[1] అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: “నా శ్రమే గనుక తూచబడితే, నా కష్టం అంతా త్రాసులో ఉంచబడితే,
[3] సముద్రాల ఇసుక కంటె నా దుఃఖం ఎక్కువ బరువయిందని నీవు గ్రహిస్తావు! అందుకే నా మాటలు వెర్రిగా కనిపిస్తాయి.
[4] సర్వశక్రిమంతుడైన దేవుని బాణాలు నాలో ఉన్నాయి. ఈ బాణాల విషం నా ఆత్మ తాగు తుంది. దేవుని దారుణ విషయాలు అన్నీ కలిపినాకు విరోధంగా ఉంచబడ్డాయి.
[5] (ఏ చెడుగూ జరగనప్పుడు మాటలాడడం సులభం) అడవి గాడిద తినేందుకు గడ్డి ఉంటే అదేమి గొడవ చెయ్యదు. ఆవుకు ఆహారం ఉంటే అది ఆరోపణ చెయ్యదు.
[6] రుచిలేని భోజనం ఉప్పు లేకుండా తినగలమా? గ్రుడ్డులోని తెల్లసొన రుచిలేనిది.
[7] (ఇప్పుడు నీ మాటలు వీటివలెనే ఉన్నాయి) దానిని నేను ముట్టుకో వటానికి గూడా ఒప్పుకోను; అలాంటి భోజనం నన్ను జబ్బు మనిషిలా చేస్తుంది.
[8] “నేను అడిగింది నాకు దొరకాలని కోరుకుంటాను. నేను దేనికోసం కనిపెట్టుకొని ఉంటానో, దాన్ని దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటాను.
[9] దేవుడు నన్ను చితకగొట్టేందుకు ఇష్టపడి, నన్ను చంపివేస్తాడని నేను నిరీక్షిస్తున్నాను!
[10] ఆయన నన్ను చంపివేస్తే, ఒక్క విషయంలో నేను ఆదరణ పొందుతాను. ఎడతెగని నా బాధల్లోనే నేను ఒక్క విషయంలో సంతోషిస్తాను. పరిశుద్ధుని ఆదేశాలకు విధేయత చూపేందుకు నేను తిరస్కరించలేదు.
[11] “నా బలం క్షిణించిపోయింది, గనుక నేను ఇంకా బతుకుతాను అనే ఆశాకిరణం నాకు లేదు. చివరికి నాకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. అందుచేత నేను సహనంగా ఉండాల్సిన కారణం ఏమీ లేదు.
[12] బండలాంటి బలం నాకు లేదు. నా శరీరం కంచుతో చేయబడలేదు.
[13] ఇప్పుడు నాకు నేను సహాయం చేసుకొనే శక్తినాకు లేదు. ఎందుకంటే విజయం నా వద్దనుండి తొలగించి వేయబడింది.
[14] “ఒక మనిషి కష్టాల్లో ఉంటే, అతని స్నేహితులు అతని మీద దయ చూపాలి. ఒక మనిషి, తన స్నేహితుడు సర్వశక్తిమంతుడైన దేవుని నుండి దూరంగా పోయినా సరే అతడు ఆ స్నేహితునికి నమ్మకంగా ఉండాలి.
[15] కానీ, నా సోదరులారా, మీరు నమ్మకస్థులు కారు. నేను మీ మీద ఆధారపడలేదు. ఒక్కొక్కప్పుడు ప్రవహించి, ఒక్కొక్కప్పుడు నిలిచిపోయే కాలు వల్లా ఉన్నారు మీరు.
[16] మంచు గడ్డలు కరిగిపోయే హిమం అడ్డుకొన్నప్పుడు పొంగి ప్రవహించే కాలువల్లా ఉన్నారు మీరు.
[17] కానీ ఆ కాలువలు ఎండిపోయిన వేళ ప్రవహించవు. వేడిగాలి వీచినప్పుడు నీళ్లు ఉండవు. కాలువలు ప్రవహించవు.
[18] వ్యాపారస్థుల బృందాలు వారి మార్గాలలోని మలుపులు కొసలు తిరిగి పనికిమాలిన నేల మీదకు వెళ్లి అక్కడ మరణిస్తారు.
[19] తేమా వర్తక బృందాలు నీళ్లకోసం వెదుకుతారు. షేబా ప్రయాణీకులు ఆశగా (నీళ్ల కోసం) చూస్తూరు.
[20] నీళ్లు దొరుకునని వారు గట్టిగా నమ్మారు. కానీ ఈసారి వారు అక్కడికి రాగానే నిరాశ చెందారు.
[21] ఇప్పుడు మీరూ ఆ కాలువల్లా ఉన్నారు. మీరు సహాయం చేయరు. మీరు నా కష్టాలు చూచి భయపడుతున్నారు.
[22] నాకు ఏమైనా ఇవ్వండి, మీ ఐశ్వర్యంలోనుండి నాకు ధనం ఇవ్వండి అని నేను ఎన్నడూ చెప్పలేదు.
[23] ‘శత్రువు బలంనుండి నన్ను రక్షించండి. మూర్ఖులైన వారి నుండి నన్ను రక్షించండి’ అని నేను ఎన్నడూ చెప్పలేదు.
[24] “కనుక, ఇప్పుడు నాకు నేర్పించండి. నేను నెమ్మదిగా ఉంటాను. నేను ఏమి తప్పు చేశానో నాకు చూపించండి.
[25] నిజాయితీ మాటలు శక్తి గలవి. కానీ మీ వాదాలు దేనినీ రుజువు చేయవు.
[26] నేను చెప్పే వాటిని మీరు విమర్శిస్తారా? మరింత నిరుత్సాహం కలిగించే మాటలు పలుకుతారా?
[27] అవును, తండ్రులు లేని పిల్లలకు చెందిన వాటిని సంపాదించటం కోసం మీరు జూదమైనా సరే ఆడతారు. మీరు మీ స్నేహితుణ్ణి అమ్ముకొంటారు.
[28] కానీ, ఇప్పుడు దయచేసి నా ముఖం పరిశీలించండి. నేను మీతో ఆబద్ధం చెప్పను.
[29] కనుక ఇప్పుడు మీ మనసు మార్చుకోండి. అన్యాయంగా ఉండవద్దు. అవును, మళ్లీ ఆలోచించండి. నేను తప్పు ఏమీ చేయలేదు.
[30] నేను అబద్ధం చెప్పటం లేదు. నా మాటల్లో చెడు ఏమీ లేదు. తప్పు, ఒప్పు నాకు తెలుసు.”