యోబూ, దేవుడు నిన్ను శిక్షించినది ఆయనను నీవు ఆరాధించినందుకా?

[5] కాదు, అది నీవు విస్తారంగా పాపం చేసినందువల్లనే. యోబూ, నీ పాపాలు ఎప్పటికీ నిలిచిపోవు.

[6] యోబూ, నీ సోదరులు నీకు ఋణపడి ఉన్న ధనాన్ని నీకు తిరిగి చెల్లించేందుకు నీవు వారిని బలవంతం చేశావు. అది కారణం లేకుండా నీవు చేశావు. ప్రజల దగ్గర్నుండి వస్తాలు నీవు లాగేసు కొని, వారు ధరించటానికి ఏమీ లేకుండా చేశావు.

[7] అలసిపోయిన మనుష్యలకు నీవు నీళ్లు ఇవ్వలేదు. ఆకలిగొన్న మనుష్యలకు నీవు అన్నం పెట్టలేదు.

[8] యోబూ! నీవు అధికారం, ఐశ్వర్యం గలవాడవై నప్పటికీ నీవు ఆ ప్రజలకు సహాయం చేయలేదు. నీకు చాలా భూమి ఉంది, నీవు చాలా గౌరవం పొందినవాడవు.

[9] కాని విధవలకు నీవు ఏమీ ఇవ్వకుండానే వారిని పంపించివేశావు. యోబూ! అనాధ పిల్లలను నీవు దోచుకొని నీవు వారి యెడల చెడుగా ప్రవర్తించావు.

[10] అందుకే నీ చుట్టూరా బోనులు ఉన్నాయి. మరియు ఆకస్మిక కష్టం నిన్ను భయ పెడుతుంది.

[11] అందుకే నీవు చూడలేనంత కటిక చీకటిగా ఉంది. మరియు అందుకే నీళ్ల ప్రవాహం నిన్ను కప్పేస్తుంది.

[12] “ఆకాశంలో అతి ఉన్నత స్థానంలో దేవుడు నివసిస్తాడు. మహా ఎత్తయిన నక్షత్రాలను దేవుడు వంగి కిందికి చూస్తాడు. నక్షత్రాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో నీవు చూడగలవు.

[13] కాని యోబూ, ‘నీవు దేవునికి ఏమీ తెలియదు! అంధకార మేఘాల్లోంచి దేవుడు మాకు ఎలా తీర్పు తీరుస్తాడు?

[14] ఆయన ఆకాశపు అత్యున్నత స్థానంలో నడిచేటప్పుడు మనం చూడకుండా మేఘాలు ఆయనను కప్పివేస్తాయి.’ అని అంటావు.

[15] “యోబూ! దుర్మార్గులు తిరిగే పాత మార్గంలోనే నీవు నడుస్తున్నావు.

[16] దుర్మార్గులు మరణించాల్సిన సమయం రాకముందేవారు తీసుకోబడ్డారు. ఒక వరదలో వారు కొట్టుకొని పోయారు.

[17] ‘మమ్ముల్ని ఒంటరిగా విడిచిపెట్టండి. సర్వశక్తి మంతడైన దేవుడు మమ్ముల్ని ఏమీ చేయలేడు’ అని దేవునితో చెప్పేవాళ్లు ఆ మనుష్యులే.

[18] కానీ ఆ మనుష్యలనే దేవుడు విజయం పొందిన ధనికులుగా చేశాడు. దుర్మార్గులు తలచే పద్ధతి నేను అంగీకరించలేను.

[19] దుర్మార్గులు నాశనం అయినప్పుడు మంచివాళ్లు చూచి సంతోషిస్తారు. నిర్దోషులు దుర్మార్గులను చూచి నవ్వుతూ.

[20] ‘మన శత్రువులు నిజంగా నాశనం చేయబడ్డారు. వారి ఐశ్వర్యాలను అగ్ని కాల్చేస్తుంది’ అని అంటారు.

[21] “యోబూ, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. అప్పుడు నీకు ఆయనతో శాంతి ఉంటుంది. ఇలా నీవు చేస్తే, నీవు ధన్యుడవవుతూ, విజయం పొందుతావు.

[22] ఈ ఉపదేశము స్వీకరించి ఆయన మాటలు నీ హృదయంలో భద్రం చేసికో.

[23] యోబూ! సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరకు నీవు తిరిగి వస్తే, నీకు మరల మామూలు స్థితి ఇవ్వబడుతుంది. నీవు మాత్రం దుర్మార్గాన్ని నీ ఇంటినుండి దూరంగా తొలగించి వేయాలి.

[24] నీ బంగారాన్ని నీవు మట్టిపాలు చేయాలి, ఓఫీరునుండి తెచ్చిన నీ బంగారాన్ని నదుల్లోని బండలకేసి విసిరికొట్టు.

[25] సర్వశక్తిమంతుడైన దేవుడే నీకు బంగారంగాను, వెండిగాను ఉండనియ్యి.

[26] అప్పుడు నీవు ఎంతో సంతోషిస్తావు. సర్వశక్తి మంతుడైన దేవునిలో ఆనందం కనుగొంటావు. నీవు నీ ముఖాన్ని దేవుని వైపు ఎత్తగలవు.

[27] నీవు ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు. నీవు ఏం చేస్తానని ఆయనకు ప్రమాణం చేస్తావో దానిని నీవు చేస్తావు.

[28] నీవు చేసే ప్రతి దానిలో విజయం పొందుతావు. నీ త్రోవలో వెలుగు ప్రకాశిస్తుంది

[29] గర్విష్ఠులను దేవుడు సిగ్గు పరుస్తాడు కానీ దీనులను దేవుడు రక్షిస్తాడు.

[30] నిర్దోషి కాని మనిషిని కూడా దేవుడు రక్షిస్తాడు. నీ చేతుల పవిత్రత మూలంగా అతడు రక్షించ బడతాడు.”

యోబు — Chapters