Skip to content
Opens in a new window

[1] యోబు మాట్లాడటం కొనసాగించాడు. యోబు ఇలా అన్నాడు:

[2] “దేవుడు నన్ను కాపాడి, నా విషయం జాగ్రత్త తీసు కొన్న ఇటీవలి మాసాల్లో ఉన్నట్టుగానే నా జీవితం ఉంటే బాగుండునని నేను ఆశిస్తున్నాను.

[3] నేను చీకటిలో నడచినప్పుడు నాకు వెలుగు ఇచ్చుటకు నా తలమీద దేవుని వెలుగు ప్రకాశించే సమయం వస్తే బాగుండునని నేను ఆశిస్తున్నాను. (నేను జీవించవలసిన సరియైన మార్గాన్ని దేవుడు నాకు చూపించాడు).

[4] నా జీవితం ఎంతో విజయవంతంగా ఉండి దేవుడు నాకు సన్నిహితమైన స్నేహితునిగా ఉండే రోజుల కోసం నేను ఆశిస్తున్నాను. అవి దేవుడు నా ఇంటిని ఆశీర్వదించిన రోజులు.

[5] సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంకా నాతో ఉండగా నా పిల్లలు నా దగ్గర ఉన్న సమయం కోసం నేను ఆశిస్తున్నాను.

[6] అది నా జీవితం ఎంతో బాగున్నప్పటి మాట. నా మార్గం అర తా మీగడతో నిండిపోయినట్టు, నా కోసం ఒలీవ నూనెను నదులుగా ప్రవహించి నట్టు అది కనబడింది.

[7] “నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి పట్టణ పెద్దలతో కలిసి ఆరుబయట కూర్చున్న రోజులు అవి.

[8] అక్కడ ప్రజలంతా నన్ను గౌరవించేవారు. యువకులు నన్ను చూచినప్పుడు పక్కకు తప్పుకొనేవారు. పెద్దలు నా యెడల గౌరవ సూచకంగా లేచి నిలబడేవారు.

[9] ప్రజానాయకులు నన్ను చూడగానే మాట్లాడటం నిలిపివేసి నోటిమీద చేయి వేసుకొనేవారు (ఇతరులను నిశ్శబ్దంగా ఉంచటానికి).

[10] చాలా ప్రముఖ నాయకులు కూడా, నేను వారిని సమీపించినప్పుడు వారి స్వరాలు తగ్గించేవారు. అవును వారి నాలుకలు వారి అంగిట అంటుకొని పోయినట్లు కనిపించేది.

[11] నేను మాట్లాడటం విన్నవారు ఎవరైనా సరే, నన్ను గూర్చి మంచి మాటలు చెప్పేవారు. నన్ను చూచిన వారు నన్ను పొగిడారు.

[12] ఎందుకంటే, పేదవాడు ఒకడు సహాయం కోసం వేడుకొంటే, నేను సహాయం చేశాను. తల్లి దండ్రులు లేని బిడ్డ విషయం శ్రద్ధ తీసుకోనే వారు ఎవరూ లేనప్పుడు నేను సహాయం చేశాను.

[13] మరణించే మనిషీ నన్ను ఆశీర్వదించాడు. అవసరంలో ఉన్న విధవలకు నేను సహాయం చేసాను.

[14] సక్రమంగా జీవించటం నాకు వస్త్రం. న్యాయంనాకు అంగీలా, తలపాగాలా ఉండేది.

[15] గుడ్డివారికి నా కళ్లతో నేను సహాయం చేశాను. కుంటివారికి నా పాదాలతో నేను సహాయం చేశాను.

[16] పేద ప్రజలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను. కష్టాలలో ఉన్న పరాయివారి పక్షం నేను వహించాను.

[17] దుర్మార్గుల శక్తిని నేను నాశనం చేశాను. దుర్మార్గుల బారి నుండి నిర్దోషులను నేను రక్షించాను.

[18] “నేను ఎల్లప్పుడూ ఇలా తలచేవాణ్ణి. నేను చాలాకాలం బతుకుతాను. తర్యాత నా స్వంత ఇంటిలో మరణిస్తాను.

[19] వేర్లు ఎల్లప్పుడూ నీటిని తాకుతూ ఆకులు ఎల్లప్పుడు మంచుతో తడిగా ఉండే చెట్టులా నేను ఉన్నాను.

[20] నాలో నా మహిమ ఎల్లప్పుడూ కొత్తదిగా ఉంటుంది. నాచేతిలో ఒక కొత్త విల్లు ఉన్నట్టుగా నేను ఎల్లప్పుడూ బలంగా ఉంటాను.

[21] “నేను మాట్లాడటం చాలించిన తరువాత నా మాటలు వింటున్న ప్రజలు చెప్పాల్సింది ఇంకేమీ ఉండేది కాదు. నా మాటలు వారి చెవులకు సౌమ్యంగా వినిపించేవి.

[22] ప్రజలు వర్షంకోసం వేచి ఉన్నట్టు, నేను మాట్లాడాలని వారు వేచి ఉండేవారు.

[23] నా మాట వసంతకాలపు వర్షంలా ఉండేది నా మాటల్ని వారు పానం చేసేవారు. అధైర్య పడిన వారిని చూచి నేను చిరునవ్వు నవ్వే వాడిని.

[24] నా ప్రసన్న ముఖం క్రుంగిన ప్రజలకు మంచి అనుభూతిని కలిగించేది.

[25] ప్రజల పట్ల బాధ్యత వహించి నేను నిర్ణయాలు చేసాను. నేను నాయకుణ్ణి అయ్యాను. తన సైన్య దళాలలో ఒక రాజులా నేను జీవించాను. చాలా విచారంలో ఉన్న ప్రజలకు ఆదరణ ఇచ్చే మనిషిలా నేను ఉన్నాను.

యోబు — Chapters