[1] ఇస్రాయేల్ ప్రజలు షిత్తీంలో మకాం చేశారు. అక్కడ వారు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయసాగారు.
[2] ఆ స్త్రీలు తమ దేవుళ్ళ బలులకు వారిని పిలిచారు. వారు వెళ్ళి భోజనం చేసి ఆ దేవుళ్ళకు సాష్టాంగ నమస్కారం చేశారు.
[3] ఈ విధంగా ఇస్రాయేల్ ప్రజలు పెయోర్ బయల్ దేవుడికి లొంగిపోయినందుచేత వారిమీద యెహోవా కోపాగ్ని రగులుకొంది.
[4] యెహోవా మోషేతో “నీవు ఆ ప్రజల నాయకులందరినీ తోడుకొని పట్టపగలే యెహోవా సన్నిధానంలో వారిని ఉరి వేసి చంపాలి. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇస్రాయేల్ ప్రజలమీద నుంచి తొలగిపోతుంది” అన్నాడు.
[5] అందుచేత మోషే ప్రజల న్యాయాధిపతులతో “పెయోర్ బయల్ దేవుడికి లొంగిపోయిన వాళ్ళను చంపాలి. మీలో ప్రతి ఒక్కరూ తన తన వంశంలో ఉన్న అలాంటివాళ్ళను చంపండి” అన్నాడు.
[6] అప్పుడు ఇస్రాయేల్ ప్రజలంతా సన్నిధిగుడారం ద్వారందగ్గర సమకూడి ఏడుస్తూ ఉండగానే వారి కండ్ల ఎదుటా మోషే కండ్ల ఎదుటా ఇస్రాయేల్ ప్రజల్లో ఒకడు తనవారి దగ్గరికి ఒక మిద్యాను స్త్రీని వెంటబెట్టుకొని వచ్చాడు.
[7] ఫీనెహాసు అది చూశాడు. ఫీనెహాసు యాజి అయిన అహరోను మనుమడూ ఎలియాజరు కొడుకూ. అతడు సమాజంనుంచి లేచి ఈటెను చేతపట్టుకొని
[8] ఆ ఇస్రాయేల్‌వాడి వెంటపడి అతడి గుడారంలో ప్రవేశించి అతణ్ణీ ఆ స్త్రీనీ కడుపుగుండా దూసుకుపోయేలా ఈటెతో పొడిచాడు. అప్పుడు ఇస్రాయేల్ ప్రజల మధ్య విపత్తు నిలిచిపోయింది.
[9] ఆ విపత్తువల్ల చనిపోయినవారు ఇరవై నాలుగు వేలమంది.
[10] తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
[11] “యాజి అయిన అహరోను మనుమడూ ఎలియాజరు కొడుకైన ఫీనెహాసు ఇస్రాయేల్ ప్రజల మీదనుంచి నా కోపం మళ్ళించాడు. అతడు నా పక్షంగా రోషం చూపించాడు, గనుక నేను నా రోషంతో వారిని నాశనం చేయలేదు.
[12] కాబట్టి ఇలా ప్రకటించు: ఫీనెహాసు తన దేవుని విషయం రోషం కలిగి ఇస్రాయేల్ ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు,
[13] గనుక నేను అతనితో నా ఒడంబడిక చేస్తున్నాను. అది శాంతి ఒడంబడిక. శాశ్వతమైన యాజి పదవిని గురించిన ఒడంబడిక. ఇది అతనికీ అతని సంతానానికీ ఎప్పటికీ నిలిచి ఉండే ఒడంబడిక.”
[14] ఆ మిద్యాను స్త్రీతో హతమైనవాడి పేరు జిమ్రీ. అతడు సాలూ కొడుకు, షిమ్యోనుగోత్రంలో పూర్వీకుల కుటుంబాలలో ఒక కుటుంబానికి నాయకుడు.
[15] హతమైన మోయాబు స్త్రీ పేరు కొజ్బీ. ఆమె సూర్ కూతురు. అతడు మిద్యాను పూర్వీకుల కుటుంబాలలో ఒకదానికి నాయకుడు.
[16] అది జరిగాక యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
[17] “మిద్యానువాళ్ళు తంత్రాలు చేసి మీకు విరోధులయ్యారు. పెయోర్‌దేవుడి విషయంలో, విపత్తు వచ్చినరోజున హతమైన తమ సోదరీ మిద్యాను నాయకుడి కూతురూ అయిన కొజ్బీ విషయంలో వాళ్ళు మిమ్ములను మోసగించారు.
[18] గనుక మీరు వాళ్ళకు విరోధులై వాళ్ళను కూలగొట్టాలి.”