Skip to content
Opens in a new window

[1] అప్పుడు యోబు తన నోరు తెరచి, తాను పుట్టిన రోజును శపించాడు.

[2] అతడు ఇలా అన్నాడు: “నేను పుట్టిన ఆ రోజు ఉండకుండా పోవును గాక. ‘పిల్లవాడు పుట్టాడు!’ అని చెప్పబడిన ఆ రాత్రి ఉండకుండా పోవునుగాక. అది పోవునుగాక.

[4] ఆ రోజు చీకటి అవును గాక. ఆ రోజును దేవుడులక్ష్యపెట్టకుండును గాక. ఆ రోజున వెలుగు ప్రకాశింపకుండును గాక.

[5] ఆ రోజు మరణాంధకారమవును గాక. ఆ రోజును ఒక మేఘము కప్పివేయును గాక. నేను పుట్టిన ఆనాటి వెలుగును కారు మేఘాలు భయపెట్టి వెళ్లగొట్టును గాక.

[6] గాఢగంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక. ఆ రాత్రి సంవత్సరపు దినములలో ఒకటిగా ఎంచబడకుండును గాక. ఆ రాత్రిని ఏ నెలలో కూడ చేర్చవద్దు.

[7] ఆ రాత్రి ఎవడును జననం కాకపోపును గాక. ఆ రాత్రి ఏ ఆనంద శబ్దం వినుపించకుండా ఉండును గాక.

[8] శాపాలు పెట్టే మంత్రగాళ్లు నేను పుట్టిన ఆ రోజును శపించెదరు గాక. సముద్రపు రాక్షసికి కోపం పుట్టించుట ఎట్లో ఎరిగిన మనుషులు వారు.

[9] ఆ నాటి వేకువ చుక్క చీకటి అవునుగాక. ఆ రాత్రి ఉదయపు వెలుగుకోసం కనిపెట్టి ఉండును గాక. కానీ ఆ వెలుగు ఎన్నటికీ రాకుండును గాక. ఆ రాత్రి సూర్యోదయపు మొదటి కిరణాలు చూడకుండును గాక.

[10] ఎందుకనగా ఆ రాత్రి, నా తల్లి గర్భద్వారాలను మూసివేయలేదు. (అది పుట్టకుండా అరికట్టలేదు) అది నా కన్నులనుండి కష్టాలను దాచలేదు.

[11] నేను పుట్టినప్పుడే నేనెందుకు మరణించలేదు? నా తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు నేనెందుకు మరణించలేదు?

[12] నా తల్లి ఎందుకు నన్ను తన మోకాళ్లమీద పెట్టుకొంది? నా తల్లి స్తనములు నాకెందుకు పాలిచ్చాయి?

[13] నేను పుట్టినప్పుడే నేను మరణించి ఉంటే ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండేవాణ్ణి.

[14] భూమి మీద బతికిన రాజులు, జ్ఞానులతో బాటు విశ్రాంతిలో ఉంటే ఎంత బాగుండును ఆ రాజులు, జ్ఞానులచే నిర్మింపబడిన ఆ కట్టడాలు ఇప్పుడు నాశనమై పోయాయి.

[15] నేను కూడ ఆ పాలకులతో పాటు పాతిపెట్టబడి ఉంటే ఎంత బాగుండును. వారికి బంగారం ఉంది, వారి ఇండ్లను వెండితో నింపుకొన్నారు!

[16] నేను పుట్టినప్పుడే చనిపోయి, మట్టిలో పాతి పెట్టబడిన శిశువుగా ఎందుకు ఉండలేదు? ఎన్నడూ వెలుగు చూడని శిశువులా నేను ఉంటే ఎంత బాగుండును.

[17] చెడ్డ మనుష్యులు సమాధిలో ఉన్నప్పుడు తొందర కలిగించటం మానివేస్తారు. అలసిపోయిన మనుష్యులకు సమాధిలో విశ్రాంతి లభిస్తుంది.

[18] ఖైదీలు కూడా సమాధిలో సుఖంగా ఉంటారు. కాపలాదారుల స్వరం వారు వినరు.

[19] ప్రముఖ ప్రజలు, సామాన్య ప్రజలు అన్ని రకాల ప్రజలు సమాధిలో ఉంటారు. మరియు బానిస తన యజమాని నుండి విడుదల అవుతాడు.

[20] “శ్రమ పడుతూ, చాలా విచారంగా ఉన్న మనిషిని ఇంకా బతుకుతూ ఉండనియ్యటం ఎందుకు? ఆత్మ వేదనతో ఉన్న వానికి జీవం ఇవ్వబడటం ఎందుకు?

[21] ఆ మనిషి చావాలని కోరుకొంటాడు. కాని చావురాదు. విచారంలో ఉన్న ఆ మనిషి దాగి ఉన్న ఐశ్వర్యాలకంటే మరణంకోసం ఎక్కువగా వెదకుతాడు.

[22] ఆ మనుష్యులు సమాధిని కనుగొన్నప్పుడు చాలా సంతోషిస్తారు. వారు పాతిపెట్ట బడినప్పుడు ఆనందిస్తారు.

[23] దేవుడు వారి భవిష్యత్తును రహస్యంగా ఉంచుతాడు. వారి చుట్టూ ఒక గోడ కడతాడు.

[24] నేను భోజనం చేయను. కాని నేను దుఃఖధ్వనులు చేస్తాను. కాని సంతోషంతో కాదు. నా ఆరోపణలు నీళ్లలా ప్రవహిస్తున్నాయి.

[25] నాకు ఏదో దారుణం జరుగుతుందేమో అని భయ పడ్డాను. అలానే జరిగింది నాకు!

[26] నాకు శాంతి లేదు. విశ్రాంతి లేదు. నాకు విశ్రాంతి లేదు. కష్టం మాత్రమే ఉంది!”

యోబు — Chapters