Skip to content
Opens in a new window

[1] అప్పుడు నయమాతీ దేశపువాడైన జోఫరు యోబుకు జవాబిచ్చాడు:

[2] “ఈ మాటల ప్రవాహానికి జవాబు ఇచ్చి తీరాల్సిందే! ఈ వాగుడు అంతా కలిసి, యోబు చెప్పింది సరే అనిపిస్తోందా? లేదు.

[3] యోబూ, నీకు చెప్పేందుకు మా పద్ద జవాబు లేదనుకొంటున్నావా? నీవు దేవునిగూర్చి నవ్వి నప్పుడు, నిన్ను ఎవ్వరూ హెచ్చరించరు అనుకొంటున్నావా?

[4] యోబూ! నీవు దేవునితో, ‘నా నమ్మకాలు సరి యైనవే, కనుక చూడు నేను పరిశుద్ధమైన వాడినే’ అని చెబుతున్నావు.

[5] యోబూ! దేవుడే నీకు జవాబిచ్చి, నీవు చేసేది తప్పు అని చెబితే బాగుండును అని నేను ఆశిస్తున్నాను.

[6] అప్పుడు జ్ఞాన రహస్యాలు దేవుడు నీతో చెప్పగలడు. ప్రతి విషయానికీ, నిజంగా రెండు వైపులు ఉంటాయని ఆయన నీతో చెబుతాడు. అది నిజమైన జ్ఞానం! యోబూ! ఇది తెలుసుకో: దేవుడు నిన్ను నిజంగా శిక్షించాల్సిన దానికంటె తక్కువగానే శిక్షిస్తున్నాడు.

[7] “యోబూ, దేవుని రహస్య సత్యాలను నీవు గ్రహించగలవా? సర్వశక్తిమంతుడైన దేవుని గొప్పదనాన్నీ, శక్తినీ చూపించే హద్దులను నీవు గ్రహించలేవు.

[8] అతని జ్ఞానం ఆకాశమంత ఎత్తయినది! ఆ హద్ధులు సమాధి లోతులకంటె లోతైనవి. కానీ, అది నీవు గ్రహించలేవు!

[9] దేవుడు భూమికంటే గొప్పవాడు, సముద్రంకంటే పెద్దవాడు.

[10] “దేవుడు ఒకవేళ నిన్ను బంధిస్తే, నిన్ను న్యాయ స్థానానికి తీసుకొనివస్తే, ఏ మనిషీ ఆయనను వారించలేడు.

[11] నిజంగా, ఎవరు పనికిమాలిన వాళ్లో దేవునికి తెలుసు. దేవుడు దుర్మార్గాన్ని చూసినప్పుడు, ఆయన దానిని జ్ఞాపకం ఉంచుకొంటాడు.

[12] ఒక అడవి గాడిద ఎలాగైతే ఒక మనిషికి జన్మ ఇవ్వలేదో, అలాగే బుద్ధిహినుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు.

[13] అయితే యోబూ! దేవుణ్ణి మాత్రమే సేవించటానికి, నీవు నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆయన తట్టు నీవు నీ చేతులు ఎత్తి ఆరాధించాలి.

[14] నీ ఇంట్లో ఉన్న పాపం నీవు తొలగించి వేయాలి. నీ గుడారంలో చెడు నివాసం చేయనియ్యకు.

[15] అప్పుడు నీవు సిగ్గుపడకుండా దేవుని తట్టు నిశ్చలంగా చూడగలుగుతావు. నీవు బలంగా నిలబడతావు. భయపడవు.

[16] యోబూ! అప్పుడు నీవు నీ కష్టం మరచిపోగలవు. నీ కషాలను దొర్లిపోయిన నీళ్లలా నీవు జ్ఞాపకం చేసుకొంటావు.

[17] అప్పుడు మధ్యాహ్నపు సూర్యకాంతి కంటె నీ జీవితం ఎక్కువ ప్రకాశమానంగా ఉంటుంది. జీవితపు గాఢాంధకార ఘడియలు సూర్యోదయంలా ప్రకాశిస్తాయి.

[18] యోబూ! నిరీక్షణ ఉంది గనుక నీవు క్షేమంగా ఉంటావు. దేవుడు నిన్ను సురక్షితంగా వుంచి నీకు విశ్రాంతినిస్తాడు.

[19] నీవు విశ్రాంతిగా పండుకొంటావు. నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు, బాధించరు. మరియు అనేక మంది నీ సహాయం వేడుకొంటారు.

[20] కానీ, చెడ్డవాళ్లు సహాయం కోసం చూస్తారు, అయితే ఆశ ఏమి ఉండదు. వారు వారి కష్టాలు తప్పించుకోలేరు. వారు చస్తారు అనేది ఒక్కటే వారికి ఉన్న ఆశ.”

యోబు — Chapters