Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషేతో ఇలా అన్నాడు:

[2] “నీవు ఇస్రాయేల్‌ ప్రజలతో ఈ విధంగా చెప్పు – నేను మీకిచ్చే దేశంలో, మీరు నివసించబోయే ఆ దేశంలో ప్రవేశించిన తరువాత మీరు అర్పణలు అర్పించేటప్పుడు ఈ నియమాలు అనుసరించాలి:

[3] “అది మొక్కుబడి విషయమైన హోమం కానివ్వండి, బలి కానివ్వండి, స్వేచ్ఛార్పణ కానివ్వండి, నియామక కాలాలలో యెహోవాకు పరిమళ అర్పణగా పశువులలో నుంచీ గొర్రె మేకలలోనుంచీ మీరు అర్పించేది కానివ్వండి,

[4] యెహోవాకు అర్పణ చేసేవాడు ఒక లీటర్ నూనెతో కలిపిన ఒక కిలోగ్రాం గోధుమ పిండిని కూడా నైవేద్యంగా తేవాలి.

[5] అంతే గాక, ఒక్కొక్క గొర్రెపిల్లతో పాటు పానార్పణంగా ఒక లీటర్ ద్రాక్షరసం తేవాలి. అది హోమంమీద గానీ బలిమీద గానీ పోయడానికే.

[6] ఆ బలి పొట్టేలైతే లీటరున్నర నూనెతో కలిపిన రెండు కిలోగ్రాముల గోధుమ పిండిని నైవేద్యంగా సిద్ధం చేయాలి.

[7] యెహోవాకు పరిమళంగా ఉన్న పానార్పణంగా లీటరున్నర ద్రాక్షరసం కూడా తేవాలి.

[8] మొక్కుబడి చెల్లించడానికి, లేకపోతే, యెహోవాకు శాంతిబలిగా ఉండడానికి హోమంగా గానీ బలిగా గానీ ఒక కోడెను తీసుకువస్తే,

[9] ఆ కోడెతోపాటు నైవేద్యంగా రెండు లీటర్ల నూనెతో కలిపిన మూడు కిలోల గోధుమపిండి తేవాలి. రెండు లీటర్ల ద్రాక్షరసం పానార్పణంగా తేవాలి.

[10] అది యెహోవాకు పరిమళ హోమంగా ఉంటుంది.

[11] “అర్పణగా తెచ్చే ప్రతి కోడె, పొట్టేలూ, మగ గొర్రెపిల్లా, మగ మేకపిల్ల విషయంలో మీరు ఆ విధంగానే చెయ్యాలి.

[12] మీరు తెచ్చిన వాటి లెక్క ప్రకారం ప్రతిదాని విషయంలో అలా చెయ్యాలి.

[13] స్వదేశస్తులలో ఎవరైన యెహోవాకు పరిమళ హోమం తెస్తే ఆ విధంగా చేయాలి.

[14] మీమధ్య నివసించే విదేశస్తులు గానీ తరతరాలనుంచి మీమధ్య ఉన్న వారిలో ఎవరైన గానీ యెహోవాకు పరిమళ హోమం అర్పించదలిస్తే మీరు చేసినట్టే వారూ చెయ్యాలి.

[15] సమాజంలో మీకూ మీ మధ్య నివసించే విదేశీయుడికీ ఒక్కటే చట్టం. యెహోవా సన్నిధానంలో మీరున్నట్టే విదేశీయులూ ఉంటారు.

[16] మీకూ మీమధ్య నివసించే విదేశీయులకూ ఒక్కటే ఉపదేశం, ఒక్కటే నిర్ణయం ఉండాలి.”

[17] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు,

[18] “నీవు ఇస్రాయేల్‌ప్రజలతో ఈ విధంగా చెప్పు: నేను మిమ్ములను తీసుకుపోతున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత,

[19] ఆ దేశం ఆహారం తిన్నప్పుడు దానిలో ఒక భాగం ప్రత్యేకమైన కానుకగా యెహోవాకు అర్పించాలి.

[20] మీ మొదటి పిండి ముద్దలోనుంచి ఒక రొట్టెను అర్పించాలన్నమాట. మీ కళ్ళంలోని ధాన్యంలోనుంచి కొంత అర్పించినట్టే దానిని అర్పించాలి.

[21] మీ తరతరాలకు మీ మొదటి పిండి ముద్దలోనుంచి ఒక భాగం యెహోవాకు అర్పించాలి.

[22] “యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో దేనినైనా పొరపాటున మీరు మీరితే,

[23] యెహోవా ఆజ్ఞలు ఇవ్వడం మొదలు పెట్టిన రోజునుంచి మీకూ తరువాతి తరాలకూ యెహోవా మోషేమూలంగా ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరు పొరపాటున మీరితే,

[24] తెలియకుండానే పొరపాటున సమాజమంతా అలా ఆజ్ఞ మీరితే సమాజమంతా యెహోవాకు పరిమళ హోమంగా ఒక కోడెదూడను అర్పించాలి. ధర్మనిర్ణయం ప్రకారం ఆ హోమంతోపాటు దానికి సంబంధించిన నైవేద్యమూ పానార్పణమూ అర్పించాలి. పాపాలకోసమైన బలిగా ఒక మేకపోతును కూడా అర్పించాలి.

[25] యాజి ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతటికోసం ప్రాయశ్చిత్తం చేసి వారికి క్షమాపణ దొరికేలా చేస్తాడు. వాళ్ళు తప్పిదం పొరపాటున చేశారు గదా! వారి పొరపాటుకోసం యెహోవాకు హోమంగా, ఆయన సన్నిధానంలో అర్పించడానికి పాపాలకోసమైన బలిగా వారి అర్పణలను తీసుకువచ్చేటప్పుడు,

[26] ఇస్రాయేల్ ప్రజల సమాజమంతటికీ క్షమాపణ దొరుకుతుంది. వారిమధ్య కాపురమున్న విదేశీయులకు కూడా క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే ప్రజలందరూ తెలియకుండానే ఆ పొరపాటు చెయ్యడం జరిగింది.

[27] “ఒక వ్యక్తి పొరపాటున తప్పిదం చేస్తే, అతడు పాపాలకోసమైన బలిగా ఏడాది ఆడ మేకను అర్పించాలి.

[28] పొరపాటున తప్పిదం చేసిన ఆ వ్యక్తికోసం యాజి యెహోవా సన్నిధానంలో ఆ వ్యక్తి తప్పిదాన్ని కప్పివేయాలి. యెహోవా అతణ్ణి క్షమిస్తాడు.

[29] ఇస్రాయేల్ ప్రజలలో జన్మించినవారు గానీ వారిమధ్య కాపురమున్న విదేశీయులు గానీ ఎవరైనా పొరపాటున తప్పిదం చేస్తే వారికి అదే చట్టం వర్తిస్తుంది.

[30] అయితే ఎవరైనా స్వదేశస్తుడు కానివ్వండి విదేశస్తుడు కానివ్వండి – గర్వించి బుద్ధిపూర్వకంగా తప్పిదం చేస్తే, ఆ వ్యక్తి యెహోవానే దూషిస్తున్నాడు, గనుక వాణ్ణి తన ప్రజలలో లేకుండా చేయాలి.

[31] వాడు యెహోవా మాట తృణీకరించి ఆయన ఆజ్ఞను మీరినందుచేత వాడు తప్పక లేకుండా పోవాలి. వాడి అపరాధం వాడిమీద ఉంటుంది.”

[32] ఇస్రాయేల్‌ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిరోజున కట్టెలు ఏరడం చూశారు.

[33] వాడు కట్టెలు సేకరించడం చూచినవారు మోషే అహరోనుల దగ్గరికీ సమాజమంతటి దగ్గరికీ వాణ్ణి తీసుకువచ్చారు.

[34] వాడికి ఏం చెయ్యాలో అది స్పష్టం కాలేదు గనుక వాణ్ణి కావలిలో ఉంచారు.

[35] అప్పుడు యెహోవా మోషేతో, “ఆ మనిషి మరణశిక్ష పొందాలి. సర్వసమాజం శిబిరం వెలుపల రాళ్ళు రువ్వి వాణ్ణి చంపాలి” అన్నాడు.

[36] అందుచేత యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞప్రకారం, సమాజమంతా శిబిరం వెలుపలికి వాణ్ణి తీసుకు పోయి రాళ్ళు రువ్వి చంపారు.

[37] తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు:

[38] “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు: వారు తరతరాలకు తమ బట్టల అంచులకు కుచ్చులు వేసుకొని, ఆ కుచ్చులమీద నీలిదారం తగిలించాలి.

[39] ఇందులో నా ఉద్దేశమేమిటంటే, మీరు ఆ కుచ్చులను చూచి యెహోవా ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారం ప్రవర్తించాలి. మునుపు మీరు మీ హృదయంలోని ఆశలనూ నేత్రాశలనూ అనుసరించి వేశ్యలలాగా తిరుగాడేవారు. ఇప్పుడు అలా ప్రవర్తించకూడదు.

[40] ఆ కుచ్చులను చూచి నా ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారం ప్రవర్తిస్తూ, మీ దేవునికి పవిత్రులుగా ఉండాలి.

[41] నేను యెహోవాను, మీ దేవుణ్ణి, మీకు దేవుడిగా ఉండడానికి మిమ్ములను ఈజిప్ట్‌దేశంనుంచి తీసుకువచ్చినవాణ్ణి. మీ దేవుడైన యెహోవాను నేనే.”

సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు) — Chapters