[1] “యోబు, నీవు కావాలంటే గట్టిగా పిలువు. కాని నీకు ఎవ్వరూ జవాబు ఇవ్వరు! నీవు ఏ దేవదూతల తట్టూ తిరుగలేవు!
[2] తెలివి తక్కువ మనిషి యొక్క కోపం వానినే చంపివేస్తుంది. బుద్ధిహీనుని అసూయ వానినే చంపివేస్తుంది.
[3] బాగా వేరూనుకొని, వృద్ధిపొందుతున్న ఒక బుద్ధి హీనుణ్ణి చూశాను. (అతను బలంగా, క్షేమంగా ఉన్నా ననుకొన్నాడు). అయితే అకస్మాత్తుగా వాని ఇల్లు శపించబడింది.
[4] ఆ బుద్ధిహీనుని పిల్లలు క్షేమంగా లేరు. (న్యాయ స్థానంలో) వారిని ఆదుకొనేందుకు నగరద్వారం వద్ద ఎవ్వరూలేరు.
[5] ఆ బుద్ధిహీనుని పంటలను ఆకలిగొన్న ప్రజలు తీసుకొంటారు. ఆకలిగొన్న ఆ మనుష్యలు ముండ్లలో పెరుగుతున్న ధాన్యపు గింజలను కూడా తీసుకొంటారు. ఆశగలవారు అతని ఐశ్వర్యాన్ని తీసుకొంటారు.
[6] చెడ్డ కాలాలు మట్టిలోనుండి రావు. కష్టం నేలలో నుండి పెరగదు.
[7] నిప్పులో నుండి రవ్వలు పైకి లేచినంత నిశ్చయంగా మనిషి కష్టం కోసమే పుట్టాడు.
[8] “కాని యోబూ, నేనే గనుక నీవైతే నేను దేవుని తట్టు తిరిగి నా సమస్య ఆయనతో చెబుతాను.
[9] దేవుడు చేసే ఆశ్చర్యకరమైన వాటిని మనుష్యులెవ్వరు గ్రహించలేరు. దేవుడు చేసే అద్భుతాలకు అంతం లేదు.
[10] దేవుడు భూమి మీద వర్షం కురిపిస్తాడు. ఆయన పొలాలకు నీళ్లు పంపిస్తాడు.
[11] దీనుడైన మనిషిని దేవుడు లేవనెత్తుతాడు. దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఆయన చాలా సంతోష పరుస్తాడు.
[12] తెలివిగల దుర్మార్గులకు విజయం కలుగకుండా దేవుడు వారి పథకాలను వివారిస్తాడు.
[13] దేవుడు తెలివిగల మనుష్యులను వారి కుయుక్తి పథకాల్లోనే పట్టేస్తాడు. అందుచేత తెలివిగల మనిషి యొక్క పథకాలు విజయవంతం కావు.
[14] పగటివేళ సైతం ఆ తెలివిగల మనుష్యులు చీక టిలో వలె తడబడుతారు. మధ్యాహ్నపు వేళల్లో సైతం రాత్రిపూటలా తడువులాడుతారు.
[15] దేవుడు పేద ప్రజలను మరణం నుండి రక్షిస్తాడు. బలవంతుల హస్తాలనుండి పేదలను ఆయనే రక్షిస్తాడు.
[16] కనుక పేద ప్రజలకు నిరీక్షణ ఉంది. న్యాయంగా లేని దుర్మార్గులను దేవుడు నాశనం చేస్తాడు.
[17] “దేవుడు సరిదిద్దే మనిషి సంతోషంగా ఉంటాడు. కనుక సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను శిక్షించి నప్పుడు, దానిని తోసిపుచ్చకు.
[18] దేవుడు చేసిన గాయాలకు ఆయన కట్లు కడతాడు. ఆయనే గాయపరుస్తాడు, కాని ఆయన చేతులే తిరిగి స్వస్థపరుస్తాయి.
[19] ఆరు కష్టాలనుండి ఆయన నిన్ను రక్షిస్తాడు; అవును, ఏడు కష్టాల్లో కూడా నీవు బాధించబడవు.
[20] కరువు వచ్చినప్పుడు దేవుడు నిన్ను మరణంనుండి రక్షిస్తాడు. యుద్ధంలో దేవుడు నిన్ను మరణం నుండి కాపాడుతాడు.
[21] మనుష్యులు వాడిగల తమ నాలుకలతో నిన్ను గూర్చి చెడుగా మాట్లాడినప్పుడు దేవుడు నిన్ను రక్షాస్తాడు. నాశనం వచ్చినప్పుడు నీవు భయ పడాల్సిన పనిలేదు.
[22] నాశనం, కరువును చూసి నీవు నవ్వుతావు. అడవి జంతువులను చూసి నీవు భయపడాల్సిన అవసరం లేదు.
[23] నీ ఒడంబడిక దేవునితో ఉంది కనుక నీవు దున్నే పొలాల్లో బండలు ఉండవు. మరియు అడవి మృగాలు ఎన్నటికీ నీ మీద పడవు.
[24] నీ గుడారం క్షేమంగా ఉంది గనుక నీవు శాంతంగా జీవిస్తావు. నీవు నీ ఆస్తి లెక్కించగా ఏదీ పోయి ఉండదు.
[25] నీకు చాలామంది పిల్లలు ఉంటారు. నేలమీద గడ్డి పరకల్లా నీ పిల్లలు చాలామంది ఉంటారు.
[26] కోతకాలం వరకు సరిగ్గా పెరిగే గోధుమలా నీవు ఉంటావు. అవును, నీవు పక్వమయిన వృద్ధాప్యం వరకు జీవిస్తావు.
[27] “యోబూ, ఈ విషయాలు మేము పరిశీలించాం. అవి సత్యమైనవని మాకు తెలుసు. అందుచేత యోబూ, మేము చెప్పు సంగతులను విని, నీ మట్టుకు నీవే వాటిని తెలుసుకో.”