[1] అప్పుడు యోసేపు కొడుకైన మనష్షే వంశీయులలో సెలోపెహాదు కూతుళ్ళు సన్నిధిగుడారం దగ్గరికి వచ్చారు. సెలోపెహాదు హెపెరు కొడుకూ గిలాదు మనుమడూ మాకీరు మునిమనుమడూ. అతడి కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.
[2] వారు సన్నిధిగుడారం ద్వారందగ్గర మోషే ఎదుటా ఎలియాజరుయాజి ఎదుటా నాయకుల ఎదుటా సర్వ సమాజం ఎదుటా నిలబడి ఇలా అన్నారు:
[3] “మా తండ్రిగారు ఎడారిలో చనిపోయారు; ఆయన యెహోవాకు విరోధంగా పోగైన కోరహు బృందంలో లేడు గాని తాను చేసిన పాపాల కారణంగా చనిపోయాడు. ఆయనకు కొడుకులు కలగలేదు.
[4] మా తండ్రికి కొడుకులు లేనంతమాత్రంచేత ఆయన పేరు ఆయన వంశంలో లేకుండా పోవాలా? మా తండ్రి అన్నదమ్ములతోపాటు మాకూ వారసత్వం వచ్చేలా చూడండి.”
[5] వారి విషయం మోషే యెహోవా సన్నిధానంలో మనవి చేశాడు.
[6] యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
[7] “సెలోపెహాదు కూతుళ్ళు చెప్పినది ధర్మమే. వారి తండ్రి అన్నదమ్ములతోపాటు వారసత్వం వారి స్వాధీనం చేసితీరాలి. వారి తండ్రి వారసత్వం వారికి చెందేలా చేయాలి.
[8] అంతేగాక, నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పాలి: కొడుకు లేకుండా ఒక మనిషి చనిపోతే మీరు అతడి వారసత్వం అతడి కూతురికి వచ్చేలా చేయాలి.
[9] ఒక వేళ అతడికి కూతురు లేకపోతే అతడి ఆస్తికి వారసులు అతడి అన్నదమ్ములు.
[10] అతడికి అన్నదమ్ములు లేకపోతే అతడి వారసత్వం అతడి తండ్రి అన్నదమ్ములకు ఇవ్వాలి.
[11] అతడి తండ్రికి అన్నదమ్ములు లేకపోతే అతడి వారసత్వం అతడి కుటుంబంలో సమీప బంధువుకు రావాలి. ఆ బంధువు దానిని స్వాధీనం చేసుకొంటాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇది ఇస్రాయేల్ ప్రజలకు విధించిన నిర్ణయం.”
[12] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు: “నీవు ఈ అబారీం పర్వతమెక్కి నేను ఇస్రాయేల్‌ప్రజలకు ఇచ్చిన దేశాన్ని చూడు.
[13] దానిని చూచినతరువాత నీ అన్న అహరోను తన పూర్వీకులదగ్గరికి చేరినట్టు నీవూ చేరుతావు.
[14] ఎందుకంటే, సీన్ ఎడారిలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ళదగ్గర వారి కళ్ళెదుట నా పవిత్రాన్ని నువ్వు నిలబెట్టలేదు, నా ఆజ్ఞ శిరసావహించలేదు.” ఆ నీళ్ళు సీన్ ఎడారిలో ఉన్న మెరీబా కాదేషు నీళ్ళే.
[15] మోషే యెహోవాతో ఇలా అన్నాడు:
[16] “యెహోవా! మానవులందరి ఆత్మలకు దేవా! యెహోవాయొక్క సమాజం కాపరిలేని గొర్రెలలాగా ఉండకుండేలా ఈ సమాజంమీద ఒక మనిషిని నియమించు.
[17] అతడు వారి ముందు వెళ్తూ వస్తూ ఉండాలి. వారిని వెలుపలికి తీసుకుపోవాలి, వారిని తిరిగి తీసుకురావాలి.”
[18] అందుకు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నూను కొడుకు యెహోషువ ఆధ్యాత్మిక వ్యక్తి. అతణ్ణి తీసుకువచ్చి అతడిమీద నీ చెయ్యి ఉంచు.
[19] అతణ్ణి ఎలియాజరుయాజి ఎదుటా సర్వసమాజం ఎదుటా నిలబెట్టి వారి కళ్ళెదుటే అతడికి ఆజ్ఞ ఇచ్చి అతణ్ణి నియమించాలి.
[20] ఇస్రాయేల్ ప్రజల సర్వసమాజం అతని మాట వినేలా అతనికి నీ ఘనతలో కొంత ఇవ్వాలి.
[21] ఎలియాజరుయాజి ఎదుట అతడు నిలబడ్డప్పుడు ఎలియాజరు యెహోవా సన్నిధానంలో ‘ఊరీం’ న్యాయనిర్ణయం ద్వారా అతని కోసం విచారించాలి. అతని మాట ప్రకారం అతడూ అతనితోపాటు ఇస్రాయేల్ ప్రజల సమాజమంతా బయలుదేరాలి, తిరిగి రావాలి.”
[22] యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు. యెహోషువను తీసుకువచ్చి ఎలియాజరు ముందూ సర్వసమాజం ముందూ అతణ్ణి నిలబెట్టాడు.
[23] యెహోవా తన ద్వారా ఆజ్ఞాపించినట్టే అతడిమీద చేతులు ఉంచి ఆజ్ఞ ఇచ్చి అతణ్ణి నియమించాడు.