[1] అప్పుడు షూహీ దేశస్తుడైన బిల్దదు యోబుకు ఇలా జవాబు చెప్పాడు:
[2] “యోబూ! ఈ మాటలన్నీ ఎప్పుడు చాలిస్తావు? నీవు మౌనంగా ఉండి వినాలి. అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు
[3] మేము పశువుల్లా బుద్ధిహీనులం అని నీవు ఎందుకు తలస్తావు?
[4] యోబూ! నీ కోపంతో నీకు నీవే హాని చేసు కొంటున్నావు. కేవలం నీ కోసం మనుష్యులు ఈ భూమిని విడిచిపోవాలా? కేవలం నిన్ను తృప్తి పరచటం కోసం దేవుడు పర్వతాలను కదిపిస్తాడని నీవు తలస్తున్నావా?
[5] “అవును నిజమే, దుర్మార్గుని దీపం ఆరిపోతుంది. అతని అగ్ని కాలకుండా ఆగిపోతుంది.
[6] అతని ఇంటిలోని వెలుగు చీకటి అవుతుంది. అతని పక్కగా ఉన్న దీపం ఆరిపోతుంది.
[7] ఆ మనిషి అడుగులు మరల గట్టిగా, వేగంగా ఉండవు. కానీ అతడు నిధానంగా నడుస్తాడు, బలహీనంగా ఉంటాడు. అతని స్వంత దుర్మార్గపు ఆలోచనలే అతడు పడిపోయేట్టు చేస్తాయి.
[8] అతని స్వంత పాదాలే అతనిని వలలో పడదోస్తాయి. అతడు బోనులోనికి నడచి, అందులో చిక్కుకొంటాడు.
[9] ఒక బోను అతని మడిమెను పట్టేస్తుంది. ఒక బోను అతన్ని గట్టిగా బంధిస్తుంది.
[10] అతని కోసం నేలమీద ఒక తాడు దాచబడి ఉంటుంది. అతని తోవలో ఒక బోను సిద్ధంగా ఉంది.
[11] అతని చుట్టూరా భయం పొంచి ఉంది. అతడు వేసే ప్రతి అడగు వెనుకా భయం ఉంటుంది.
[12] చెడ్డ కష్టాలు అతని కోసం ఆకలితో వున్నాయి. అతడు పడిపోయినప్పుడు పతనం, నాశనం అతని కోసం సిద్ధంగా ఉన్నాయి.
[13] భయంకర రోగం అతని చర్మంలో కొన్ని భాగాలను తినివేస్తుంది. అది అతని చేతులను, కాళ్లను కుళ్లిపోచేస్తుంది.
[14] దుర్మార్గుడు క్షేమంగా ఉన్న తన ఇంటిలో నుండి తీసుకొని పోబడతాడు. భయాల రాజును ఎదుర్కొ నేందుకు అతడు నడిపించబడతాడు.
[15] అతనికి తన ఇంటిలో ఏమీ విడిచిపెట్టబడదు. ఎందుకంటే అతని ఇంటినిండా, మండుతున్న గంధకం చల్లబడుతుంది.
[16] కింద అతని వేర్లు ఎండిపోతాయి. పైన అతని కొమ్మలు చస్తాయి.
[17] భూమి మీద మనుష్యులు అతనిని జ్ఞాపకం చేసుకోరు. ఏ వ్యక్తికూడ అతన్ని ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసికోడు.
[18] మనుష్యులు అతనిని వెలుతురు నుండి నెట్టివేస్తారు. అతడు చీకటిలోనికి శిక్షించబడతాడు. వారు అతన్నిలోకంలో నుండి తరిమివేస్తారు.
[19] అతనికి పిల్లలు లేక మనుమలు ఎవ్వరూ ఉండరు. అతని కుమారుల నుండి వారసులు ఉండరు. అతనియింట యింక సజీవంగా ఉండే మనుష్యులు ఎవ్వరూ ఉండరు.
[20] దుర్మార్గునికి సంభవించిన దానిని గూర్చి విన్నప్పుడు పడమట ఉన్న ప్రజలు అదిరిపోతారు. తూర్పున ఉన్న ప్రజలు భయంతో మెత్తబడి పోతారు.
[21] ఇది నిజం, దుర్మార్గునికి, అతని ఇంటికి ఇలాగే జరుగుతుంది. దేవుని గూర్చి లక్ష్యపెట్టని వానికి ఇలాగే జరుగుతుంది!”