Skip to content
Opens in a new window

[1] “ఉరుములు, మెరుపులు నన్ను భయపెడతాయి. నేను ఈ విషయాలు తలచినప్పుడు నా గుండె చాలా వేగంగా కొట్టుకొంటుంది.

[2] ప్రతి ఒక్కరూ వినండి. దేవుని స్వరం ఉరుములా ధ్వనిస్తుంది. దేవుని నోటి నుండి వస్తోన్న ఉరుముశబ్దం వినండి

[3] మొత్తం ఆకాశం అంతటా వెలిగేలా దేవుడు తన మెరుపును పంపిస్తాడు. అది భూమి అంతట మెరిసింది.

[4] మెరుపు మెరిసిన తర్వాత గర్జించే దేవుని స్వరం వినవచ్చును. దేవుడు తన ఆశ్చర్యకరమైన స్వరంతో ఉరుముతాడు. మెరుపు మెరుస్తూ ఉండగా దేవుని స్వరం ఉరుముతుంది.

[5] దేవుడు ఉరిమే స్వరం అద్భుతం. మనం గ్రహించజాలని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు.

[6] ‘నేలమీద పడు’ అని ఆయన మంచుతో చెబుతాడు. ‘నేలమీద వర్షించు’ అని దేవుడు వర్షంతో చెబుతాడు.

[7] దేవుడు ఏమి చేయగలడో అనేది అయన సృజించిన మనుష్యులంతా తెలుసుకొనేందుకు అలా చేస్తాడు.

[8] మృగాలు వాటి గుహల్లోకి పరుగెత్తిపోయి, అక్కడ నివసిస్తాయి.

[9] తుఫాను దక్షిణం నుండి వస్తుంది. చలి ఉత్తరం నుండి వస్తుంది.

[10] దేవుని ఊపిరి మంచును చేస్తుంది. అది మహాసముద్రాలను గడ్డ కట్టిస్తుంది

[11] దేవుడు మేఘాలను నీళ్లతో నింపుతాడు. ఆయన తన మెరుపును మేఘాల ద్వారా విస్తరింప చేస్తాడు.

[12] భూమి మీద అంతటికీ చెదరిపోయేలా దేవుడు మేఘాలను ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఏమి చెబితే అది మేఘాలు చేస్తాయి.

[13] దేవుడు మనుష్యులను శిక్షించేందుకు, వరదలను లేదా తన ప్రేమ చూపుటకై వర్షం రప్పించేందుకు మేఘాలను తీసుకొని వస్తాడు.

[14] “యోబూ, ఒక నిమిషం ఆగి విను. ఆగి, దేవుడు చేసే అద్భుత విషయాలను గూర్చి ఆలోచించు.

[15] యోబూ, దేవుడు మేఘాలను ఎలా అదుపు చేస్తాడో నీకు తెలుసా? దేవుడు తన మెరుపును ఎలా ప్రకాశింప చేస్తాడో నీకు తెలుసా?

[16] ఆకాశంలో మేఘాలు ఎలా వేలాడుతాయో నీకు తెలుసా? దేవుని జ్ఞానం పరిపూర్ణం. మేఘాలు, దేవుని ఆశ్చర్యకార్యాలు.

[17] లేదు, యోబూ, ఈ సంగతులు నీకు తెలియపు. దక్షిణపు వేడి గాలిలో భూమి నిశ్చలంగా ఉన్నప్పుడు నీకు చెమటపోసి, నీ బట్టలు జిడ్డుగా ఉండటం మాత్రమే నీకు తెలుసు.

[18] యోబూ, ఆకాశాన్ని విశాలపరచేందుకు మెరుగుదిద్దిన అద్దంలా దానిని గట్టిగా చేసేందుకు నీవు దేవునికి సహాయం చేయగలవా?

[19] “యోబూ, దేవునితో మేము ఏమి చెప్పాలో చెప్పు. మేము చీకటిలో ఉన్నందువల్ల సరియైన మా వాగ్వివాదాన్ని దేవునికి మేము చెప్పలే కున్నాము. (దేవుని సన్నిధిలో) ఏమి చెప్పడానికీ మాకు తెలియడంలేదు.

[20] నేను దేవునితో మాట్లాడాలని నేను ఆయనతో చెప్పను. అలా చెప్పటం నాశనం చేయమని అడిగినట్టే ఉంటుంది.

[21] ఇప్పుడు ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి ఏ మనిషీ చూడలేడు. గాలి మేఘాలను తరిమి వేసిన తరువాత అది ఆకాశంలో చాలా తేజోవంతంగా ప్రకాశిస్తుంది.

[22] (అదే విధంగా దేవుడు ఉన్నాడు) దేవుని బంగారు మహిమ ఉత్తరం నుండి ప్రకాశిస్తుంది. దేవుడు అద్భుత మహిమతో వస్తాడు.

[23] సర్వశక్తిమంతుడైన దేవుడు నిజంగా గొప్పవాడు. మనం దేవుని దగ్గరగా వెళ్లలేం. దేవుడు మనుష్యుల్ని ఎల్లప్పుడూ సరిగ్గాను, న్యాయంగాను చూస్తాడు.

[24] అందువల్లనే మనుష్యులు దేవుని గౌరవిస్తారు. కానీ తెలివిగల వాళ్లం అనుకొనే గర్విష్ఠులను దేవుడు లక్ష్యపెట్టడు.”

యోబు — Chapters