[1] యోబూతో యెహోవా ఇలా చెప్పాడు:
[2] “యోబూ, సర్వశక్తిమంతుడైన దేవునితో నీవు వాదించావు. తప్పు చేశానని నీవు నాకు తీర్పు చెప్పావు. ఇప్పుడు నీవు తప్పుచేశావని ఒప్పుకుంటావా? నాకు జవాబు ఇస్తావా?”
[3] అప్పుడు దేవునికి యోబు ఇలా జవాబు చెప్పాడు. యోబు అన్నాడు:
[4] “నేను ముఖ్యం కాదు. నీకు నేను ఏమి చెప్పగలను? నీకు నేను జవాబు ఇవ్వలేను. నా చేతితో నేను నా నోరు మూసుకొంటాను.
[5] నేను ఒకసారి మాట్లాడాను కానీ నేను మరల జవాబు ఇవ్వను. నేను రెండుసార్లు మాట్లాడాను. కానీ నేను ఇంకా ఏమీ చెప్పను.”
[6] అప్పుడు యెహోవా తుఫానులోంచి మరల యోబుతో ఇలా మాట్లాడాడు. యెహోవా అన్నాడు:
[7] “యోబూ, మగవాడిలా నిలబడు. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నీవు నాకు జవాబు చెప్పు.
[8] “యోబూ నేను న్యాయంగా లేనని నీవు తలుస్తున్నావా? నీదే సరిగ్గా ఉన్నట్లు కనబడేలా చేయాలని, నేను తప్పు చేశానని నీవు నన్ను నిందిస్తావా?
[9] యోబూ, నీ చేతులు దేవుని చేతులంత బలంగా ఉన్నాయా? నీ స్వరాన్ని నా స్వరంలా ఉరిమేట్టు నీవు చేయగలవా?
[10] ఒకవేళ నీవు అలా దేవునిలా చేయగలిగితే నీకు నీవే ఘనత, మహిమ, ఆపాదించుకో. మహిమ, తేజస్సును వస్త్రాల్లా ధరించు.
[11] యోబూ, నీవు నావలె ఉంటే గర్విష్ఠులను తక్కువగా చూడు. యోబూ, ఆ గర్విష్ఠుల మీద నీ కోపం కుమ్మరించు. ఆ గర్విష్ఠులను దీనులుగా చేయి.
[12] అవును, యోబూ, ఆ గర్విష్ఠులను చూడు. వారిని దీనులనుగా చేయి. దుర్మార్గులను వారు ఉన్న చోటనే చితుకగొట్టు.
[13] గర్విష్ఠులందరినీ మట్టిలో పాతిపెట్టు. వారి శరీరాలను చుట్టేసి వారి సమాధులలో పెట్టు
[14] యోబూ, నీవు గనుక వీటన్నింటినీ చేయగలిగితే అప్పుడు నిన్ను నీవే రక్షించుకొనుటకు సమర్ధుడ వని నీ దగ్గర నేను ఒప్పుకొంటాను.
[15] “యోబూ, నీటి గుర్రాన్ని చూడు. నేను (దేవుణ్ణి) నీటి గుర్రాన్ని చేశాను. మరియు నిన్నూ (యోబు) నేను చేశాను. నీటి గుర్రం ఆవులా గడ్డి తింటుంది.
[16] నీటి గుర్రం శరీరంలో చాలా బలం ఉంది. దాని కడుపులోని కండరాలు చాలా శక్తివంతంగా ఉంటాయి.
[17] నీటి గుర్రం తోక దేవదారు వృక్షంలా బలంగా నిలుస్తుంది. దాని కాలి కండరాలు చాలా బలంగా ఉంటాయి.
[18] నీటి గుర్రం యొక్క ఎముకలు ఇత్తడిలా గట్టిగా ఉంటాయి. దాని కాళ్లు ఇనుప కడ్డీలా ఉంటాయి.
[19] నీటి గుర్రం నేను (దేవుణ్ణి) చేసిన మహా అద్భుత జంతువు. కాని నేను దానిని ఓడించగలను.
[20] అడవి జంతువులు ఆడుకొనే కొండల మీద నీటి గుర్రం తినే గడ్డి పెరుగుతుంది.
[21] తామర చెట్ల కింద నీటి గుర్రం పండుకుంటుంది. జమ్ము గడ్డీ మడుగులలో నీటి గుర్రం దాక్కుంటుంది.
[22] తామర మొక్కలు తమ నీడలో నీటి గుర్రాన్ని దాచిపెడతాయి. నది సమీపంగా పెరిగే నిరవంజి చెట్ల కింద అది నివసిస్తుంది.
[23] నది వరదలై పొర్లినా నీటి గుర్రం పారిపోదు. యొర్దాను నది దాని ముఖం మీద చిమ్మితే అది భయపడదు.
[24] నీటి గుర్రానికి కళ్లు కట్టి ఒక ఉచ్చులో దానిని ఎవరూ పట్టుకొనలేరు.