Skip to content
Opens in a new window

[1] అప్పుడు తేమానువాడైన ఎలీఫజు యోబుకు జనాబిచ్చాడు:

[2] “యోబూ! నీవు నిజంగా జ్ఞానం గలవాడవైతే నీవు వట్టి మాటలతో జవాబు ఇవ్వవు. జ్ఞానం గల మనిషి పూర్తిగా తూర్పు వేడిగాలి (పనికిమాలిన మాటల) తో ఉండడు.

[3] జ్ఞానం గల మనిషి పనికిమాలిన మాటలతో, అర్థం లేని ఉపన్యాసాలతో వాదిస్తాడని నీవు తలుస్తావా?

[4] యోబూ! నీ యిష్టం వచ్చినట్టు నీవు ఉంటే ఎవ్వరూ దేవుణ్ణి గౌరవించరు, ఆయన్ని ప్రార్థించరు. దేవుని సన్నిధియందు చేసే ధ్యానానికి నీవు ఆటంకం తెస్తావు.

[5] నీవు చెప్పే విషయాలు నీ పాపాన్ని తేటగా చూపిస్తాయి. యోబూ! నీవు తెలివిగల మాటలు ప్రయోగించి నీ పాపాన్ని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నావు.

[6] నీది తప్పు అని నేను నీకు రుజువు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీ స్వంత నోటితో నీవు పలికే విషయాలే నీ తప్పును తెలియ జేస్తున్నాయి. నీ స్వంత పెదాలు నీకు విరోధంగా మాట్లాడుతున్నాయి.

[7] “యోబూ! మొట్ట మొదట పుట్టింది నీవే అని తలుస్తున్నావా? కొండలు చేయబడక ముందే నీవు జన్మించావా?

[8] దేవుని రహస్య పథకాలు నీవు విన్నావా? నీ మట్టుకు నీవు ఒక్కడవు మాత్రమే జ్ఞానం గలవాడవని తలుస్తున్నావా?

[9] యోబూ! నీకు తెలిసిన దానికంటే మాకు ఎక్కువ తెలుసు. నీవు గ్రహించలేని విషయాలు మేము గ్రహిస్తాం.

[10] తల నెరసిన మనుషులు మరియు వృద్ధులు మాతో ఏకీభవిస్తారు. అవును, చివరికి నీ తండ్రీకంటే పెద్ద వాళ్లు కూడా మా పక్షంగా ఉన్నారు.

[11] దేవుడు నిన్ను ఆదరించేందుకు ప్రయత్నిస్తాడు కానీ నీకు అది మాత్రమే చాలాదు. సౌమ్యమయిన పద్ధతిలో దేవుని సందేశం మేము నీకు చెప్పాము.

[12] యోబూ! నీవెందుకు అర్థం చేసుకోవు? సత్యాన్ని ఎందుకు చూడలేక పోతున్నావు?

[13] నీవు ఈ కోపపు మాటలు చెప్పినప్పుడు నీవు దేవునికి విరోధంగా ఉన్నావు.

[14] “ఒక మనిషి వాస్తవంగా పరిశుద్ధంగా ఉండలేడు. స్త్రీనుంచి జన్మించిన మనిషి, దేవునితో సరిపడి ఉండ జాలడు.

[15] దేవుడు కనీసం తన దూతలను కూడ నమ్మడు. దూతలు నివసించే ఆకాశం కూడా పవిత్రమైనది కాదు.

[16] మనవుడు అంతకంటే దౌర్భాగ్యుడు. మానవుడు అసహ్యమైవాడు మరియు పాడైపోయాడు. అతడు మంచి నీళ్లు తాగినట్టుగా కిడును తాగు తాడు.

[17] “యోబూ, నా మాట విను. నేను దానిని నీకు వివరిస్తాను. నాకు తెలిసిన దానిని నేను నీతో చెబుతాను.

[18] జ్ఞానం గల మనుష్యులు నాతో చెప్పిన విషయాలు నేను నీతో చెబుతాను. ఆ జ్ఞానం గల మనుష్యుల పూర్వీకులు ఈ విషయాలను వారితో చెప్పారు. ఆ జ్ఞానులు రహస్యాలేమీ నా దగ్గర దాచిపెట్టలేదు.

[19] వారికే (జ్ఞానులకే) దేశం ఇవ్వబడింది. వారిని ఇబ్బంది పెట్టేందుకు పరాయివాళ్లు ఎవరూ ఆ దేశంలో లేరు.

[20] దుర్మార్గుడు తన జీవితకాలమంతా బాధతో శ్రమ పడతాడు. క్రూరమైన మనిషి తన కోసం దాచ బడిన సంవత్సరాలన్నింటిలో శ్రమపడతాడు,

[21] భయంకర శబ్దాలు అతని చెవులకు వినిపిస్తాయి మరియు అతడు క్షేమంగా ఉన్నానని అనుకొన్నప్పుడు శత్రువు అతని మీద దాడి చేస్తాడు.

[22] దుర్మార్గపు వ్యక్తి చాలా విసిగిపోతాడు. చీకటి నుండి తప్పించుకొనే ఆశ అతనికి ఉండదు. అతణ్ణి చంపివేసేందుకు ఎక్కడో ఒక ఖడ్గం కనిపెడుతూనే ఉంటుంది.

[23] అతడు అటూ ఇటూ ఆహారం కోసం ‘ఎక్కడ అది’ అంటూ సంచరిస్తూనే ఉంటాడు. కాని అతని శరీరం రాబందులకు ఆహారం అవుతుంది. అతనికిచావు మూడిందని అతనికి తెలుసు.

[24] చింత, శ్రమ అతణ్ణి భయపెడుతున్నాయి. అతణ్ణి నాశనం చేసేందుకు ఒక రాజు సిద్ధంగా ఉన్నట్టు ఈ విషయాలు అతనిపై దాడి చేస్తాయి.

[25] ఎందుకంటే దుర్మార్గుడు దేవుని మీద తన పిడికిలి బిగిస్తాడు కనుక దుర్మార్దుడు దేవునికి విధేయుడ య్యేందుకు నిరాకరిస్తాడు. సర్వశక్తిమంతుడైన దేవునికి విరోధంగా దుర్మార్గుడు బలవంతునిగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.

[26] ఆ మనిషి చాలా మొండివాడు. దుర్మార్గుడు తన బలమైన లావుపాటి కేడెముతో దేవుని మీద దాడి చేస్తాడు.

[27] దుర్మార్గుడు ధనవంతుడై ముఖం కొవ్వుతో నిండి ఉండివుండవచ్చు. వాని నడుం కొవ్వు పొరలతో బలిసి ఉండవచ్చు.

[28] కానీ శిథిలమైన పట్టణాల్లో వాడు నివసిస్తాడు. ఎవరూ నివసించని ఇండ్లలో ఆ దుర్మార్గుడు నివసిస్తాడు. అవి పడిపోయేట్టు ఉన్న శిథిల గృహాలు.

[29] దుర్మార్గుడు ధనికుడుగా ఉండవచ్చు. అతని ఐశ్వర్యం ఎక్కువ కాలం ఉండదు. అతని పంటలు ఎక్కువగా పండవు.

[30] దుర్మార్గుడు చీకటిని తప్పించుకోలేడు. అగ్గిచేత కొమ్మలు కాలిపోయిన చెట్టులా అతడు ఉంటాడు. దేవుని శ్వాస దుర్మార్గుని తుడిచివేస్తుంది.

[31] దుర్మార్గుడు పనికిమాలిన వాటిని నమ్ముకొని తనను తానే మోసం చేసుకోకూడదు. ఎందుకంటే, వానికి ఏమీ దొరకదు కనుక.

[32] దుర్మార్గుని ఆయుష్షు తీరిపోకముందే వాడు ముసలివాడై, ఎండిపోతాడు. మళ్లీ ఎన్నటికి వచ్చగా ఉండని ఎండిపోయిన కొమ్మలా అతడు ఉంటాడు.

[33] ద్రాక్షాపండ్లు పక్వానికి రాకముందే రాలిపోతున్న ద్రాక్షావల్లిలా దుర్మార్గుడు ఉంటాడు. ఆ వ్యక్తి పూలు రాలిపోయిన ఒలీవ చెట్టులా ఉంటాడు.

[34] ఎందుకంటే, దేవుడు లేని ప్రజల పని వ్యర్థము. డబ్బును ప్రేమించే మనుష్యుల ఇండ్లు అగ్నిచేత నాశనం చేయబడతాయి.

[35] వారు కష్టాలకు పథకం వేసి దుర్మార్గపు పనులు చేస్తారు. మనుష్యులను మోసం చేసేందుకు వారు ప్రయత్నం చేస్తారు.”

యోబు — Chapters