[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, “నీవు ఇస్రాయేల్‌ప్రజలతో ఈ విధంగా చెప్పు:
[2] ఒక వ్యక్తి నాజీర్‌ను అవుతానని ప్రత్యేకమైన మొక్కుబడి చేస్తాడనుకోండి. పురుషుడు గానీ స్త్రీ గానీ ఎవరైనా యెహోవాకు నాజీర్‌గా తనను ప్రతిష్ఠించుకొంటే ఆ వ్యక్తి ద్రాక్షమద్యం, ప్రతివిధమైన మద్యం మానాలి.
[3] పులియబెట్టి చేసిన రసమూ ద్రాక్షరసమూ ద్రాక్షపళ్ళతో చేసిన ఏ పానీయమూ ఆ వ్యక్తి త్రాగకూడదు. ద్రాక్షపండ్లు పచ్చివి గానీ ఎండినవి గానీ తినకూడదు.
[4] అతడు నాజీర్‌గా ఉన్న రోజులన్నీ పచ్చి కాయలూ పై తోలూ – ద్రాక్షచెట్టునుంచి వచ్చేదేదీ తినకూడదు.
[5] నాజీర్ మొక్కుబడి చెల్లే రోజులన్నీ మంగలకత్తి అతడి తలమీద వేయకూడదు. అతడు యెహోవాకు తనను ప్రతిష్ఠించుకొన్న కాలం ముగిసేవరకు అతడు ప్రత్యేకమైనవాడై ఉండి తన తల వెంట్రుకలను పెరగనివ్వాలి.
[6] తనను దేవునికి ప్రతిష్ఠించుకొన్న సంగతికి ఆ చిహ్నం అతడి తలమీద ఉంటుంది, గనుక యెహోవాకు ప్రతిష్ఠించుకొన్న కాలమంతట్లో అతడు ఏ శవాన్నీ సమీపించకూడదు.
[7] అతడి తండ్రి గానీ తల్లి గానీ తోడబుట్టినవాడు గానీ తోడబుట్టినది గానీ చనిపోయినా, చనిపోయిన ఆ వ్యక్తిని బట్టి తనను అశుద్ధం చేసుకోకూడదు.
[8] అతడు నాజీర్‌గా ఉన్న రోజులన్నీ యెహోవాకు ప్రత్యేకమైనవాడు.
[9] “ఒకవేళ ఎవరైనా అతడిదగ్గర అకస్మాత్తుగా చనిపోవడంవల్ల అతడి ప్రతిష్ఠితమైన తలవెంట్రుకలు అశుద్ధం అవుతాయి అనుకోండి. ఆ పక్షంలో ఏడు రోజుల తరువాత తాను శుద్ధం అయ్యే రోజున తన తల గొరిగించుకోవాలి.
[10] ఎనిమిదో రోజు అతడు రెండు గువ్వలను గానీ రెండు పావురం పిల్లలను గానీ సన్నిధిగుడారం ద్వారం దగ్గరికి యాజిదగ్గరికి తేవాలి.
[11] యాజి వాటిలో ఒకదానిని పాపాలకోసమైన బలిగా రెండోదానిని హోమంగా అర్పిస్తాడు. పీనుగును తాకడంవల్ల ఆ వ్యక్తి చేసిన తప్పిదాన్ని యాజి అలా కప్పివేస్తాడు. ఆరోజే అతడి తలను మళ్ళీ ప్రతిష్ఠించాలి.
[12] అప్పుడు ఆ వ్యక్తి అపరాధబలిగా ఏడాది మగ గొర్రెపిల్లను తేవాలి. నాజీర్‌గా ఉండే కాలం మళ్ళీ యెహోవాకు ప్రతిష్ఠించాలి. అతడి ప్రతిష్ఠితమైన తల వెంట్రుకలు అశుద్ధమైపోయాయి, గనుక మునుపటి మొక్కుబడి రోజులు లెక్కలోకి రావు.
[13] “ఆ వ్యక్తి నాజీరై ప్రత్యేకంగా ఉన్న రోజులు ముగిసిన తరువాత అతణ్ణి గురించిన ఉపదేశం ఇది: అతడు తన అర్పణ సన్నిధిగుడారం ద్వారం దగ్గరికి తీసుకురావాలి.
[14] అతడు యెహోవాకు అర్పించవలసినవి – హోమంగా లోపం లేని ఏడాది మగ గొర్రెపిల్ల, పాపాలకోసమైన బలిగా లోపం లేని ఏడాది ఆడ గొర్రెపిల్ల, శాంతిబలిగా లోపం లేని పొట్టేలు,
[15] పొంగజేసేదేదీ లేకుండా, నూనె కలిపిన మెత్తని గోధుమపిండితో చేసిన వంటలతోను నూనె పూసిన అప్పడాలతోను నిండివున్న గంప, వాటి నైవేద్యమూ, పానార్పణమూ.
[16] యాజి వాటిని యెహోవా సన్నిధానంలోకి తేవాలి; పాపాలకోసమైన అతడి బలినీ, హోమాన్నీ సమర్పించాలి.
[17] ఆ గంపెడు పొంగని వంటలతోపాటు ఆ పొట్టేలును యెహోవాకు శాంతిబలిగా సమర్పించాలి. అతడి నైవేద్యాన్నీ పానార్పణనూ కూడా సమర్పించాలి.
[18] అప్పుడా నాజీర్ సన్నిధిగుడారం ద్వారందగ్గర తన ప్రతిష్ఠితమైన తలవెంట్రుకలు గొరిగించుకొని, వాటిని తీసుకొని శాంతిబలిక్రింద ఉన్న నిప్పులో వేయాలి.
[19] నాజీర్ తన ప్రతిష్ఠితమైన తలవెంట్రుకలు గొరిగించుకొన్నాక యాజి ఇలా చెయ్యాలి: ఆ పొట్టేలును వండిన తరువాత దాని జబ్బను, ఆ గంపలోనుంచి పొంగని ఒక వంటనూ ఒక అప్పడాన్నీ తీసుకొని నాజీర్ చేతులమీద వాటిని ఉంచాలి.
[20] అప్పుడు యాజి వాటిని కదలిక అర్పణగా యెహోవా సన్నిధానంలో అటూ ఇటూ కదల్చాలి. అది కదలిక బోరతో ప్రతిష్ఠితమైన తొడతోపాటు ప్రత్యేకంగా యాజికి చెందుతుంది. ఆ తరువాత నాజీర్ ద్రాక్షరసం తాగవచ్చు.
[21] “మొక్కుబడి చేసుకొన్న నాజీర్‌ను గురించిన ఉపదేశం ఇదే. నాజీర్ కావడంచేత అతడు యెహోవాకు సమర్పించవలసినవి ఇవే. దానికంటే ఎక్కువ అర్పించగలిగితే అర్పించవచ్చు. అయితే నాజీర్‌ను గురించిన ఈ ఉపదేశం ప్రకారం అతడు తన మొక్కుబడి నెరవేర్చాలి.”
[22] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,
[23] “నీవు అహరోనుతోను అతడి కొడుకులతోను ఈ విధంగా చెప్పు: మీరు ఇస్రాయేల్ ప్రజలను ఇలా దీవించాలి.
[24] ‘యెహోవా మిమ్ములను దీవించి కాపాడుతాడు గాక!
[25] యెహోవా మీకు తన ముఖకాంతి ప్రకాశించేలా చేసి మిమ్ములను దయ చూస్తాడు గాక!
[26] యెహోవా తన ముఖం మీవైపు తిప్పుకొని మీకు శాంతి ప్రసాదిస్తాడు గాక!
[27] “ఈ విధంగా వారు ఇస్రాయేల్ ప్రజల మీద నా పేరు పలకాలి. నేను ఆ ప్రజలను దీవిస్తాను.”